25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథలవిశ్లేషణ-7(సి)

2007లో ఉత్తమ కథల్లో ఒకటిగా ఎంపికయిన బీ అజయ్ ప్రసాద్ కథ లోయ చదివిన తరువాత చాలా సేపు వెంటాడుతుంది. కథలో గుప్పిటలో ఏముందో అన్న ఉత్సుకతను కల్పించటమేకాదు, గుప్పిట విప్పి చూపకుండా కథను ముగించటం ద్వారా,కథ పూర్తయినా కథకు వెంటాడే లక్షణాన్ని అత్యద్భుతమయిన రీతిలో ఆపాదించారు రచయిత.నిజానికి ఈ కథను ఉత్తమ కథ అని నిర్ద్వంద్వంగా ప్రకటించవచ్చు.
కథ సూటిగా ఎక్కడ ఆరంభమవాలో అక్కడే ఆరంభమవుతుంది ఆడమనిషితో రంకు అంటగట్టారని ఆచారి వెళ్ళిపోతాడు అతడు కొండ పైనున్న గుడిలో దీపం వెలిగిస్తాడు. అతడు వెళ్ళిపోవటంతో ఆ బాధ్యత శీను పై పడుతుంది కథంతా మనకు శీను దృష్టిలో తెలుస్తుంది. నిన్ననగా వెళ్ళిన మనిషి ఇంతవరకూ ఐపు లేదు అనిశీను ఆలోచిస్తూండటంతో కథ ప్రారంభమవుతుంది. ఊరివారు చెన్నమ్మ కు ఆచారికి సంబంధం అంటగడతారు చెన్నమ్మ ఎక్కడినుంచో పిల్లవాడితో వచ్చి జయమ్మ దగ్గర పనిచేస్తూంటుంది జయమ్మ మంచిది ఆమెకు ఆశ్రయమిస్తుంది. కానీ, ఈ సంబంధం విషయం వెలికి వచ్చేసరికి ముందు వెనుక ఆలోచించకుండా చెన్నమ్మను వెళ్ళిపొమ్మంటుంది. చెన్నమ్మ వెళ్ళటానికి సిద్ధపడుతుంది ఈలోగా కొండపైన గుడిలో దీపం వెలిగిస్తాడు శీను ఆచారి ఆలోచనలమధ్య అతడికి లోయలో గుప్పుమన్న వార్త నమ్మబుద్ధికాదు. అతడికి జయమ్మ పైన గౌరవం చెన్నమ్మపైన అభిమానమాచారి పట్ల గౌరవం….ఈ భావనల నడుమ సతమతమవుతూంటాడు. పనిచేయని మొగుడిని వదిలి పదినెలల పిల్లవాడితో అక్కడికి వచ్చిన చెన్నమ్మకు ఎవ్వరూ వుండరు ఎటూ వెళ్ళలేదు అయినా పిల్లవాదిని తీసుకుని వెళ్తుంది . శీను వారిద్దరి గురించి ఆలోచిస్తాడు చెన్నమ్మకెవ్వరూ లేరు. ఆచారికెవ్వరూ లేరు వాళ్ళిద్దరికీ ప్రేమ కలిగితే తప్పేమిటి? అని ఆలోచిస్తాడు.
చివరికి అంతా కలసి ఆయమ్మిని ఒంటరిని చేసి బయటకు నెట్టేసారని బాధపడతాడు కొండ దిగి వస్తూంటే వొంటరిగా పోతూ చెన్నమ్మకనిపిస్తుంది ఆమెకు తోడుగా వెళ్తాడు. ముగ్గురూ లోయనుంచి బయటకు నడవసాగారు అంటూ కథ ముగుస్తుంది.
ఈ కథ చదివిన తరువాత, ఇదీ కథా రచనా పద్ధతి అనిపిస్తుంది కథలో ఎక్కడా చర్చలు లేవు ఉపన్యాసాలు లేవు సిద్ధాంతాలు లేవు అక్సరాలతో చిత్రాన్ని గీయటం వుంది పాత్రలను, వ్యక్తిత్వాలను స్పష్టంగా చెక్కి చూపించటం వుంది ఎంతో లోతయిన అంశాన్ని అతి నర్మ గర్భితంగా ప్రస్తావించటం వుంది అనంతమయిన ఆలోచనలను కలిగించటం వుంది. కథలో భాగమయిన అనేక అంశాలను ప్రతీకలుగా వాడటం వుంది. అందుకే కథ చదివిన తరువాత చాలాసేపు మరచిపోలేకపోవటమేకాదు, కథ ఒక సినిమా దృశ్యంలా కళ్ళముందు నిలుస్తుంది. అత్యద్భుతమయిన కథ ఇది.
సాధారణంగా కథలో రచయిత చొరబడి ఉపన్యాసాలు ఇవ్వటం మంచి కథా రచన పద్ధతి కాదంటారు. కానీ, ఇంతవరకూ ఉత్తమ కథలుగా ఎన్నికయిన అనేక కథలు ఇలాగే వున్నాయివాటికి భిన్నంగా,రచయిత చెప్పాలనుకున్నది కేవ్లం కథ మాత్రమే చెప్పేట్టు సృజించిన కథ ఇదీందుకే లోయ కథ ఉత్తమ కథ. రచనాపరంగా,కథను చెప్పిన పద్ధతి పరంగా కూడా!

అజయ్ ప్రసాద్ మిగతా కథల విశ్లేషణ తరువాత వ్యాసంలో….

Enter Your Mail Address

March 18, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply