25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ-19

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథల సంకలనం కథలలో ప్రత్యేకమయిన కథలు భగంతం కథలు. ప్రతి రచయితకూ తనదంటూ ఒక దృక్కోణం వుంటుంది. దృక్పథం వుంటుంది. తనదైన ప్రత్యేక భావ వ్యక్తీకరణ పద్దతి వుంటుంది. అయితే, రచయిత రాను రాను అనేక కారణాల వల్ల తన దృక్కోణాన్నో, దృక్పథాన్నో, భావ వ్యక్తీకరణ పద్ధతినో మార్చుకునే వీలుంది. ఈ మార్పులో అనేకానేక ఒత్తిళ్ళు కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తాయి. కానీ, కొందరు రచయితలు, ఇతరులకు భిన్నంగా తమదంటూ ఒక ప్రత్యేక పద్ధతిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ తరువాత ఎవరెంత విమర్సించినా, అరచి గీపెట్టినా, తమ పద్ధతిని మార్చుకోరు. దీనికి కారణం, ఆ భావ వ్యక్తీకరణ పద్ధతి రచయిత తెచ్చిపెట్టుకున్నది కాదు. ఎవరో నేర్పితే వచ్చింది కాదు. ఎవరినో అనుకరిస్తే అబ్బింది కాదు. అది వారి జీవలక్షణం. ఆ జీవలక్షణాన్ని ప్రేరేపించి, రచయిత తనను తాను గుర్తించేందుకు బాహ్య ప్రభావాలు దోహదం చేస్తాయి. ఆ రచయితకు అది అతని జీవలక్షణంలోని సృజనాత్మకా విషక్రణకు ప్రాణం అయినటువంటి ఆ పద్ధతి ఎవరి అనుకరణనో, ప్రభావమోగా భావించటం పొరపాటు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకవసరమయిందంటే, భగవంతం, కథలను పలువురు త్రిపుర రచనలతో పోల్చి, ఆ రచయితను ఒక చట్రంలో బంధించి, అతని సృజనాత్మకత స్వేచ్చా విశృంఖల విహారాంపై ప్రతిబంధకాలు విధించి, పంజరంలో బంధిస్తారు. ఇదీ ఉత్తమ కథలుగా ఎంపికయిన భగవంతం కథలను పరిశీలిస్తే గమనించవచ్చు.
25ఏళ్ళ ఉత్తమ కథా సంకలనాల్లో భగవంతక్ కథలు నాలుగు ఎంపికయ్యాయి. 2006లో అతడు-నేను-లోయ చివరి రహస్యం, 2010లో చిట్టచివరి సున్నా, 2013లో చంద్రుడు గీసిన బొమ్మలు, 2014లో గోధుమరంగు ఆట అన్న కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
భగవంతం అన్న కలం పేరులోనే రచయితపై త్రిపుర ప్రభావం కనిపిస్తుండవచ్చు, కానీ, భగవంతం రచనా సంవిధానానికి, ఆలోచన రీతికి, భావ వ్యక్తీకరణ పద్ధతికి, త్రిపుర కూ చాలా తేడా వుంది. ఈ రచయిత సృజనాత్మక జీవలక్షణంలోని ప్రాణాన్ని, త్రిపుర కథలు తట్టి లేపివుండవచ్చు, కానీ, భవంతం వేరు, త్రిపుర వేరు. కానీ, మన విమర్శకులు, రచయితను త్రిపుర అనే చట్రంలో బిగించి, అతనికో ఇమేజీ ఇచ్చేసి, అతని సృజనాత్మక స్రవంతి ప్రసారాన్నికి అడ్డుకట్టలు కట్టారు. ఆ ఇమేజీ పంజరంలో ఇమిడిన రచయిత సృజనాత్మకత ఇనుప పంజరం గోడలపై రెక్కలు టపటపా కొట్తుకోవటం కూడా ఈ కథల్లో కనపడుతుంది.
భగవంతం కథలు అర్ధమయీ అవనట్తుంటాయి. కథలో ఏదో మార్మిక అంశం నిగూధంగా పొందుపరచిన భావన కలుగుతుంది. ప్రతీకల వెనుక దాగిన మార్మికత ఒక అస్పష్టమైన ఆకారంతో మనసు తెరల వెనుక నర్తనమాదుతూంటుంది. కానీ, కథను పలుమార్లు చదివితే కానీ, రచయిత ప్రదర్శించిన అంశం స్వరూపం సంపూర్ణంగా అవగాహన కాదు. ఒకోసారి, ఎంత ప్రయత్నించినా అందీ అందని స్వప్నంలా మిగిలిపోతుంది. అయితే, రచయిత రచనా శైలి అతి చక్కనిది. విడవకుండా చదివిస్తుంది చివరివరకూ..చివరికి ఎవరి సంస్కారాన్ని బట్టి వారు రచనలో ఆంతర్యాన్ని అర్ధం చేసుకుంటారు. ప్రస్తుతం నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో ఇలాంటి విభిన్నమయిన రచనలు చేస్తున్నవారు ఇద్దరే. ఒకరు భగవంతం, మరొకరు, వేదాంతం శ్రీపతి శర్మ!
ఇంకా, అనేకులు , దానికి మాజిక్ రియలిజం అనో, ఇంకేదో ఇజం అనో పేరుపెట్టి అభాసుపాలయ్యే కథలెన్నో రాస్తున్నారు. వారికి అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయి. అది వేరే విషయం. కానీ, భగవంతం కథలను వారి జాబితాలో చేర్చలేము. ఇవి ప్రత్యేకమయిన కథలు.
అతడు-నేను-లోయ చివరి రహస్యం…చదువుతూంటే అద్భుతంగా అనిపిస్తుంది. రచయిత సృజనాత్మకతకు, సున్నితత్వానికి, మార్మికతకు జోహార్లర్పించాలనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతీకల ద్వారా. యాంత్రిక జీవితానికి బందీలయి, తమలోని ఆత్మ స్వేచ్చా విహంగంలా విహరించాలన్న త్ర్ష్ణను గుర్తించీ, అందుకు ప్రయత్నించీ, అందుకోలేని జీవితాలలోని విషాదాన్ని అత్యంత అద్భుతమయిన రీతిలో, ప్రత్యక్షంగా ఒక్క ముక్క చెప్పకుండా పరోక్షంగా మనసు లోలోతుల్లో ఆ భావం స్పురింపచేసి స్పందన కలిగే రీతిలో రచయిత ప్రదర్శించిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ఓ వ్యక్తి రైలు పట్టాలమీద నడుస్తూ, పక్షిలా పైకి ఎగిరిపోవాలనుకుంటాడు. అతనికి ఆ పట్టాలమీదే పక్షిలా ఎగురుతూ, మనిషిలా రక్తమాంసాలతో బరువుగా నడవాలనుకునే మనిషి కనిపిస్తాడు. వారికి రైల్వేయ్ట్రాక్ పైని టన్నెల్లో నుంచి వేగంగా పరుగెత్తి ఆవైపుకు చేరుకుంటే తమకోరిక నెరవేరుతుందనిపిస్తుంది. అందుకు ప్రయత్నిస్తారు. కానీ, అది జరగదు. పక్షిలాంటివాడు ఎగురుతూనే వుంటాడు. ఎగరలేనివాడు అలాగే వుంటాడు. కథను రచయిత, ఏదో కొంచెం కొంచెంగా అర్ధమవ సాగింది. కానీ, ఒక్క విషయం మాత్రం ఎందుకో అర్ధం కాలేదు, అంటూ ముగిస్తాడు. కథలో పక్షిలాంటి మనిషి, మనిషిలాంటి పక్షి దేనికి ప్రతీకలో రచయిత అక్కడక్కడా ఆధారాలు వదిలాడు. ఈ కథనలు, పాత్రల స్పందనలు గమనించటం ఒక అద్భుతమయిన అనుభవం. ఈ కథను ఉత్తమ కథగా భావించటంలో ఎలాంటి అభ్యంతరాలు ఎవరికీ వుండవు. ఎందుకంటే, ఇలాంటి రచనా సంవిధానం ఈ రచయితకే ప్రత్యేకం. అయితే, కొందరు అందరికీ అర్ధంకాదేమో అనవచ్చు..కానీ, రచయిత తాను రాయాలనుకున్నది, తనకు తోచినట్టు, తాను రాయాలనుకున్నట్టు రాస్తాడు. దాన్ని పాఠకులు తమ తమ సంస్కారాన్నిబట్టి అర్ధం చేసుకుంటారు. కాబట్టి, రచయితను పాఠకుల స్థాయికి దిగిరమ్మనేకన్నా, పాఠకులను రచయిత స్థాయికి ఎదగమనటమే ఉత్తమం. ఈ కథ చదివితే, రచయిత ఆలోచనాలోతు , భావ వ్యక్తీకరణ పటిమలు స్పష్టమవుతాయి.
చిట్టచివరి వ్యక్తి కథ ఒక అబ్సర్డ్ కథ. ఒక వ్యక్తికి, వార్తాపత్రికలో ఖాళీ భాగంలో కొన్ని రాతలు కనిపిస్తాయి. దాన్లో, జీవిత సత్యాన్ని తెలిపే ఆ పదార్ధంతో పులుసు వండుకొని చివరిసారి తృప్తిగా భోంచేసి వెళ్ళిపోవాలి అనిరాసి వుంటుంది. దాంతో మన హీరో ఆ పులుసు ఏమిటో తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఎక్కడెక్కడ ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతూంటాయో అక్కడక్కడకు వెళ్తాడు పులుసుకోసం. చివరికి, ఓ పాప అనేక జన్మలని కప్పుకుని నిద్రపోయేదాని ఒక్కోక్క జన్మకథనీ తెలుసుకుంటూ పోతే, చివరికంతా శూన్యం అనే పొడుపు కథ చెప్తుంది. అప్పుడు మన హీరోలొ అది ఉల్లిపాయ అనీ, ఉల్లిపాయ పులుసు అనీ అర్ధమవుతుంది. అదీ కథ… కథ రచయిత ఆసక్తి కలిగించే రీతిలో రాసినా, ఉల్లిపాయ పొడుపుకథ, జీవితాలు నిరర్ధకాలు, అర్ధవిహీనాలన్న భావనను బోధిస్తూన్నా, కథ పూర్తయ్యే సరికి ఒక గంభీరమయిన విషయాన్ని రచయిత తేలిక చేసి హాస్యాస్పదంగా చెప్పాలని ప్రయత్నిస్తూ, చివరికి ఒక ఎద కదిలించే దృష్టాంతంతో ముగించాలని ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. కానీ, కథలో ఈ రెంటి నడుమ సమన్వయం సాధించలేక విఫలమయ్యాడనీ తెలుస్తుంది. తాత్త్వికాంశాన్ని హాస్యాస్పదంచేసి చెప్పటం అతి కష్టమయిన పని. ఎంచుకున్న అంశాన్ని బట్టి రచనా సంవిధానం వుంటే, రచన పండుతుంది. అలాకాక, రచనా సంవిధానం ఎంచుకుని దాన్లోకి అంశాన్ని చొప్పించి మెప్పించాలనుకోవటం కత్తిమీద సాములాంటిదే. అందుకు ప్రయత్నించిన రచయితను అభినందిస్తూనే, విఫలమయ్యాడని చెప్పక తప్పదు. కథ ఎంత అబ్సర్డ్ అయినా, దానికి లాజిక్ వుండాలి. ఆ లాజిక్ లోనే అబ్సర్డిటీని ఇమిడ్చాలి. అక్కడ అది లాజికల్లీ, అబ్సర్డ్ అయినా, అబ్సర్డ్లీ లాజికల్ అనిపిస్తుంది. లాజిక్ వదలి అబ్సర్డ్ వెంట పడితే, అబ్సర్డ్ స్టుపిడిటీలా తోస్తుంది. అదీ ఈ కథలోపం. రచయిత కథను చదివిస్తాడు. అక్కడక్కడా ఆశ్చర్యకరమయిన ఆలోచనలు, వ్యాఖ్యలు ఉంటాయి కథలో..కానీ, పేపర్ లో ఒక వాక్యం చూసి దాన్ని పులుసుగా భావించి పాత్రను పులుసు వేటలో పంపించటంతో కథలో ఏ పాత్ర ప్రయాణంతో పాథకుడు మమేకం చెందితే కథ పండుతుందో, ఆ విషయంలోనే పాఠకుడు పాత్ర మానసిక స్థితిని ప్రశ్నించటం మొదలుపెడితే, కథ అభాసుపాలవుతుంది. అయితే, లోయ రహస్యం కథను అంత పకడ్బందీగా రాసిన రచయిత నాలుగేళ్ళలో ఇలాంటి కథ ఎలా సృజించాడా? అన్న ప్రశ్న కలిగుతుంది. దానికి సమాధానం తెలుగు సాహిత్య ప్రపంచంలో వున్న ఒక విచిత్రమైన పరిస్థితి కారణంగా కనిపిస్తుంది.
సాధారణంగా, ఆటగాళ్ళు, చిన్న వయసులో ప్రతిభను కనబరుస్తారు, రచయితలు, పరిణతి పొందిన తరువాత ప్రతిభ ద్యోతకమవుతుంది అంటారు. కానీ, తెలుగు సాహిత్య ప్రపంచంలో పలు కారణాల వల్ల ఒకటి రెండు కథలు రాయగానే, అంటే ఇంకా మొగ్గగా వున్న దశలోనే పొగడ్తలు, బహుమతులు లభిసంచేస్తూంటే, ఇంకా రెక్కలు విప్పుకోకముందే తాను ఆకాశంలో వీర విహారం చేయగలనని నమ్మే పక్షుల్లా తయారవుతారు రచయితలు. వారికి తమకు తెలియనిదేదీలేదని, ఎవరూ తమకు చెప్పేవారులేరని, ఎవరయినా తమముందు దిగదుడుపేనన్న నమ్మకం స్థిరపడుతుంది. దాంతో ప్రశంశలు తప్ప విమర్శలు భరించలేరు. తాము అరిస్తే వాద్యం, స్మరిస్తే పద్యం అనుకుంటారు. ఘూకం కేకలు, బేకం బాకల ప్రలోభంలో తమని తాము మరచిపోతారు. వారి ఎదుగుదల ఆగి, చత్రంలో బంధితులవుతారు. భగవంతం ను మన విమర్శకులు, త్రిపుర చట్రంలో బిగించారు. దాంతో తానిలాగే రాయాలి, అదే తన ప్రత్యేకత అన్న భ్రమలో రచయిత పడ్డట్టు తోస్తుంది. అయితే, త్రిపుర వేరు భగవంతం వేరు. త్రిపుర సైతం పట్తుమని పది కథలను మించి రాయలేదు. ఆ కథలనుకూడా కొందరు భుజానెత్తుకుని మోయకపోతే( వారికీ ఆ కథలు ఎంత అర్ధమయయో తెలియదు) ఆ కథలు మరుగున పడేవి. గమనిస్తే, భగవంతం రచన సంవిధానం త్రిపుర అంత కఠినం మార్మికం కాదు. సులభంగా చదువుకునే వీలున్న రచనలు. కానీ, త్రిపురతో పోలిక తేవటంతో, భగవంతం త్రిపురలా తప్ప మరో రకంగా రాస్తే, తన అస్తిత్వం నిలవదనే భయంతోనో అలాగే రాయాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇది, అతని స్ర్జనాత్మ ప్రవాహానికి ప్రతిబంధకంగా మారుతున్నట్టూ అనిపిస్తుంది.
చంద్రుడు గీసిన బొమ్మలు కాన్సెప్ట్ అతి చక్కనిది. ఒక స్థాయివరకూ రచయిత చక్కగా కథను నడిపేడు..కానీ, చివరలో కథపై పట్టు తప్పి, ఈ కథ ఎంతో గొప్ప సత్యాన్ని ప్రదర్శిస్తుందన్న భావన కలిగించి నిరాశ పరుస్తుంది.
చందమామను చూస్తున్న వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది. ఒక హైకు రాస్తాడు. అతని కవి మిత్రుడూ అలాంటి భావాన్నే వ్యక్తపరుస్తాడు. మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. ఆదిమకాలం నుంచి చందుదిని ఎంతమంది చూశారో అని రాస్తాడు. చిన్నప్పుడు ఆడుకున్న ఆట గుర్తుకువస్తుంది. చంద్రుడు వచ్చి రాస్తాడన్న ఆట అది. చిత్రంగా అతనుకోరిన జాబితా అతని కాగితాల్లో కనిపిస్తుంది. దాన్లో ఒక ఆఫ్రికా అమ్మాయి తల్లి చూసిన చంద్రుడిని తాను చూస్తున్నానని కంటతడి పెట్టిన విషయం వుంటుంది. దాంతో రచయిత ఇతర జాబితా కోసం చూడడు…చంద్రుడు తన మీద కళ్ళుమోపే వాళ్ళకోసం ఎదురుచూస్తున్నాడనిపిస్తుంది.
ఈ కథలో రచయిత ఆలోచన సున్నితమైన ఆలోచనలా అనిపించినా, కథను ఒక చెరికా అనే అమ్మాయికి పరిమితంచేసి పాథకుల హృదయం ద్రవింపచేయాలని ప్రయత్నించటంతో కథ గతి తప్పింది. అదీగాక….రచయిత కోరిన కోరికను సమర్ధించినా…ఆ కోరికను..నెరవేర్చటంలో లాజిక్ తప్పింది. రచయిత కోరింది, నాలా ఎంతమంది చంద్రుడిని చూస్తూ ఫలానావారు చూసిన చంద్రుడిని నేనూ చూస్తున్నానని భావించుకున్నవారు మొత్తం మానవజాతి చరిత్రలో ఎంతమందున్నారన్నది. ఈ జాబితాను చంద్రుడు మూడు నాలుగు పేజీల్లో రాసినట్టు చెప్పాడు రచయిత…మూడు నాలుగు పేజీలవరకూ రాసిఉన్నాయా నీలివాక్యాలు….అని చెప్తాడు. అంటే…మానవజాతి చరిత్రలో ఫలానా వారు చూసిన చంద్రుడిని నేనూ చూస్తున్నాను అనుకునేవారి జాబితా సందర్భంతో సహా నాలుగుపేజీలేనా? అంత అరుదయినదా ఈ ఆలోచన? పైగా చెరికా కథే ఒక పేజీవుంది. ముందు ఒకపేజీలో హైకు వుంది..అంటే రెండు పెజ్జీల్లో సందర్భంతో సహా ఇమిడిపోయేంత గుప్పెడేనా జాబితా? మన ప్రబంధాలు తిరగేస్తేనే వందలకొద్దీ సందర్భాలు దొర్లుతాయి..ఇదీ, అబ్సర్డిటీలో లాజిక్ లేకపోవటంటే….ఈ కథ చివరి వాక్యాలు గొప్పగా వున్నా, కథను గొప్ప కథ అనలేము.
గోధుమరంగు ఆట దగ్గరకు వచ్చేసరికి రచయిత త్రిపుర చట్రంలో సంపూర్ణంగా ఇమిడిపోయాడన్న ఆలోచన స్థిరపదుతుంది. ఇది త్రిపురకు నివాళిగా, ఆయన కథ కొనసాగింపు….పూర్తిగా చదవటం కష్టం అనిపిస్తుంది. మామూలుగా కథ ఉన్న కథను నదిపించటం సులభం. ఏమీలేకుండా కథను నడిపించటం చాలా కష్టమయిన పని….
ఒకరిని అనుకరించటంకన్నా, ఆ దారిలో ప్రయాణిస్తూ తనదైన స్వతంత్ర మార్గాన్ని ఏర్పరుచుకున్న వారే తమదయిన ప్రత్యేక స్తిత్వాన్ని సాధిస్తారు. లేకపోతే, తామెవరి ప్రేరణతో అలాంటి రచనలను సృజిస్తున్నారో, జీవితాంతం వారి నీడలో ఒదిగిపోతారు. ఎంతయినా, హిమాలయాన్ని అందరూ అనుకరించలేరు. అనుకరించినా హిమాలయాన్ని మరిపించాలంటే దానికన్నా ఎత్తు ఎదగటమేకాదు, హిమాలయాల్లో వున్నవన్నీ కాక ఇంకా భిన్నమయినవీ చేర్చుకోవాలి. ప్రతిభావంతుడయిన రచయిత, అందరికన్నా భిన్నమయిన ఆలోచనలు, సున్నితత్వం, భావవ్యక్తీకరణ ల;అ అత్యద్భుతమయిన రచయిత ఇనేజీ చట్రంలో బిగుసుకుని, లోయ రహస్యం కథలోలా, శరీరపు బరువుకి క్రుంగిపోతూ, పక్షిలా పైకెగరాలని ప్రయత్నిస్తూ వొఫలమయిన పాత్రలా మిగిలిపోతాడు.
వచ్చే వ్యాసంలో వివినమూర్తి కథల విశ్లేషణ వుంటుంది.

Enter Your Mail Address

June 11, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply