25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణా-20

25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాల్లో వివినమూర్తి కథలు మూడున్నాయి. 1992లో పయనం-పలాయనం, 2005లో జ్ఞాతం, 2008లో అగ్రహారం అనే కథలను ఈ సంకలనాల సంపాదకులు ఉత్తమ కథలుగా ఎంపిక చేశారు. అయితే ఈ మూడు కథలు చదివితే రచయితగా వివినమూర్తి నపుణ్యం ప్రశ్నార్ధకం అవుతుంది . ఈ మూడు కథలలో ఏ కథకూడా ఉత్తమం అనిపించటం అటుంచి, కనీసం చదవదగ్గ కథ కూడా అనిపించదు. ఎందుకంటే, ఈ కథలలో రచయిత కథ చెప్పటం కన్నా, తన దృక్కోణాన్ని చెప్పటం,సిద్ధాంతాలు ప్రకటించటం, సమాజాన్ని తన సిద్ధాంతం ఆధారంగా విమర్శించటం( పరిష్కారాల ప్రసక్తి ఎలాగో వుండదు) పైనే దృష్టి పెట్టాడు. దాంతో, ఈ రచయిత సైద్ధాంతికంగా సంకలనకర్తలతో ఏకీభవిస్తూండటంతో ఈ కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి తప్ప కథన కౌశలము, నైపుణ్యం, ఉత్తమత్వం వంటివాటివల్ల కాదు అన్న అభిప్రాయం కలుగుతుంది.
పయనం-పలాయనం అర్ధంపర్ధం లేని కథ. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది ఒక కథేనా? అనిపిస్తుంది. సారధి, వాణి భార్య భర్తలు.వారి నడుమ సఖ్యత, గౌరవాభిమానాలు లేవని రచయిత కథ ఆరంభంలోనే తెలియపరుస్తాడు.
నువ్వు మునుపటిలా ఉండటంలేదు
భుజాలొకమారు విదిలించింది. రెండుచేతులూ ఎత్తి వొళ్ళు విరుచుకుని జుత్తులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుకుంది. తల విదుల్చుకుంది. ఎలావుంది సెంటు? అంది
సారధి తేరి పార చూశాడు
నీకు టేస్ట్ లేదు. వాసనలలో తేడా తెలియదు. ఇలాంటి సెంటు ఒకటుందని నీకు తెలుసా?
నేను భారతీయుడిని అంత చిన్న విషయాలు నాకు పట్టవు.
ఇదీ, వారిద్దరి నడుమ అనుబంధ రాహిత్యాన్ని ప్రదర్శించే సంఘటన..
అయితే…దీన్లో రచయిత నేను భారతీయుడిని అంత చిన్న విషయాలు నాకు పట్టవు…అనటంలో అంతరార్ధం ఏమిటీని వెతికితే ఏమీలేదు అని తెలుస్తుంది. భారతీయ మొగుళ్ళకు, వాసనలు తెలియవు, వారికి సెంటుల గురించి తెలియదు, భార్యలు సెంటులు పూసుకున్నా గమనించరు అన్న అర్ధం తప్ప మరొకటి స్ఫురించదు . ఇదేమి అర్ధం అంటే..అస్సలు అర్ధంలేనీర్ధం అనాల్సివస్తుంది. అసలీ సందర్భంలో ఆ సంభాషణ ఏమిటో అర్ధమేకాదు. కానీ, భారతీయుడిని అని చులకన ధ్వనింపచేయటంతో ఉత్తమ కథకు మార్కొకటి వచ్చి చేరివుంటుంది.
తరువాత అతనికి ఫోను వస్తుంది. అమ్మ బెంగళోరు రమ్మంటుంది అని భార్యకు చెప్తాడు. ఆ తరువాత ముసలి వూరు, ముసలి కంపు అంటూవ్యాఖ్యానిస్తాడు. ఇక్కదికి రమ్మంటే రారు,బెంగళోరులో కూచోటానికి నాకు పనిలేదా? అంటాడు.
అసలు దీనికి అర్ధం ఏమిటి? ముసలి నగరం అన్న సంభాషణ అవసరమా? అది పాత్ర వ్యక్తిత్వం గురించి ఏం చెప్తోంది?
సారధి ఇలా ఫోన్లో మాట్లాడుతూంటే, అతని భార్య వీడి బట్టలూడ దీసి రోడ్ మీద పరుగెత్తిస్తే..ఇలా ఆలోచిస్తూంటుంది……ఇక్కడే కథపై సగం ఆసక్తి చచ్చిపోతుంది. పాత్రల పరిచయం బాలేదు.వాటి వ్యక్తిత్వ వివరణ లేదు. సంభాషణల్లో లాజిక్ లేదు. ఆలోచనల్లో అర్ధంలేదు.
ఇక్కదినించి కథ బెంగళోరులో సారధి తల్లితండ్రుల దగ్గరికి చేరుతుంది. తల్లి కామేశ్వరి ఆరోగ్యం బాగుండదు. తండ్రి రంగనాథం పుస్తకంలో మునిగివుంటాడు. ఆమె కొడుకు గురించి ఆలోచిస్తే, రంగనాథం ఈ ప్రాణి మరణించిన తరువాత ఏమవుతుంది అని మళ్ళీ లాజిక్ రహితంగా ఆలోచిస్తాడు. ఆమె తనను విడిచి వెళ్తే తనకేమవుతుందనీ ఆలోచిస్తాడు. ఆమె కొడుకు గురించి మాట్లాదుతూంటుంది. వాడిని తప్పుపట్టకు అంటాడు రంగనాథం
నేను అవిశ్వాసిని రంగా! రాతిని పాముని నమ్మేటంత విశ్వాసివి నువ్వు.అంటుంది..
విశ్వాసులు వ్యక్తులను తపుపడతారంటావు నువ్వు అందామనుకుంటాడు రంగనాథం
ఈ సంభాషణలో విశ్వాసులు,అవిశాసి….పదప్రయోగాలు ఎబ్బెట్టుగా వుండటమేకాదు..వాక్యాలను అర్ధ విహీనం చేస్తాయి. విశ్వాసులు వ్యక్తులను తప్పుపట్టటం ఏమిటో?????/ఇక్కడ ఆమెను తప్పుపట్టద్దంటున్నాడు విశ్వాసి…మరి విశ్వాసి తప్పుపట్టటం ఏమిటి? ఏమో!!!!!!
అంతలో ఆమె….పరమాత్మ…ఆత్మ…స్వర్గాలు అంటూ ఏదేదో..మళ్ళీ అర్ధం లేకుండా మాట్లాడుతుంది. ఆమె మాటలవల్ల తెలిసేదేమిటంటే……భిన్నాభిప్రాయాలు కలవారి సంసారాలు.భగవంతుడిని విశ్వసించేవారివల్లనే నిలబడతాయని అర్ధమవుతుంది.
విశ్వాసం ప్రాధమికమయినదా? కాదా అన్న సందేహం వస్తుంది. సమాధానం లేదు.
ఇక్కడినుంచి ఫ్లాష్ బాక్/////
ఆమె, తన కోలీగుతో ప్రయాణం చేసేటప్పుడు, ఒక వర్షం కురిసిన రాత్రి,అనుకోని పరిస్థితులలో,ఒకే గదిలో వుండాల్సివస్తే, అతడు ఆమె తన 37ఏళ్ళ శరీరం తన భర్కతి ఉద్రేకం కలిగిస్తుంది కానీ పరాయివాళ్ళకు కలిగించదా? అన్న రోషంతో, చీర మార్చుకోమని బయటకు పోతున్న కోలీగుచేయిపట్తుకుని మంచం మీదకు ఆహ్వానిస్తుంది.
ఈ విషయం భర్తకు చెప్తుంది.
అది విని రంగనాధం మూడు నెలలు ఎతో వెళ్లిపోతాడు. గడ్డం పెంచుకు వస్తాడు. మనల్ని మన విశ్వాసాలే రక్షించాయి అంటాడు.
ఇంతలో కొడుకు కోడలు వస్తారు. వారి సమస్య ఏమిటంటే, ప్రమోషన్ కోసం కొడుకు భార్యను ఆఫీసర్ దగ్గరకు పంపుతాడు. ఆమె ఆఫీసర్ కు ఫోను చేస్తూంటే తిడతాడు. దానికి ఆమె నువ్వు అరువిస్తావు . వాడు ఎరువిస్తాడు అంటుంది .
ఇదంతా రంగనాధం, కామేశ్వరి వింటారు. ప్రపంచం మారటం వల్ల స్త్రీ పురుష సంబంధాలు మారుతున్నాయని, కేరీర్ కోసం పెళ్ళాన్ని అమ్ముకోవటం,కేరీర్ అంటే ఏమిటి ఈ పదాన్ని ఎవరు కల్పించారు? అంటూఅర్ధం పర్ధం, తల తోక లేని చర్చలు చేస్తూ చివరికి ఇదంతా ఫ్రీ మార్కెట్ సృష్టించినవారి దోషం అని తేలుస్తారు. వాణి ఫ్రీ మార్కెట్ ని తెగ తిడుతుంది. తెలియటం వల్ల మనుషులు న్యాయంగా వుంటారన్నది పాతకాలం మాట అంటుంది కామేశ్వరి చచ్చిపోతుంది. ఆమె చావు పలాయనమా? పయనమా? అని స్థానువవుతాడు రంగనాథం….ఇదీ కథ….
ఈ కథలో ఒక పాత్ర చిత్రణ కానీ, వ్యక్తిత్వ నిరూపణ కానీ, సంఘటనల సృష్టీకరణలో ఔచిత్యం కానీ, సంభాషణల్లో చమత్కారం కానీ, ఏమీలేక,కలం ఎతుకదిలితే అటు కదిపి,మెదడుకేది తోస్తే అది రాసి, ఫ్రీ మార్కెట్ ని తిట్టి, సమాజాన్ని దూషించటం తప్ప ఏముందో ఈ కథలో అక్షరం అక్షరాన్ని ఎంత తరచి చూసినా ఏమీ తెలియదు.

వాణి పాత్ర….ఆమె భర్త ప్రమోషన్ కోసం ఆయన కల్చర్డ్ గా వుండమన్నాను, సోషల్ గా మూవ్ అవ మన్నాను,వాదితో పదుకోమనలేదు అని భర్త అంటే, పదుకొన్నందుకు అభ్యంతర పెట్టలేదంటుంది.భర్త ముందే వాడికి ఫోన్ చేస్తుంది. ….ఇక్కడెక్కడా….ఆమె వ్యక్తిత్వంప్రసక్తి లేదు…. రంగనాధం, కామేశ్వరిలు విన్నది ఇంతే…కానీ..వాళ్ళు చర్చించేప్పుడు.కేరీర్ కోసం పెళ్ళాన్ని అమ్ముకుంటున్నాడు కొడుకు, విలాసాలకోసమో,లాలసకోసమో వాడి మాట పాటించింది కోడలు అంటారు…..
ఇంతకీ విలువలు పాడైపోతున్నాయి, పతనమై పోతున్నాయి అని బాధపడుతున్నదెవరు? తన భర్తను ఉద్రేక పరచిన 37ఏళ్ళ శరీరాన్ని పట్టించుకోని కోలీగు చేయిపట్టి మంచం మీదకు లాగిన మహిళ…!!!!!!!
దీని గురించి ఇంకా ఏమి వ్యాఖ్యానించిన సభ్యత హద్దులు దాటినట్టనిపించవచ్చు..
కనీసం కోడలు భర్త మాట పాతించింది. ఈమె….కేవలం ఒక వర్షం కురిసిన రాత్రి,కోలీగును తన 37ఏళ్ళ శరీరం ఉద్రేకపరచలేదని,అక్కడ డ్రా లో కండోం వుందని…బయటకుపోతున్న అతడిని చేయిపట్టుకులాగి……
అసలీకథకు అర్ధమేమయినా వుందా?
పైగా..పాత్రలన్నీ ఆత్మలు,పరమాత్మలు, సంఘము, అభివృద్ధి, ఫ్రీ మార్కెట్ అంటూ అర్ధం పర్ధం, ఒక లాజిక్కు, ఔచిత్యం లేకుండా సంభాషణలు పలికేస్తూంటాయి..
అసలు కథగానే పరిగణించటం కష్టమయ్యే ఈ కథను( ఒక నాలుగేళ్ళ పిల్లవాడు.సంఘటనలు ఇంతకన్నా ఎక్కువ లాజిక్ తో చెప్పగలడు) ఉత్తమ కథగా ఎంచుకున్న సంపాదకులకు జోహార్లు…ఉత్తమ కథ అన్న పదం అర్ధంపై భయంకరమైన వ్యంగ్యం ఈ కథను ఉత్తమ కథ అనటం
మిగతా కథల విశ్లేషణ మరో వ్యాసంలో….

Enter Your Mail Address

June 16, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply