25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథా విశ్లేషణ-17(బి)

అజయ్ ప్రసాద్ రచించిన జాతక కథ అత్యంత ఆసక్తికరంగా ఆరంభమవుతుంది. హింస అంటే ఆయుధం కాదు- కారణం అని తెలుసుకున్నప్పుడు నిజంగా నేను భయపడ్డాను అంటూ ఆరంభమవుతుంది కథ. అయితే మొదటి పేరాలోనే మనిషి జాతకంలో తీరని అశాంతికి, అపారమైన దుహ్ఖానికి సర్వకాలావస్థల్లోనూ కారణాలు ఒకటే అన్నది నేను తెలుసుకున్న సత్యం అని గుట్టు విప్పేస్తాడు. ఆతరువాత కథ ప్రారంభమవుతుంది.
ఆరామంలో చదువు పూర్తయిన తరువాత ఒక బౌద్ధ భిక్షువు భిక్షాయాత్ర ప్రారంభిస్తాడు. యాత్రావర్ణన ఆసక్తి కలిగిస్తుంది. కళింగ రాజ్యం దాటిన తరువాత ఒక అడవి చేరతాడు. ఆ అడవిలో ఒక గాయపడిన స్త్రీ కనిపిస్తుంది. ఆమె భర్త ఆమె ఆభరణాలు లాక్కుని ఆమెని పొడిచి పారిపోతాడు. ఆమె మరణిస్తుంది. ఆమె దుస్థితి గురించి ఆలోచిస్తూ, మనుషులను అంతంచేసే అంతులేని కోరికలకు అవి తీరక కలిగే అపారమైన దుహ్ఖానికి అంతం ఎక్కడ అని ఆలోచిస్తూ ముందుకు సాగుతాడు. కాస్త దూరం వెళ్ళిన తరువాత ఒక పురుషుడు చావు అంచున కనిపిస్తాడు. అతడొక స్త్రీ మోహంలో పడి భార్యను చంపుతాడు. ఆ స్త్రీ తన ప్రియుడితో కలిసి అతడిని చంపి నగలు లాక్కుని వెళ్తుంది. అడవిలోని క్రూర మృగాలు అతడిని లాక్కెళ్తాయి. అది చూసిన భిక్షువు స్త్రీ పురుషులు వివాహమనే చట్రంలో బంధింపబడ్డారు.అక్కడినుంచే స్త్రీ పురుషుల హక్కులు స్వేచ్చ సమాధి చేయబడుతున్నాయి…అని ఆలోచిస్తాడు. ఇక్కడ ఒక పేరా వివాహ వ్యవస్థ దాని వల్ల సమాజంలో అశాంతి జనించటంవంటి వాటి గురించి ఒక పేరా ఆలోచన వుంటుంది.
ఇంతవరకూ చక్కగా సాగుతున్న కథ ఇక్కడినుంచీ దారి తప్పుతుంది. ఉత్తమ కథా సంపాదకులకు వివాహ వ్యవస్థను దూషించి తప్పు పట్టే కథలే కావాలి. అవే ఉత్తమ కథలు. ఇంతవరకూ ఒక భిన్నమయిన రీతిలో వినూత్నమైన పంథాలో సాగుతున్న కథ ఇక్కడనుంచీ అలవాటయిన సాంప్రదాయ వ్యవస్థలను తప్పుపట్టి, భారతీయ జీవన విధానన్ని దూషించే బాట పడుతుంది. అదీగాక, భార్యను చంపి ప్రియురాలి చేతిలో మోసపోయిన ఒక సంఘటనను చూసి, వివాహ వ్యవస్థనే హింసకూ అశాంతికీ మూలం అని తీర్మానించేయటం ఆ భిక్షువు మేధను మానసిక స్థిని ప్రశ్నార్ధకంలో పారేస్తాయి. ఓ ముసలవ్వని, శవాన్ని చూసి బుద్ధుడు వైరాగ్యాన్ని పొంది జగద్రక్షక సత్యాన్ని అన్వేషించివుండవచ్చుగాక, కానీ, ఈ కథలో భిక్షువు సత్యానేషణ ఇక్కడినుంచి తప్పుదారి పడుతుంది.
అక్కడినుంచి ఆ భిక్షువు ఓ రాజ్యంలోకి వెళ్తాడు. అక్కడ సైనికులు అతదిని వేధిస్తారు. దాన్ని రాజ్య హింసగా పరిగణిస్తాడు. అందరూ సమిష్టిగా జీవనం సాగిస్తున్నప్పుడు అందరికీ సమానహోదా ఎందుకులేదని అణగారిపోతున్న వర్గాల గురించి ఆలోచిస్తాడు. ఇదంతా వామపక్ష ఆలోచనల ప్రచార కరపత్రంలోంచి ఎత్తుకొచ్చిన ఆలోచనల్లా వుంటాయి తప్ప ఈ ఆలోచనల్లో నిజాయితేఅ కానీ, అన్వేషణ కానీ కనబడవు. అంతేకాదు, కథ ఆవిరయిపోయి ఇదొక వ్యాసంలా సిద్ధంత ప్రతిపాదక ఉపన్యాసానికి ఉపోద్ఘాతంలా అనిపిస్తుంది. కథ ఇక్కడికి అయిపోతుంది. ఒకటిన్నర పేజీల ఆలోచనలుంటాయి. చివరలో తిరిగి విహారానికి చేరుకున్న భిక్షువుకు సిద్ధార్ధుడి శిలా ముఖప్రతిమ దొరుకుతుంది. ఇన్నాళ్ళూ విస్తరిస్తూ పోతున్న అశాంతికి హింసకు పునాదులు అన్వేషించాను. వాటికి కారణాలు అన్ని కాలాలలోనూ ఒకటిగా వుండబోతున్నాయా అన్నది చెప్పగలిగింది భవిష్యత్తు మాత్రమే అన్న తీర్మానంతో కథ ముగుస్తుంది.
కథ ఆరంభంలో ఒక కొత్త కథ, విభిన్నమయిన కథ చదవబోతున్నామన్న ఆలోచన కలుగుతుంది. కాస్త కథ ఆసక్తిని కలిగిస్తుంది. కానీ, మధ్యలో గతి తప్పి అలవాటయిన బాటలో, ఉపన్యాసాలతో, సిద్ధాంతాల ప్రతిపాదనతో ఒక అసంపూర్ణ వ్యాసంలా ముగుస్తుంది. అదీగాక, కథ ఆరంభంలో మనిషి అశాంతికి, దుహ్ఖానికి సర్వకాలాల్లో కారణాలొకటే అన్నది తాను తెలుసుకున్న సత్యం అన్న వ్యాఖ్య వుంతుంది. కానీ కథ చివరలో వాటికి కారణాలు అన్ని కాలాల్లోను ఒకటిగా వుండబోతున్నాయా అన్నది చెప్పగలిగింది భవిష్యత్తు మాత్రమే అంటాడు. ఇది కథ మొదట్లో తాను తెలుసుకున్నానన్న సత్యాన్ని ఖండిస్తుంది. ఇంతకీ కథ చదివిన తరువాత ఆ భిక్షువు మేధ పైన, తెలివిపైన తీవ్రమయిన అనుమానాలు కలుగుతాయి.
రచయిత సమకాలీన పరిస్థితులను సిద్ధాంతాలను గతంలోని ఒక కాల్పనిక చారిత్రిక పరిస్థితుల్లో ఆరోపించి చూపించాలని చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ఇది హిస్టారికల్ ఫాంటసీ ప్రక్రియ క్రిందకు వస్తుంది. అంటే చరిత్రలోని కొన్ని విషయాల ఆధారంగా కాల్పనిక పాత్రలు సృజించి వాటితో ఆనాటి పరిస్థితులను తలపింపచేస్తూ, ఇప్పటి సమాజంలోని సందేహాలకు సమాధానం ఇవ్వటం ఈ ప్రక్రియలో కనిపిస్తుంది. కానీ, రచయిత ఈ ప్రక్రియను ఒక కథగా మలచతంలో విఫలమయ్యాడు. సిద్ధాంతాన్ని చెప్పతంపై వున్న ఆసక్తి కథనంపై లేకపోవతంతో అనేక ఇతర ఉత్తమ కథల్లాగే ఇదికూడా అర్ధంపర్ధంలేని వామపక్ష సాంప్రదాయ వ్యతిరేక సిద్ధాంత డాక్యుమెంటరీలా తయారయింది. పైగా కథ మొదట్లోని సత్యాన్ని చివర్లోని తీర్మానం ఖండించటం కథలో కషమించరాని లోపం. అంటే సంపాదకులు వివాహ వ్యవస్థ విమర్శ, రాజ్య హింస ఖందన వంటి అంశాల మాయలో పడకుండా కథను ఒక సమతౌల్య దృష్టిలో చూసివుంటే రచయిత ప్రతిభ కనిపిస్తూన్నా, రచయిత కొత్త రీతిలో కథను చెప్పాలను ప్రయత్నిస్తూన్నా, ఇది శిల్ప పరంగా , కథలో రచయిత ప్రదర్శించిన అనేక అంశాల పరంగా అపరిపక్వమయిన కథ అని గ్రహించేవారు. ముఖ్యంగా , గతంలోని వోల్గా, కుప్పిలి పద్మ ఇతర సిధాంత రచయితల కథల్ల ఒక సంఘటనతో జగద్రక్షక సత్యాలను గ్రహించేయటమన్న లోపం ఈ కథలోనూ స్పష్తంగా కనిపిస్తుంది. అయితే, సంపాదకులీ కథను ఉత్తమ కథగా ఎన్నుకోవటం వెనుక వామపక్ష సిద్ధాంతాలు, సాంప్రదాయ వ్యవస్థల దూషణ, రాజ్యహింస తదితర అంశాలతో పాటూ రచయిత అరస విరస నీరస నోరస సంస్థలతో పరిచయం వుండటం అరుణతార పత్రికలో ఈ కథ ప్రచురితమవటంకూడా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసి వుంటాయి.
అరస విరస నీరస నోరస కథలనే ఉత్తమ కథలుగా భావిస్తారీ ఉత్తమ కథల సంపాదకులన్న అభిప్రాయాన్ని తప్పని నిరూపిస్తుందీ అజయ్ ప్రసాద్ కథ. ఎందుకంటే ఇది హిస్టారికల్ ఫాంటసీ కథ. అంటే సంపాదకులు హిస్టారికల్ ఫంటసీ కథలను కూడా పరిగణిస్తారని అర్ధం అవుతుంది. కానీ, అంతకుముందు, ఆ తరువాత ప్రచురితమయిన అనేక అత్యద్భుతమయిన హిస్టారికల్ ఫిక్షన్ కథలు హిస్టారికల్ ఫాంటసీ కథలు ఉత్తమ కథలుగా ఎంపికవలేదు. ఇందుకు కారణం ఆయా కథలు భారతదేశ గొప్పతనాన్ని, మన పూర్వీకుల ఔన్నత్యాన్ని ఉత్తమత్వాన్ని మన జీవన విధానంలోని గొప్పతనన్ని ప్రదర్శించిన కథలు. మన గతాన్ని చూసి సిగ్గుతో తలదించుకునే న్యూనతాభావాన్ని కలిగించే కథలుకావవి. దేశ ప్రజలలో ఆత్మగౌరవాన్ని రగిలించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి గతాన్ని చూసి గర్వించేట్టు చేసే కథలవి. దేశ భక్తి, ధరమనురక్తిని రగిలించే కథలవి. అందుకవి ఈ సంపాదకుల దృష్టి బాహిరమయ్యాయి. వారి పరిథికందకుండా ఉత్తమ స్థాయిలో నిలిచాయి. కాబట్టి, అలాంటి ఉత్తమ కథలు రాసికూడా ఈ సంకలనాల్లో ఎంపిక కాని రచయితలు బాధపడాల్సిన అవసరంలేదు. సంకుచితపు రంగుటద్దాల దృష్టి పరిథికిలోబడి ఉత్తమ కథగా ఎంపిక కానందుకు గర్వించాలి. అలా గర్విస్తున్న వాళ్ళలో నేనూ ఒకడిని.
అయితే, ఈ కథ చదివిన తరువాత రచయితగా అజయ్ ప్రసాద్ ఇతర మూస నీరస నోరస అరస కురస విరస రచయితలకు భిన్నమయిన రచనా సంవిధానాన్ని ఎన్నుకున్నాడని, మూస భావాలు ప్రదర్శించినా, కథా రచన సంవిధానంలో తనదయిన ప్రత్యేక పంథాను అనుసరించగల్ ప్రతిభ కలవాడని అనిపిస్తుంది. ఈ అభిప్రాయాన్ని తరువాత కథలు బలపరుస్తాయి.
మిగతా కథలగురించి వచ్చే వ్యాసంలో….

Enter Your Mail Address

March 13, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply