25ఏళ్ళ ఉత్తమ తెలుగుకథ విశ్లేషణ-25

ఆర్ ఎం ఉమామహేశ్వర రావు కథలు 1991లో బిడ్డలుగల తల్లి, 1993లో మంచివాడు, 1997లో మొగుడూ పెళ్ళాల ప్రేమ కత, 2000ల్0అ నోరుగల్ల ఆడది, 2004లో వొంటేపమాను అనే నాలుగు కథలు 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
ఉమామహేశ్వరరావు కథలు చదువుతూంటే కళ్ళముందు దృశ్యాలు కదలాడుతూంటాయి. జీవితాలు కళ్ళముందు కనిపిస్తాయి. ముఖ్యంగా, రాయలసీమ మాండలీకంలో కథలు రాయటంతో రాయలసీమ గ్రామీణ జీవితాలు మనకు పరిచయమవుతాయి. అయితే, అన్ని కథలూ ఆసక్తిగా చదివించేవే అయినా, అన్ని కథలనూ ఉత్తమ కథలుగా పరిగణించటం కష్టం. కానీ, ఈ కథలు చదివిన తరువాత ఒక విషయం స్పష్టమవుతుంది. రచయితకు భాషపై పట్టుంది. పదాల కలయికతో దృశ్యాలు సృజించే నేర్పువుంది. కథను పద్ధతి ప్రకారం చెప్పే నైపుణ్యం వుంది. కానీ, కొన్ని కథలు అసంతృప్తిని ముగులుస్తాయి. కొన్ని కథలు అద్భుతంగా అనిపిస్తాయి. రచయితకు కథ పట్ల ఉన్న నిర్దిష్టమయిన అభిప్రాయాలో, సిద్ధాంతాలో రచయిత పై ప్రభావం చూపిస్తున్నాయేమో అనిపిస్తుంది అసంతృప్తి కలిగించిన కొన్ని కథలు చదివితే…కానీ, రచయిత కథాకథన నైపుణ్యం పై మాత్రం ఎలాంటి సందేహం కలగదు. చక్కని కథకులలో జాబితాలో సులభంగా ఈ రచయిత పేరు రాయవచ్చు అనిపిస్తుంది.
బిడ్డలుగల్ల తల్లి కథ ఒక విచిత్రమయిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ కథ చదువుతూంటేనే ఇది రచయిత విన్నదో, చూసినదో,అనుభవించిన కథో అనిపిస్తుంది. కాబట్టి ఇలా జరగలేదని, జరగదని అనటం కుదరదు. కానీ, నిజంగా జరిగిన విషయాన్ని కథగా రాస్తున్నప్పుడు , ఈ కథ రచయిత కకనకత్త అని అనే ఆమెకి సంబంధించింది. కనకత్త కూతురు రాజమ్మ. ఆమె చక్కని సంసారాన్ని వదలి ఊళ్ళోని వెంకునాయుడి ఇంతికి వెళ్ళిపోతుంది. ఊళ్ళోవాళ్ళంతా వెళ్ళి ఆమెని లాక్కొస్తారు. కానీ మూడు రోజులకు మళ్ళీ అతని ఇంటికి పారిపోతుంది. మళ్ళీ ఊళ్ళోవాళ్ళు దాదికి వెళ్ళేసరికి అతను పారిపోతాడు. రాజమ్మను ఈడ్చుకొస్తారు. ఆమె తల్లి కనకత్త ఆమెని తనైంట్లోకి రానివ్వదు. ఆమెని ఆమె భర్త ఇంటికి తీసుకువెళ్ళి అక్కడే వదిలేస్తుంది. వాడు పట్టించుకోడు. దయనీయమయిన స్థితిలో జీవిస్తూంటుంది రాజమ్మ. అది చూసి కూతురిని అలా వదిలిందని కనతక్కను అందరూ దూషిస్తూంటారు. చివరికి , ఉండబట్టలేక మన కథకుడు, ఆమె ప్రవర్తన వెనుక అర్ధం అడుగుతాడు. తాను కూతురికి పుట్టింట్లో చోటిస్తే ఇక మొగుడు ఆమెని చూసుకోడు కాబట్తి అక్కడ వదిలింది. ఇక వాడు చూసుకోడని నిర్ధారణ అయిన తరువాత ఒకరోజు వాది ఇంతిముందుకెళ్ళి బూతులు తిట్టి తన కూతుర్ని తాను చూసుకుంటానని చెప్పి కూతురిని తీసుకుని వచ్చేస్తుంది. కూతురితో బంకు పెట్టిస్తుంది. ఇదీ కథ.
చదవగానే ఒక గొప్ప తల్లి పాత్రను సృజించాడు రచయిత అనిపిస్తుంది. కానీ, కథకుండవలసిన లక్షణాలు, కథ నాణ్యతను నిర్ణయించే ప్రామానికాలను అన్వయించి చూస్తే కథ తీవ్రమయిన అసంతృప్తిని కలిగిస్తుంది.
ఇలా జరగదు అని అనే వీలు లేదు. రచయిత కథను ఎంత సహజంగా అనిపించేట్తు రాశేడంటే సంఘటనలు సజీవంగా కళ్ళముందు నిలబడతాయి. పాత్రలు అటూ ఇతూ కదలాడతాయి.. కానీ, ఉన్నదాన్ని ఉన్నట్టు రాస్తే అది రిపోర్టింగ్ అవుతుంది తప్ప రిక్రియేటింగ్ కాదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పటంలోనూ కాస్త సృజన వుండాలి. ఈ సృజన కథలోని అనౌచిత్యాలను తొలగించాలి. ఈ కథలో అది జరగలేదు. ముఖ్యంగా పాత్రల చిత్రణ తీవ్రమయిన అసంతృప్తిని కలిగిస్తుంది. ఇందులో ప్రధానంగా కనిపించే పాత్ర కనకత్త. తరువాత రాజమ్మ. ఆమె మొగుడి పాత్ర సర్వ సాధారణంగానే ప్రవర్తిస్తుంది. రాజమ్మ వెళ్ళిన నాయుడు కథలో కనబడడు. అతదిలో ఏ విషయం రాజమ్మను ఆకర్షించిందో మనకు తెలియదు. పైగా, ఒక సారి ఆమె ఇంటివాళ్ళు లాక్కొచ్చినప్పుడు అతడేమి చేశాడో తెలియదు. ఈమె మళ్ళీ పోయినప్పుడూ ఏమీ అనలేదు. కానీ, అతడిని తన్నటానికి వెళ్ళేసరికి మాత్రం రాజమ్మతో సహా పెళ్ళాం పిల్లల్ని కూడా వదలి పారిపోయాడు. దాంతో చక్కని సంసారాన్ని, మొగుడిని పిల్లల్ని రాజమ్మ ఎందుకు వదలి నాయుడింటికి వెళ్ళిందో మనకు తెలియదు. అందువల్ల ఆ పాత్రపైన సానుభూతి , కేవలం కష్టాలు పడుతోంది అన్న అంశం ఆధారంగా తప్ప మరోరకంగా కలగదు. ఇక, అంతగా రెండు సార్లు ఇల్లొదిలి వెళ్ళిన అమ్మాయి, మొగుడింట్లో అన్ని అవమానాలూ భరిస్తూ ఆరునెలలపాటూ దుర్భర పరిస్థితుల్లో పడివుండటమూ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని అయోమయంలో పారేస్తుంది. రెండు సార్లు సంసారాన్ని వదలి నాయుడు దగ్గరకు పారిపోయింది. మరి అవసరంలేని, అంత అయిష్టమయిన ఇంట్లోనే అన్ని అవమానాలూ, దెబ్బలూ తింటూ ఎందుకని పదివుంది? నాయుడు పారిపోవటంతో ఆమెకు జీవితం మీద విరక్తి కలిగిందా? తాను చేసింది పొరపాటన్న గ్రహింపు వచ్చిందా? అలాంటిదేమీ రచయిత చూపడు. ఆమె మౌనంగా అన్నీ భరిస్తూంటుంది. ఎవడు కొట్టినా మౌనంగా వుంటుంది. ఇది ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని, మానసిక స్థితిని సందిగ్ధంలో పారేస్తుంది. పాత్రను సరిగా రచయిత తీర్చి దిద్దలేదనిపిస్తుంది. అయితే, ఆ పాత్రని సరిగా ఎందుకు తీర్చి దిద్దలేదంటే కనకత్త పాత్రను ఎలివేట్ చేయటానికే అనిపిస్తుంది. ఆ పాత్ర కనుక వ్యక్తిత్వంతో, ఆత్మాభిమానంతో ప్రవర్తిస్తే, ఇక కనకత్త గొప్పతనమేముంది. అమ్మాయి ఇల్లొదిలేసింది. ఎవరికోసం వదిలేసిందో వాడీమెని వదిలి పారిపోయాడు. ఆమె తనకాళ్ళమీద తాను నిలబదింది. దీన్లో కనక్త్త పాత్రకేమీ పాత్ర వుండదు. అందుకని, రాజమ్మ , ఒక్క భర్తని వదిలి పారిపోయేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ నిర్ణయాత్మకంగా ప్రవర్తించకూడదు. ఇది కథను బలహీనం చేస్తుంది. కథపై అసంతృప్తి కలిగిస్తుంది.
కనకత్త పాత్ర విషయానికి వస్తే, కూతురు ఎలాంటిదయినా తల్లి అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించదు. అయితే, పచ్చటి సంసారాన్ని అకారణంగా వదలి వెళ్ళిపోయిందన్న కోపం వున్నా, దానివెనుక, కూతురి బరువును అల్లుడిపైన పెట్టాలన్న ఆలోచన, అందుకోసం ఆరునెలలు కూతురు నానా కష్టాలు పడుతున్నా చూడనట్టుండటం, చివరికి అల్లుడు చూసుకోడని తెలియగానే శాపనార్ధాలు పెట్టి , కూతురితో బంకు పెట్తించటం..ఆమెను కరుణామయి అయిన తల్లిగా కాక, స్కీమింగ్, కన్నింగ్ కంత్రీ తల్లిగా మనముందు నిలుపుతాయి. నిజానికి, ఈ కథలో రాజమ్మ భర్తను విలలా చూపించారు కానీ, ఆయనే అన్యాయమయిపోయినవాడు. అతని పిల్లల తల్లి అకారణంగా పిల్లల్ని సంసారాన్నీ వదలి పారిపోయింది. అదీ, అదేవూళ్ళో మరొకడి ఇంటికి…ఇంత జరిగిన తరువాత కూడా ఆమెని ఆరునెలలు ఇంట్లో వుండనిచ్చాడు..ఏ స్థితిలో, ఎలా అన్నది పక్కన పెడితే, సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో..మీ అమ్మనే నిన్ను రానియ్యట్లేదు, నా ఇంటికెందుకొస్తావు, పో… అని తరిమేస్తారు. అలాకాక, ఇంట్లో ఆమెని వుండనిచ్చిన నేరానికి, కనకత్త చేతిలో బూతులు తినాల్సివచ్చిందతనికి. నిజానికి, రాజమ్మ వదలిపోవటంలో అతని పాత్రలేదు. తనని కాదని అలా పారిపోయి, మళ్ళీ పారిపోయిన తరువాత ఎవరయినా మళ్ళీ సవ్యంగా సంసారం చేస్తారని ఊహించటం కష్టమే. అలాంటిది, అతనిపై తన కూతురి బాధ్యతను రుద్దాలని కనకత్త ప్రయత్నించటం దాన్ని లౌక్యంగానూ, గొప్పతనంగానూ చూపించాలని ప్రయత్నించటం, దాన్ని ఉత్తమ కథగా ఎన్నుకోవటం అన్నీ అసంబద్ధాలూ, అనౌచిత్యాలూ అనిపిస్తాయి. అయితే, అమ్మాయి ఇల్లొదిలి, ముఖ్యంగా మొగుదిని వదలి మరొకడితే పారిపోవటం, మళ్ళీ పట్తుకొస్తే, మళ్ళీ పారిపోవటం..అద్భుతమయిన స్త్రీ స్వేచ్చలా సంపాదకులకు అర్ధమయివుంటుంది. అలా, పరాయివాదింతికి ఎన్ని మార్లు పారిపోయినా, ఆమె స్పేస్..స్త్రీ స్వేచ్చ…అని వదిలేసి, తిరిగ్వస్తేనే మహాభాగ్యం అని చూసుకోక, ఆమెని కష్టపెట్టిన ఆమె మొగుడు పురుషాంకార పందిలా అర్ధమయివుంటాడు. ఇంకేం అభుతమయిన అభ్యుదయ స్త్రీ స్వేచ్చ, పురుషాహంకార దౌష్ట్య ఖండన విప్లవ కథ అనుకునివుంటారు. దీనికి తోడు కూతురు ఎన్ని దెబ్బలు తింటూ, ఎంత నీచమయిన స్థితిలో వున్నా అల్లుడిపై రుద్దాలని ఎదురుచూసి చివరికి తిట్టిన కనకమ్మత్త గొప్ప ఫెమినిస్ట్ అనుకుని వుంటారు. అంతేకానీ, పారిపోయిన అమ్మాయికి విలువౌండదని, కూతురిని వారు ఏలుకోరని తెలిసివుండీ కూతురిని ఇన్ని కష్టాలకు గురిచేసే బదులు, ముందే ఆమెకో బనకు పెట్తించివుంటే, కూతురికిన్ని బాధలు తప్పేవి కదా!!! కూతురు ఇష్టపడక వదలి పారిపోయిన మొగుడికే ఆమె బాధ్యతను అంటగట్టాలని ఇన్ని కష్టాలు కూతురుపడుతూంటే చూస్తూ ఊరుకున్న కనకమ్మత్త పాత్ర అర్ధవిహీనము అనిపిస్తుంది. అయితే…ఉత్తమ కథగా ఎన్నుకోవటంలో మాండలీకము, ముఖ్యంగా రాయలసీమాండలీకము, రచయిత జర్నలిస్టు కావటమూ కూడా తమవంతు పాత్ర నిర్వహించాయేమో అనిపించినా…రచయిత కథను చెప్పే నేర్పు విషయంలో మాత్రం ఎలాంటి సందేహమూ, అనుమానాలు వుండవు.
మిగతా కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో….
Like
Show more reactions

Enter Your Mail Address

November 22, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply