25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ-18(2)

2000 సంవత్సరపు ఉత్తమ కథల సంకలనంలో ఖదీర్ బాబు కథ న్యూ బోంబే టైలర్స్ చోటు సంపాదించుకుంది. ఈ కథ చక్కని కథ. ఆరంభమ్నుంచి చివరి వరకూ వదలకుండా చదివిస్తుంది. ఆధునిక బట్టల ఫాక్టరీలు వచ్చాక, టైలర్ వృత్తిని ఎంచ్కుని దానిపైనే ఆధారపడిన వారి మారిన స్థితిగతులను అందంగా చూపిస్తుంది.
ఖదీర్ బాబు రచనా సంవిధానం పారే నీటిలా గల గలా సాగిపోతుంది. ఎక్కడా అడ్డంకిలేని ప్రవాహమది. అతని వర్ణనలు, ముఖ్యంగా పాత్రల వర్ణనలు చక్కగా వుంటాయి. వ్యక్తిని కళ్ళముందు నిలుపుతాయి. ఇలాంటి కథలు, బాగాబ్రతికి పరిస్థితులవల్ల చితికికూడా ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో తలవంచకుండా నిలబడేవాళ్ళ కథలు మనసుకు హత్తుకుంటాయి. మురిపిస్తాయి. ఈ కథ అందుకు భిన్నంకాదు. మనకళ్ళముందు టైలర్లేకాదు, ఇలా మారుతున్న పరిస్థితులలో ఇమడలేక, పాతను వదలలేక సతమతమయ్యేవారెందరో ఎన్నో రంగాలలో కనిపిస్తారు. ఒకప్పుడు వీధి వీధినా టైపునేర్పే దుకాణాలుండేవి. ఆఫీసుల్లో టైపిస్టులుండేవారు. కంప్యూటర్ వారందరినీ పనికిరానివారిని చేసింది. ఆఫీసుల్లో వారు వెస్టీజియల్ ఆర్గాన్లలా మిగిలారు. అలాగే, ఒకప్పుడు వీడియోప్లేయర్లకు డిమాండుండేది. వీడియోపార్లరు పెద్ద వ్యాపారం శీడీలొచ్చి దాన్ని దెబ్బతీసింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి, నిత్య పరినామశీలి అయిన ప్రపంచంలో, అనునిత్యం ఏదో మార్పు సంభవిస్తూంటుంది. ఆ మార్పు ఆధారంగా ఎదిగేవారుంటారు. తట్తుకోలేక చితికేవారుంటారు. కాబట్టి, బాంబే టైలర్స్ లాంటి కథను రాయటం సులభమే అయినా మెప్పించటం కష్టం. కానీ, ఆ కష్టమైన పనిని అత్యంత సులభం చేస్తుంది ఖదీర్ కథ చెప్పే విధానం.
ఇది చాక్కగా రౌండెద్ ఆఫ్ కథ. ఆరంభానికి చివరికీ నదుమ చక్కని సమన్వయం వుంది. ఒక సంఘటన మరో సంఘటనకు దారి తీస్తూ…కథకు ప్రవాహ గతినిచ్చింది. కథలో పీర్ భాయ్ కొడుకు ఫాక్టరీలో పనికి మొగ్గు చూపటం ప్రస్తుత సామాజిక పరిస్థితికి దర్పణం పదుతుంది. ఒకప్పుడు సర్వస్వతంత్రంగా బ్రతికిన భారతీయ సమాజం ఇప్పుడు ఎవరో ఒకడి దగ్గర జీతానికి కొలువు చెయ్యనిదే గడవలేని బానిస మనస్తత్వానికి అద్దం పదుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం లేని బానిసమనస్తత్వపు జీతగాళ్ళను కళ్ళకుకట్తినట్తు చూపిస్తుంది.
అయితే, కథను ఆసాంతం ఆసక్తి కరంగా చదువుతాం కానీ, ఎక్కడా ప్రధానపాత్ర పరిస్థితికి మనసు ద్రవించదు. కంటతడి రాదు. ఆస్ ఎ మాటర్ ఆఫ్ ఫాక్ట్ గా కథను చదువుతాం. అంతే….ఇందుకు ప్రధానకారణం కూడా రచయిత రచన సంవిధానమే!!!! ఒక అందమయిన పెయింటింగ్ చూసి మురుస్తాం. అంతే….దాన్ని పదే పదే స్మరిస్తూ గుర్తుతెచ్చుకుని ఆనందించలేము…ఈ కథా అలాంటిదే…అయితే ఈ కథను ఉత్తమ కథగా ఎంచుకోవటంపై ఎలాంటి అభ్యంతరమూ వుండదు. చక్కని కథ.
2001 సంవత్సరంలో ఉత్తమ కథగా ఎంపికయిన ఖాదర్ లేడు కథ ఆసక్తి కరంగా చదివించినా కథ టోన్ కథ విలువను తగ్గిస్తుంది. ఈ కథలోకూడా రచనా శైలి మెప్పిస్తుంది. పాత్రల చిత్రణ అలరిస్తుంది. ఎంచుకున్న అంశం, ఉత్తమ కథల సంపాదకులకు నచ్చేది. ధనవంతులు పేదవాళ్ళను మోసం చేసి పబ్బం గదుపుకోవటం.. పైగా ఆ మోసపోయేవాళ్ళు మార్టిన్లూ, ఖాదర్లూ అయితే ఇంకా మంచిది. ఖాదర్ అనే సైకిళ్ళ వ్యాపారి రోడ్దు వెడల్పులో తన షాపు పోగొట్టుకుని, అందుకు తిరగబడినందుకు పోలీసు దమననీతికి గురయి మాయమయిపోతాడు. అతడి స్నేహితుడు భైసన్న అతదిని వెతకటం ఈ కథ. కథ చెప్పిన పద్ధతి బాగుంది. కానీ, ఈ కథలోకూడా ఏపత్రతో పాథకుడు తాదాత్మ్యం చెందడు. అంతేకాదు, అక్కడ ఖాదర్ ఒక్కడే కాదు, అందరూ దుకాణాలు కోల్పోయారు. ఇదొక సామాజిక పరిణామం. ఇది ఒక్కడికి జరిగిన అన్యాయం కాదు. అలాంటప్పుడు ఒక్క ఖాదర్ పాత్రమీదే సానుభూతి కలిగించాలని రచయిత ప్రయత్నించటం అంతగా పట్టదు. పైగా, ఒక పాత్రతో మీ అందరికీ కోటి రూపాయలంటే పెంటిముక్క, మాకు వెయ్యి రూపాయలన్నా గగనమే..అని పించి వారు వీరు అన్న తేడా చూపించాలని రచయిత ప్రయత్నిస్తాడు. ఎంత చెట్టుకు అంతగాలి. నష్టమెవరికయినా నష్టమే. ఇలా నష్టపోయిన అందరిపై సానుభూతి కలిగించే బదులు, ఒక పాత్రపైనే సానుభూతి కలిగించాలని ప్రయత్నించటం కథను దెబ్బతీసింది.
న్యూ బోంబే టైలర్స్ ఇలాంటి కథే అయినా, అందులో ప్రధాన పాత్ర తప్ప మరో పాత్ర లేదు. ఇతర టైలర్లంతా నేపథ్యంలో వుంటారు. దాంతో ప్రధాన పాత్ర వ్యక్తిగత కష్టాన్ని పాథకుడు అర్ధం చేసుకుంటాడు. అయ్యో అనుకుంటాడు. కానీ, ఈ కథలో ఖాదర్ ఒక్కడే నష్టపోలేదు. మార్టిన్ నష్టపోయాడు. భైసన్న నష్టపోయాడు. అంగడిలోనివాళ్ళంతా నష్టపోయారు. ఒక కాలనీలో ఇళ్ళు కూలగొదుతూంటే హీరో ఒక్కడే నష్టపోయినట్టు చూపితే ఎలావుంటుందో, ఖాదర్ లేడు కథ అలా వుంటుంది. వ్యక్తిగత సమస్యను సార్వజనీనం చేస్తే వచ్చే ఫలితం సార్వజనీన సమస్యను వ్యక్తిగతం చేస్తే రాదు. ఇది కథా రచన టెక్నిక్ కి సంబంధించినది.
ఒక మహాపండితుడి పాండిత్యానికి విలువలేకుండా పోయిందని కథ రాసి మెప్పించాలంటే దృష్టి ఆ పండితుడిపైనే వున్నా, మొత్తం సమాజంలో పాండిత్యానికి విలువపోయిందన్న భావన కలిగిస్తేనే కథ పండుతుంది. అంటే వ్యక్తిగతమయిన నష్టానికి సమిష్టి కారణం చూపాలన్నమాట. ఈ దిగజారుడు ఇన్ జెనెరల్ అని చూపుతూ, ఈ వ్యక్తి ప్రవాహానికి ఎదురు నిలబడ్డాడు అన్న భావన కలిగించాలన్నమాట. న్యూ బోంబే టైలర్స్ లో ఆ భావన కలుగుతుంది. ఆరంభంలోనే ముగిసిందనుకున్న కథ మళ్ళీ మొదలయిందని చెప్తూ, చివరికి కథ ఇంకా నడిస్తోంది, వెళ్ళి చూడంది అనటంతో ఈ భావన సంపూర్ణమవుతుంది. ఖాదర్ లేడులో ఇలాంటి భావన కలగదు. అంటే, సమిష్టి నష్టాన్ని కేవలం వ్యక్తిగత నష్టంగా చూపటం వల్ల కలిగిన ఫలితమిది అన్నమాట. వర్షాలుపడక పంటలు పండక రైతులంతా నష్టపోయారని చెప్తూ, అందరి నష్టం పరవాలేదు కానీ, నా నష్టమే అధికం అంటే ఎలాంటి అపహాస్యమయిన భావన కలుగుతుందో ఖాదర్ లేడు కథ అలాంటి భావననే కలిగిస్తుంది. అందుకే, ఈ కథ చక్కగా అనిపిస్తుంది కానీ, ఉత్తమ కథ అంటే,,,, ఖాదర్ కి ఉత్తమ కథ కానీ, మార్టిన్ కు, భైసన్నకూ, అంగడిలోని ఇతరులకూ ఉత్తమ కథ కాదు అనిపిస్తుంది.
మిగతా కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో

Enter Your Mail Address

April 26, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply