25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథల విశ్లేషణ-17(ఇ)

మొత్తానికి తెలుగు కథా సాహిత్య విమర్శలో ఒక కదలిక వస్తున్నట్టు అనిపిస్తోంది. కథల బాగోగుల గురించి నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పే పద్ధతి మొదలవుతున్నట్టు వుంది. అయితే, ఈ విమర్శ కేవలం కొత్త కథకుల కథలకు మాత్రమే పరిమితమవుతుందా, పేరు మాత్రం పెద్దదిగా పొందిన చిన్నాతిచిన్న కథకులకన్నా ఘోరమయిన పెద్ద పేరున్న పెద్దల కథలకు కూడా విస్తరిస్తుందో చూడాలి. ఏదేమయినా, నిష్పాక్షిక, నిర్మొహమాట మయిన కథా విశ్లేషణ అవసరం ప్రస్తుతం ఎంతో వుంది. ఇలాంటి విశ్లేషణలు లేకపోవటంవల్లనే కథ అంటే తెలియకుండానే పెద్ద పేర్లు సంపాదించేసిన అక్కథకులు విమర్శను భరించలేకపోతున్నారు. హన్నా!! నన్ననేంతవాడివా? అన్నట్టు కళ్ళెర్రచేసి తమ వాపు వల్ల పెరిగిన అహంకారాన్ని చూపించుకుంటున్నారు. ఎవరయినా ఎల్లకాలం మోసాన్ని కొనసాగించలేరు..త్వరలో తెలుగులో కథను రచయిత పేరుతోనో, సిద్ధాంతం ఆధారంగానో కాక కథను కథగా చూసే రోజులు వస్తాయన్న ఆశాభావం కలుగుతోంది.
అజయ్ ప్రసాద్ కథ జాగరణ 2009 సంవత్సరంలో ఉత్తమ కథలలో ఒకటిగా ఎంపికయింది. ఈ కథ చెప్పే సమాధానాలకన్నా, లేవనెత్తే సందేహాలే ఎక్కువ. కానీ, కథను చెప్పటంలో ఒక సొగసువుంది. కథను నడిపిన విధానంలోని నిజాయితీ, కథకొక తీవ్రతను ఆపాదిస్తుంది. కథలో వాతావరణాన్ని సృజించిన విధానం, పాత్రలను తీర్చి దిద్దిన విధానం కథ నచ్చినా నచ్చకున్నా కథ, పాత్రలు గుర్తుందిపోయేలా చేస్తాయి. అంటే కథా రచనలో రచయిత ప్రావీణ్యాన్ని ఎత్తి చూపిస్తాయన్నమాట.
ఊర్రికి దూరంగా పాదుపదిన ఇంట్లో వుంటూంటాడు బైరాగి. అతని స్నేహితుడు గురిగాడు. అతడు మాయామర్మం తెలియని మనిషి. పిట్టలను కొట్టడంలో నేర్పరి. అతనో పావురాన్ని పట్తుకొస్తాడు. కానీ, బైరాగి దాన్ని చంపి తిననీయడు. అయితే, ఈ పిట్టను ఎరగా పెట్టి వేరే పిట్టలను పట్టాలని గురిగాడు పథకం వేస్తాడు. వారిద్దరి సంభాషణల్లో బైరాగి కొన్ని మాటలంటాడు. అవి కథకు కీలకమయినవి.
మనుషులు తమకు తెలిసినా తెలియకున్నా మంచీ చేస్తారు. చెడు చేస్తారు. కార్యం కంటి ముందున్నంతవరకే. చేతులు దాటాక అన్నీ మనమనుకున్నట్టే జరగవు. దేని దిశ దానికే వుంటుంది.
ఇది ఈ కథకు కీలకమయిన సంభాషణ అని కథ పూర్తయ్యాక అర్ధమవుతుంది. అప్పుడు కథను మరోసారి చదివితే రచయిత కథారచన సంవిధానం మురిపిస్తుంది.
ఇంతలో మాణిక్యం అక్కడికి వస్తాడు. మాణిక్యం ఎప్పుడూ కొత్త అమ్మాయిల్తో వస్తూంటాడు. అతడు అమ్మాయిల్ని మోసం చేసేవాడు. అయితే, అతనితో వచ్చే ఇతర అమ్మాయిలకు, ఇప్పుడు వచ్చిన అమ్మాయికి తేడా వుంటుంది. ఈమె, మాణిక్యాన్ని పూర్తిగా నమ్ముతుంటుంది. ఇది బైరాగిలో ఆలోచన కలిగిస్తుంది. ఆ అమ్మాయి ఒంటరిగా దొరికితే, మాణిక్యాన్ని నమ్మవద్దనీ, అతడిని వదలి వెళ్ళిపొమ్మనీ చెప్పాలనుకుంటాడు. చివరికి మానిక్యానికే ఆవిడని విడిచిపెట్టమని చెప్తాడు. దానికి సమాధానంగా మాణిక్య, ఈ పిట్టకోసం నేను పడని యాతనలేదు. ఇప్పుడిడిసి పెట్టటం జరిగేపని కాదు, అంటాడు.
దాంతో, రాత్రి బైరాగి ఆ అమ్మాయి మీదకు వెళ్లి మాణిక్యం పంపాడని చెప్తాడు. అంతలో మాణిక్యం బైరాగిని కొడతాడు. ఆ అమ్మాయి చీకట్లోకి పారిపోతుంది. వేటకోసం రెక్కలు తెంపి పెట్టిన పావురం, కొత్తగా వచ్చిన రెక్కలల్లార్చి ఎగిరిపోతుంది. గురివిగాడు వచ్చి, బైరాగిని రాక్షిస్తాడు. ఏం జరిగిందని అడిగితే, జరిగింది చెప్పి, అంతా మంచికే జరిగిందంటాడు బైరాగి. అప్పుడు పావురం లేదని గుర్తించి అదేమయిందని అడుగుతాడు. ఎగిరిపోయిందని తెలుసుకుని, అయ్యో దాని కళ్ళుకుట్టేశానే అంటాడు. దీనికి సమాంతరంగా, ఆ అమ్మాయివల్ల మాణిక్యం మారిపోయేవాడేమో, తొందరపడ్డావు సామీ అంటాడు. అంతేకాదు, మాణిక్యం మీద నమ్మకం తప్పించాలన్న ప్రయత్నంలో, ఆ అమ్మాయి మనుషులెవరినీ నమ్మకుండా చేశావు కదా అంటాడు.
ఇక్కడ ఇందాక బైరాగి చెప్పిన వాక్యాల్ని అన్వయించుకుంటే గొప్ప జీవిత సత్యం రచయిత పెద్ద ఉపన్యాసాలు, పేరాలు పేరాలు రాయకుండానే బోధపడుతుంది. చక్కని కథ. మరపుకురాని కథ. కథకు ఏదో సామాజిక ప్రయోజనం వుండాలని, అది, వామపక్ష ధోరణే అవ్వాలని అనేవారికీ కథ నచ్చకపోవచ్చేమో కానీ, కథ చదవటం వల్ల వ్యక్తికి తనగురించి, తన చుట్టూ వున్న సమాజం గురించి అర్ధమవ్వాలన్న దాన్ని ప్రామానికంగా తీసుకుంటే ఈ కథ చాలా గొప్ప కథగా అర్ధమవుతుంది. దీనికి తోడు రచయిత కథలో బిగువు సడలకుండా కథను చెప్తాడు. అంటే ఉత్తమ కథలుగా ఎంపికయిన అయిదు కథల్లో రెండు కథలు నిజంగా ఉత్తమ కథలే అన్నమాట….
2011లో ఉత్తమ కథగా ఎంపికయిన ఖేయాస్, కొంచెం అర్ధమవటం కష్టమే. కథ కేయాటిక్ గా వుంటుంది. కథ చదువుతూంటే సిటిజన్ కేన్ సినిమా ప్రభావం వుందేమో అన్న ఆలోచన వస్తుంది. మాధవరావు గురించి తెలుసుకోవాలని అతడు వూరు వెళ్తాడు. ఎవరికి వరు అతడి గురించి వేర్వేరుగా చెప్తూంటారు.ఇదీ కథ. ఈ కథ చివరి వాక్యం ఈ కథకూ వర్తిస్తుంది.
అతనికి ఏదో చేతికి అందినట్టే అంది, అర్ధమవుతున్నదేదో హఠాత్తుగా అదృశ్యమయి, చెల్లాచెదురై చివరికి ఖాళీగా కనిపించింది.
ఈ కథ చదివిస్తుంది. ఉత్తమ కథా అంటే…..ప్రశ్నే మిగులుతుంది. కానీ, ఇంతవరకూ చదివిన కథకుల్లో, ప్రతి కథలోనూ, కొత్తదనం చూపిస్తూ, కథకూ కథకూ ఏమాత్రం పోలిక లేకుండా( ఆలోచనాత్మకమవటం తప్ప) చక్కని కథా రచన సంవిధానంతో ఆకట్టుకునే కథకుడు అజయ్ ప్రసాద్ అనిపిస్తుంది. అన్ని కథలూ ఒకే రకంగా రాసి, పాత్రల పేర్లు వేరుగా? అని వాదించే కథకుల సరసన మేరు శిఖరంగా నిలుస్తాడు అజయ్ ప్రసాద్ ఆయన కథలు.
తరువాతి వ్యాసంలో మహమ్మద్ ఖదీర్ బాబు కథల విశ్లేషణ వుంటుంది.

Enter Your Mail Address

March 29, 2017 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

One Response

  1. ఫణీన్ద్ర పురాణపణ్డ - March 31, 2017

    మాస్టారూ… 25ఏళ్ళ ఉత్తమ కథ-విశ్లేషణ సీరీస్ లో నవంబర్ 2016 వ్యాసాలు అన్నీ మిస్సింగ్. అంటే 9వ వ్యాసం తర్వాత 13(ఎ) వ్యాసం ఉంది, మధ్యలోవన్నీ మాయమైపోయాయి. వీలయితే వాటిని రిట్రీవ్ చేయగలరా!

Leave a Reply