25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ-24(2)

బెజ్జారపు రవీందర్ రచించిన కొత్త రంగులద్దుకున్న కల 2010లో ఉత్తమ కథల సంకలనంలో స్థానం సంపాదించుకుంది. ఈ కథ చదవటం ఒక రకంగా కఠినమయిన పని. ఎందుకంటే ఇది కథ నిర్వచనంలో ఒదగని రచన. ఒక నాటకం రిహార్సల్స్ సాగుతూంటాయి.. ఆ నాటకంలో సంభాషణలు కథ..సంభాషణల్లోనూ మనకు కథ తెలియదు. అంతా సిద్ధాంతాలు, విమర్శలు, పరోక్షంగా విమర్శలు….ఇలా సాగుతుంది..
ఆరంభంలోనే రచయిత దృష్టి తెలిసిపోతుంది.
ఇది ఫిలాసఫర్లు, జ్ఞానుల దేశం.
అంటే భారతదేశం లో ఇంతవరకూ జరిగింది, రాసిందిందీ, సాధించిందీ అంతా పనికిరానిదన్నది రచయిత ఉద్దేశ్యమని ఇది ఎర్రటి వెలుతురులో తప్ప ప్రపంచాన్ని మామూలుగా చూడలేని అరస విరస కురస నీరస నోరస సిద్ధాంత కథా రచయితల ఆలోచనా ధోరణిని ప్రదర్శించే కథ అనీ అర్ధమవుతుంది.
రచయిత కవిత్వం రాయబోయి వచన సంభాషణ రాశేడేమో అన్న అనుమానం వస్తుంది.
ఎందుకంటే, హఠాత్తుగా ఒక కాగడా మొలుచుకు వస్తుంది. ఆ కాగడా వెలుతురులో వంచనా ప్రపంచపు నగ్నత్వం బట్టబయలవుతుంది..ఈ ప్రతీకల అర్ధాలు, మాట్ల వెనుక భావాలు సులభమే అర్ధమవటం..
ఇంతకీ కథ ఏదీ అంటే ఇదే కథ.
కహ మధ్యలో జనం ఒక పాత్ర అనిచెప్తాడు రచయిత. జనం జ్ఞానులకు ఒక అప్పీలు ఇస్తారు. అయితే..తాను చేస్తున్న రచన మర్మం అందరికీ బోధపడదని రచయిత గ్రహించినట్టున్నాడు. అందుకే..ఒక సందర్భంలో….అంతా కంఫ్యూజన్. నువ్వూ నీ మాటలు మరీనూ…అనిపిస్తాడు…
ఈ మాటలు ఈ కథకు సరిపోతాయి.
అయితే…మరో పాత్ర…ఖండిత చేతులు సైతం పిడికిళ్ళను కలలు కంటున్న రోజుల్లో ఎత్తిన పిడికిలి దించకు…అని మరో పాత్ర అనటంతో కథ లేని ఈ కథ సంపాదకులకు ఎందుకని ఉత్తమంగా అనిపించిందో అర్ధమవుతుంది..
అయితే…చివరలో….జ్ఞాన భారంతో వంగిపోతున్న మిత్రులూ- నాతో కలవండి. నా ముందో, వెనుకో, పక్కలకో ఊతంగా వుండండి..అయినా..అడుగు కదపని నోరు మెదపని పరమ పవిత్రులతోటి, జ్ఞాన సంపన్నులతోటి నాకేమిటి పని… అనటంతో కథ సంపూర్ణమవుతుంది…
అయితే, ఇది సంపాదకుల దృష్టి ఉత్తమ సిద్ధాంత కథ కావచ్చేమో కానీ…ఇది కథ కాదు అని మాత్రం అనిపిస్తుంది.దీన్ని ఉత్తమ కథగా ఎంచుకుని, ఒప్పించి మెప్పిస్తున్న కథల సంపాదకులకు జోహార్లర్పించాలని పిస్తుంది. బహుషా..ఈ కథలోనివే కొన్ని వాక్యాలు ఈ కథల సంపాదకులు రచయితలను పాఠకులను చూసి నవ్వుకుంటూ ప్రతి సంవత్సరం అనుకుంటూంటారేమో!!!
జనంగారండీ…మిమ్మల్ని మొట్టికాయలు వేసీ వేసీ అలవాటయిపోయింది. కొట్టే బాధనాకు, తినే హాయి నీకు లేకుండా వుండలేం..నేను పెట్టే వాతలే లేకుంటే నువ్వు దిగంబరం కృజఘ్నుడా…
ఇక్కడ పెట్టేవి ఉత్తమ కథల వాతలన్నమాట!!!!!

బెజ్జారపు రవీందర్ రచనలతో చిక్కు ఏమిటంటే ఆయన కథ రాస్తే చక్కగా రాస్తాడు. అద్భుతంగా అనిపించేట్టు రాస్తాడు. కథ బదులు సిద్ధాంతం రాస్తేనే చిక్కు వస్తుంది… కొత్త రంగులద్దుకున్న కల అనే ఎర్రటి రాత్తల్ని చదివిన తరువాత…మూడు తొవ్వలు చదవటం ఆరంభించేందుకు మనసును గట్టి చేసుకుని, గుండెను దిటవు పరచుకుని సిద్ధమవ్వాల్సివుంటుంది. కానీ, ఇది కథ. ఈ కథలో రచయిత ప్రావీణ్యం, కథా కథన చాతుర్యం, కళ్ళ ముందు దృశ్యాలను నిలుపుతూ వాటి ద్వారా జీవిత పాఠాలను నేర్పే చాతుర్యం స్పష్టంగా తెలుస్తూంటాయి.
మధు అనే వ్యక్తి క్రిక్కిరిసిన బస్సులో ప్రయాణిస్తూంటాడు. బాసు పెట్టే బాధల వల్ల చిరాకుగా వుంటాడతడు. బస్సులో రష్హు అతని చిరాకు పెంచుతూంటుంది. అలా చిరాకుగా ఆఫీసు విషయాలు గుర్తుకుతెచ్చుకుని బాధపడుతున్న మధు దృష్టిని బస్సు కండక్టర్ ఆకర్షిస్తాడు. అందరినీ నవ్విస్తూ, వరసలు కలుపుతూ బస్సు ప్రయాణాన్ని ఒక ఆహ్లాదకరమయిన అనుభవంలా మారుస్తూంటాడు కండక్టర్. వృత్తి జీవితంలోని అధిక కాలాన్ని మింగేస్తూంటే పనిలోనే రిలాక్సేషన్ ని వెతుక్కోవాల్సి వస్తోంది..అనుకుంటాడు మధు. అతి చక్కని, గొప్ప వ్యాఖ్య ఇది.. ఈ వాక్యం, ఈ observation కథకుడి పట్ల గౌరవం కలిగిస్తుంది. ఇంతలో బస్సులోకి ఒక అమ్మాయి పిల్లని చంకనేసుకుని వస్తుంది. ఆమె వెనకే ఆమె మొగుడు వస్తాడు. వారిద్దరూ బస్సులో బహిరంగంగా వాదించుకుంటూంటారు. ఇదంతా ఒక సన్యాసి చూస్తూంటాడు. అతను భార్యతో వేగలేక అన్నీ వదలి పారిపోయినవాడు. ఇంతలో ఆ అమ్మాయి మొగుడు, ఆమె శీలాన్ని శంకిస్తాడు. అప్పటి దాకా మూగదానిలా వున్న ఆమె తిరగబడి మొగుడి జుట్టు పట్టుకుంటుంది. నవ్వుతున్న కండక్టర్, నిర్వికారంగా వున్న సాధువు, ఉగ్రరూపమెత్తిన స్త్రీ….ఇవీ మూడు తొవ్వలన్నమాట…దాన్లో మధుకి తన సమస్య స్వరూపము, పరిష్కరించుకునే మూడు దారులూ బోధపడతాయి. చక్కని కథ..ఈ కథను ఉత్తమ కథగా ఎంచుకోవటంపట్ల ఎలాంటి విభేదమూ వుండదు.
వచ్చే వ్యాసంలో ఆర్ ఎం ఉమా మహేశ్వర రావు కథల విశ్లేషణ వుంటుంది.

Enter Your Mail Address

November 8, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply