25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథల విశ్లేషణ- 17(డి)

లోయ కథను పర్ఫెక్ట్ కథగా భావించవచ్చు. ఎక్కడా రచయిత కనబడకుండా, వ్యాఖ్యానించకుండా తాను వేయాలంకున్న ప్రశ్నలు వేయకుండా పాఠకుడి మనస్సులో అవే సందేహాలు పాత్రల ద్వారా కలిగే రీతిలో లోయ కథను రచయిత సృజించారు ఈ కథ చదివిన తరువాత రచయిత మళ్ళీ ఇలాంటి కథే రాయకుండా,ఇంతవరకూ రాసిన రెండు ఉత్తమ కహలకు పూర్తిగా భిన్నమయిన కథతో మూడో ఉత్తమ కథను సృజించారు ఈ సంకలనాలలో గమనించేదిమటంటే రచయితలు ఏ రకంగా రస్తే, ఏది రాస్తే ఉత్తమ కథల సంపాదకుల మెప్పు పొందుతుందో అలాంటి కథలు రాయటం కనిపిస్తుంది. అందుకే,కహకులు ఒకే రకమయిన కథలను అటూ ఇటూ చేసి రాసి మెప్పు పదే పదే పొందటం కనిపిస్తుంది కానీ,బీ అజయ్ ప్రసాద్ కథలలో వామపక్ష ధోరణి తెలుస్తూన్నా తన ఆలోచనలను భావాలను ప్రదర్శించటానికి ఆయన ప్రతి సారీ విభిన్నమయిన కథనూ, విభిన్నమయిన కథా సంవిధానాన్ని ఎంచుకోవటము స్పష్టంగా తెలుస్తుంది అందుకు చక్కటి నిదర్శనం యూఫో కథ. ఇది 2008 ఉత్తమకథల సంకలనంలోనిక ఉత్తమ కథ.
కమాండర్, కలనల్ అని మాత్రమే కథలో మనకు పరిచయమయ్యే ఇద్దరు వ్యోమగాములు వ్యోమ నౌకలో ప్రయాణం చేస్తూండటంతో కథ ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్తలు భూమిలాంటి ఒక గ్రహాన్నికనుక్కుంటారు అక్కడ పాతరాతి యుగం నడుస్తూంటుంది కమాండర్ అని పిలవబడే వ్యక్తిఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడిమనుషులలోఒకరిని పట్టుకువస్తాడు అతడిని నాగరీకుడిని చేయాలనిప్రయత్నిస్తూంటారు అప్పుడు అతడిని కలసిన కమాండర్ దృష్టిమారిపోతుంది.
నిరంతరం సంక్లిష్టంగా మారుతున్న మనిషి మనుగడ ….మూసగా తయారయి…మరింత విషాదభరితం చేయబడుతూ…నిరర్ధకమయిన నిస్సారమయిన జీవితపు నమూనాని మనుషులు తమ తరతరాలకు అందించటానికి పరితపిస్తూ సమస్త మానవ జీవితం ఎక్కడో గాడి తప్పినట్టు అతడికి అనిపించసాగింది…..అని అతనిమానసిక స్థితితిని రచయిత వర్ణిస్తాడు
అదే సందర్భంలో, మనిషి తన శరీరంలోనే అనంతమైన జీవన క్రియల సౌందర్యాన్ని ఉంచుకుని విశ్వంలోని అనంత రహస్యాలను అన్వేషించడం అతడికి నిరర్ధకంగా అనిపించింది. అని వ్యాఖ్యానిస్తాడు.
అంతేకాదు, సాపేక్షతలేని ప్రకృతి అర్ధమయ్యేకొద్దీ అతడు మిగతా ప్రపంచానికి దూరంగా అజ్ఞాతంలో జీవించసాగాడు, అంటాడు ఇదికొరుకుడుపడనివిషయం
సాపేక్షత లేని ప్రకృతి అంటే? సాపేక్షత అంటే relativity ..రిలేటివిటీ లేని ప్రకృతి అంటే? సమస్త విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు,వేద గ్రంథాలు మాన జీవితం, అంతరిక్షంలోని గోళాల జీవితాలు, విశ్వంలోని చరాచరాల జీవితాల నడుమ ఉన్న సాపేక్షతను ఆమోదించి ఆ కోణంలో పరిశోధనలు చేస్తూంటే, విశ్వంలో మరో గ్రహంలో జీవాన్ని చూసిన వ్యోమగామి, ఆ జీవాని తమలాగా నాగరీకులను చేయాలని తపనపడుతున్న మనుషులను చూసి డిప్రెషన్ కి గురవటం అర్ధం చేసుకోవచ్చు కానీ, సాపేక్షతలేని ప్రకృతి అనటం అర్ధ విహీనం!!! దాంతో…ఇక్కదివరకూ కథను సైన్స్ ఫిక్షన్ కాకున్నా సైన్స్ ఫాంటసీగా భావించవచ్చు అనుకుంటున్న ఆలోచన కాస్తా ఆవిరయి, రచయిత ఈ కథలో తన సిద్ధాంతాలను అకారణంగా చొప్పిస్తున్న భావన కలుగుతుంది. ఎందుకంటే, ఈ సాపేక్షత లేని ప్రకృతి అర్ధమవ్వటానికి సరిపడ సంఘటనకథలో లేదు సంఘటన కథలో వుంటే దానికి పాత్ర స్పందనను పాఠకుడు అర్ధం చేసుకుంటాడు. రచయిత మెదడులో ఉన్న ఆలోచనను ప్రతిబింబించే సంఘటన కథలో పాత్ర అనుభవించకపోతే రచయిత తీర్మానం స్వతంత్రంగా చూస్తే గొప్పగా( అర్ధం కానిది ఎలాగో గొప్పది కదా!) అనిపించినా,కథలోఒదగక అసంబద్ధంగా, అర్ధ విహీనంగా అనిపిస్తుంది. సాపేక్షతలేని ప్రకృతి అలాంటి తీర్మానమే!
entire universe is related. each space object moves relative to other. otherwise one cannot judge their spatial,causal and time relationship….if one goes deeper…an atom , a human, atree, a planet, astar,a galay, a universe, a constellation..etc etc all have a relativity that is at once not only confounding but also is astounding అని తన రచనను ఆరంభించిన జాన్ గ్రిబ్బిన్ అనే సైన్స్ రచయిత మొత్తంపుస్తకాన్ని విశ్వంలోని సాపేక్షత గురించిన చర్చతో రచించాడు.
కథ కాస్త ముందుకు వెళ్ళిన తరువాత ,ఈకమాండర్ దగ్గరకు అతనితో గ్రహాంతర యాత్ర చేసిన సహచరుడు వస్తాడు నువ్వింకా దేనికోసం వెతుకుతున్నావు? అని అడుగుతాడు అప్పుడు కమాండర్, తానుకనిపించని వస్తువు కోసం వెతుకుతున్నానని, అదిఒకచోటుండి, మరొక చోటులేనిది కాదు విశ్వమంతా సమస్త చరాచర జీవరాశిలో పనిచేస్తూందని,అది సాపేక్ష దృష్టికి అందని ప్రకృతినియమమనీ చెప్తాడు.
ఇక్కడే కథ, రచయిత ఆలోచనాధోరణి,అతని సిద్ధాంతమూ దెబ్బతినేది. అతనికి సాపేక్షత లేని ప్రకృతి అర్ధమవుతున్నకొదీ అజ్ఞాతంలోకి వెళ్ళాడనీందాక రాశాడు రచయిత ఇప్పుడు అతని నోటి ద్వారానే అది అన్నిటినీ ఆవరించి సంస్తజీవ రాశిలో పనిచేస్తోంది, సాపేక్ష దృష్టికి అందనిదీ అంటున్నాడు సమస్త జీవరాసిలో వుంటే ,అప్పుడు ప్రతీదీ మరొక దానికి సాపేక్షమవుతుంది. ఈ సాపేక్ష దృష్టితో చూసేవారు దాన్ని గ్రహించలేరు. దాన్ని గ్రహించాలంటే ఈ దృష్టి పరిథిదాటి అది లేని స్థాయిలో సృష్టిని చూడాలి కానీ, అది తనలోనూ వుంది. లేకపోతే అతని మొదటి మాట ఆబద్ధమవుతుంది. కాబట్ట్, తనలోనూ దాన్ని వుంచుకున్న వ్యక్తి, దాన్ని దాటి చూడగలగటం సంభవమా? విశ్వమంతా ఆకాశం ఆవరించి వుంది. కాబట్టి కుండలోనూ ఆకాశం వుంది. తనలో ఆకాశం వున్న భావన కుండ తన పరిథిదాటితే కానీ గ్రహించలేదు. కానీ, మట్టి ఆకాశాన్ని దాటి పోవటం అంటూ జరుగుతుందా? అందుకే, విజ్ఞనశాస్త్రం కానీ, వేదం కానీ,ఒక పరిథిదాటి మానవమేధ సయాన్ని గ్రహించలేదంటాయి.
మనకు విశ్వ విజ్ఞానం బిగ్ బాంగ్ సమయంలో వెలువడిన రేడియేషన్ల ద్వారా అందుతోంది. రేడియేషన్లు బిగ్ బాంగ్ నుంచే ఆరంభమయ్యాయికాబట్టి, మానవుడు బిగ్ బాంగ్ జరిగిన కొన్ని సెకన్లనుంచే విజ్ఞానన్ని గ్రహించగలడు బిగ్ బాంగ్ జరిగిన సమయం అంటే జీరో హవర్ ఎలావుంది, అంతకు ముందు ఏముందీ తెలుసుకోలేడు అదొక పరిథి….అదొక గడప. గడపకావల శూన్యం చీకటి. ఈవల వెలుతురు..ఆవల అంధకారం. ఈవల సృష్టి….ఇది నాసదీయ సూక్తం….దీన్ని సావిత్రిలో అరబిందో అద్భుతంగా వర్ణించారు. అంటే, ఈ విషయ పరిజ్ఞానం ఉంటే కథలేదు.కథలో సంఘర్షణలేదు.
కానీ, రచయిత వామపక్ష భావ ప్రభావితుడవటం వల్ల, బహుషా, ఆధ్యాత్మిక సిద్ధాంతాల గురించి అంతంతమాత్రమే పరిచయం వుండటంవల్ల, ఈ కథలో ఈ ఆలోచనను కేంద్ర బిదువుగా రచించివుంటాడు ఈ ఆలోచనను తరువాత సంభాషణ బలపరుస్తుంది.
నువ్వు ఆధ్యాత్మికుడిలా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది దైవ శక్తి గురించా? అనిస్నేహితుడు అడుగుతాడు. దానికి ఆ పాత్ర ఏదేదో అర్ధంపర్ధంలేని వాదన చేసి దైవ శక్తిని నిరకరించి అంతా ప్రకృతేనని,మనిషి ప్రకృతినుంచి వేరయిపోతున్నాడని అలవాటయిన వామపక్ష ప్రకృతి వాదన చేస్తాడు స్థలకాలాలకతీతంగా వెళ్ళాలంటాడు ఈ చర్చ తరువాత కలనల్తోకలసి మళ్ళీ అదే గ్రహానికి వెళ్తాడు ఈసారి అతను ఆ గ్రహం వాళ్ళతోకలసిపోతాడు అదీ యూఫో కథ.
కథ బాగులేదు అనటానికి లేదు బాగుందీ అనలేము అందుకని అద్భుతమయిన అర్ధంలేని కథ అనవచ్చీకథను.
ఈ కథ చదివిన తరువాత స్పెషల్ ఎఫెక్ట్స్ తోనిండిన అర్ధంలేని సినిమా చూసిన భావన కలుగుతుంది. పైగా,కమాండర్ ఆలోచనలూ , భావనలూ అర్ధవిహీనమవుతాయి.ముఖ్యంగా, స్థలకాలాలను దాటి చూడాలనుకున్నవాడు, సాపేక్షతను దాటి ఎదగాలనుకున్నవాడు,ఆ గ్రహంలోని ఆదిమానవులలో కలసిపోవటం వల్ల తన లక్ష్యాన్ని ఎలా సాధించాలనుకున్నాడో బోధపడకపోవటం, కథను మరింత అర్ధవిహీనం చేస్తుంది.
అయితే, ఈ కథలో అనాగరికులను ట్రైబల్స్ గాను,మానవుల దాడిని,ట్రైబల్స్ హక్కులను కాలరాచే ఆధునికులుగానూ అర్ధం చేసుకునే వీలుండటంతో,ఉత్తమకథలను ఎంచుకునే సంపాదకులకు, ఆ కోణం నచ్చివుంటుంది. తమ సిద్ధాంతాన్ని చెప్పే కథగా అర్ధమయివుంటుంది దానికితోడుగా దైవ భావనను విమర్శించటం , స్థలకాలాలని, సాపేక్ష ప్రకృతి అని రాయటం వారిలో అర్ధంకాని గొప్ప భావనను కలిగించి వుంటుంది అందుకని ఈ కథను ఉత్తమ కథగా ఎన్నుకునివుంటారు
సైన్స్ ఫిక్షన్ కథలలో సమకాలీన సమాజన్ని ఇతర గ్రహాలలో ఆరోపించి చూపటం సర్వ సాధారణం. కానీ, ఈ కథ అలానూ చేయక,మధ్యలో ఆధ్యాత్మిక చర్చలు తెచ్చి, ఆ చర్చలూ అర్ధ విహీనము, అనౌచిత్యమూ అవటంతో ఇదొక వ్యర్ధ ప్రయత్నంలా తోస్తుంది కానీ, మూస కథలు రాస్తూ ఉత్తమకథకులుగా చలామ?ణీ అవుతూ, ఇతరులకు కథలెలా రాయాలో చెప్పే ఉత్తుత్తి గొప్ప మూస కథకుల నడుమ,భిన్నంగా చెప్పాలని ప్రయత్నించిన అజయ్ ప్రసాద్ ప్రత్యేకంగా నిలుస్తాడు.
2009లో ఉత్తమ కథ జాగరణ గురించి వచ్చే వ్యాసంలో….

Enter Your Mail Address

March 19, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply