25ఏళ్ళ ఉత్తమ కథల విశ్లేషణ-26

జాన్సర్ చోరగుడి రాసిన మూడు కథలు 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాలలో ఎంచుకున్నారు. అవి: 2003లో మట్టిపక్షులు, 2005లో కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం, 2007లో దీనికి పాత సాఫ్ట్ వేరే పనిచేస్తుంది.
మట్టిపక్షులు ఆలోచింపచేసే రచన. అట్టడుగు వర్గాలవారు తమ వృత్తులను వదిలి, చదువుకుని సామాజికంగా ఎదుగుతూన్నామని భావిస్తూంటారు. కానీ, వారు ఎంత ఎదిగినా, వారిని అణగద్రొక్కిన వారు ఇంకా పైకెదుగుతూంటారని, ఇంతకుముందు, తన తాత పాలేరుగా పనిచేసినవాడి కొడుకు ఫాక్టరీలో తన కొడుకు ఉద్యోగిగా చేరటాన్ని గమనించిన ఒక వ్యక్తి ద్వారా ప్రదర్శించారు రచయిత ఈ కథలో. అంజయ్య తాత దావీదు నౌకరీ చేసింది పెదరామ కోటయ్య దగ్గర. అంజయ్య తండ్రి నౌకరీ చేసింది రామకోటయ్య దగ్గర. చినరామకోటయ్య బంధువుల కంపెనీలో అంజయ్య కొడుకు ఉద్యోగంలో చేరతాడు. అంజయ్యతో కలసి చదివిన దుర్గాప్రసాద్ కొడుకు పెట్టిన కాలేజీలో అంజయ్య కూతురు చేరుతుంది. దీని ఆధారంగా అంజయ్య కొన్ని తీర్మానాలు చేస్తాడు. అదేమిటంటే ఒకప్పుడు అందనివి ఇప్పుదు అందుతున్నాయి…దానికి కారణం ఇప్పుడవి పెద్దలకు పనికిరానివి కావటమే. అంటే అప్పుడూ ఇప్పుడూ తాము ఇతరులకు పనికిరానివి పొందుతున్నారు. అప్పుడు పాలేరయితే, ఇప్పుడు ఉద్యోగి అంతే తేడా!!! అప్పుడు డేనియల్ అనే ఒక మిలటరీవాడు కలసి అంజయ్యకు ఒక లెక్చరిస్తాడు.
మొదటి నుండీ సేవలకే పరిమితమయిపోయిన మనం యాంత్రిక ప్రత్యామ్నాయాలు వచ్చాక వీధిన పడిపోలేదా? మన సామాజిక వర్గాల్లో ఇంకా డెబ్భయ్, ఎనభయ్ శాతం మంది ఈ అస్తిత్వపోరులో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతూండగా, వారిమధ్య విద్యావంతులయిన మన ఈ తరం యువత పోషించాల్సిన బాధ్యత లేదా? అని అదుగుతాడు. చివరికి అంజయ్య తన కుటుంబంలో మరొక తరం తన వృత్తిలోనే వుండాల్సిందని….ఇదీ కథ..
నిజానికి దీన్ని ఒక కథగా భావించటం కష్టమే…అంజయ్య పాత్రలేకపోతే కొన్ని ఆలోచనల కలగలుపు అని పొరపడాల్సివస్తుంది. ఒక భాగమంతా అంజయ్య పడ్డ కష్టాలు, కొడుకు కూతుళ్ళను చదివించే బాధాలు, ఇతరులకవసరంలేనివే తమకు దొరుకుతున్నాయని గ్రహింపు…రెండవ భాగంలో డేనియల్ ఒక లెక్చరిచ్చి, విద్యావంతులయిన దళిత యువకులు గ్రామాలకు వెళ్ళి ఇంకా చైతన్యం లేని వారిని చైతన్యవంతులను చేయాలని సూచిస్తాడు. చివరలో అంజయ్య ఇంకో తరం కుల వృత్తిలో వుంటే బాగుంటుందనుకుంటాడు. అంటే మొత్తంగా చూస్తే ఇది ఒక కథ అనేకన్నా కొన్ని సంఘటనలు ఆలోచనల కలగలుపు అనిపిస్తుంది. అయితే, పైకి వచ్చిన వారు క్రిందనే వున్నవారూ పైకి రావటానికి చేయూతనివ్వాలన్న ఆలోచన చక్కనిది. నిజానికి ఇప్పుడు ఫేస్ బుక్ లో చూస్తూంటే రచయిత చెప్పినమాటల విలువ తెలుస్తుంది. విద్యావంతులయి చక్కని ఉద్యోగాలు సంపాదించి, పెద్ద స్థాయిలో వున్నవారు చేసేదేమిటంటే ఫేస్ బుక్ లో హిందీ ధర్మంపై విషం చిమ్మటం..అంతే తప్ప గ్రామాలలో అసలు తమకు సౌకర్యాలున్నాయని తెలియనివారికి తెలియచెప్పి వారు పైకివచ్చేట్టు చేసేబదులు, అంబేద్కర్ పేరును పదే పదే ప్రస్తావింఛటం, మనువును హిందూ ధర్మాన్ని తిట్టం..దాంతో తామేదో ఉద్ధరించేస్తున్నట్టు ఫీలయిపోవటం చూస్తూంటే వారంతా సరిగా ఉడికీ ఉడకనిదయినా ఈ కథను చదివి అర్ధం చేసుకుంటే మంచిదనిపిస్తుంది. అయితే…ఈ కథను ఉత్తమ కథగా ఆమోదించటం కష్టం….కొన్ని ఆలోచనలు, కొన్ని సంఘటనలు ఉత్తమ కథ అయితే ఇది ఉత్తమ కథ అవుతుంది.
కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం కథ లాగా అనిపిస్తుంది. కానీ ఎందుకో కోహరెన్స్ వున్న కథలాగా అనిపించదు. కథలో ఎక్కడో అర్ధం కాని ప్రతీకలున్నాయేమో అనిపిస్తుంది. కానీ, అవేమిటో అర్ధం కావు. టూకీగా కథ చెప్పాలంటే ఉప్పెన వస్తుంది. అందరూ మునిగి పోతారు. శవాలను ఒక చోట తెచ్చి వేస్తూంటారు. కథ చెప్పే ఆయన భార్య కూతురు కొట్టుకుపోతారు. భార్య శవం దొరుకుతుంది. కూతురు బ్రతికివున్నట్టు తెలుస్తుంది. ఆ వార్త చదివిన ఒక పిల్లలు లేని ఆయన పిల్లను దత్తత తీసుకోవాలని వెళ్తాడు. ఇదీ కథ.. ఏమాత్రం కదిలించలేదీ కథ. చెప్పదలచుకున్నది సూటిగా స్పష్టంగా కథను చెప్పివుంటే బాగుండేది. అలాకాక పోవటంతో ఎవరో కొందరు మేధావులకు తప్ప ఇతరులకు అర్ధంకాని పరిస్థితి నెలకొంది.
దీనికి పాత సాఫ్ట్ వేరే పనిచేస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే కథ కాదు. కొన్ని సంఘటనలు కొన్ని చర్చలు…పుస్తక ప్రచురణ గురించి, పుస్తక పథనం గురించి…అంతే….మాధ్యలో బుచ్చిబాబు కథలు రచనల గురించిన చర్చలు…అన్ని సమస్యలకు, ముఖ్యంగా మానవ సంబంధాల సమస్యలకు పుస్తకపఠనమే పరిష్కారం అని తీర్మానిస్తాడు రచయిత. ఇదొక వ్యాసంలా, ఉదాహరణలో, తర్కాన్ని ఉపయోగించి రాస్తే బాగుండేది. ఇది కథ మాత్రం కాదు. ఒక వ్యక్తి 20ఏళ్ళ తరువాత విజయవాడ వస్తాడు. తనకు పుస్తక పఠనం అలవాటుని పెంచిన సముద్రాలును కలుస్తాడు. అతడు ఇంకొక పబ్లిషర్ని కలుస్తాడు. అతనింకోకరిని కలుపుతాడు. ఆయన కూతురు విదేశాలో వుంటుంది. ఆమె పెళ్ళి ప్రసక్తి వచ్చినప్పుడు అబ్బాయికి చదివే అలవాటుందా? అని అడుగుతుంది. దాంతో, చదివే లవాటే అన్ని సమస్యల పరిష్కారం అని తీర్మానిస్తారు. అదీ కథ…
ఈ మూడూ కథలని ఒప్పుకోవటం కష్టం. ఉత్తమ కథలనటం ఇంకా కష్టం. కొన్ని ఆలోచనలు, కొంత బుచ్చిబాబు సాహిత్య విశ్లేషణ…అంతే…
వచ్చే వ్యాసంలో కాట్రగడ్డ దయానంద్ కథల విశ్లేషణ వుంతుంది.

Enter Your Mail Address

December 10, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply