25ఏళ్ళ ఉత్తమ తెలుగుకథ విశ్లేషణ-27(1)

కాట్రగడ్డ దయానంద్ రాసిన 7 కథలు 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో 1990,1994,1995,1998,2001,2002,2003 సంవత్సరాలలో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. అవి వరుసగా, కర్రావు, గూడు, పండుటాకు, తలపాగా స్వగతం, నేల తిమ్మిరి, గుండ్లకమ్మ తీరాన, అలజడి. ఈ ఏడు కథలు వరుసగా చదవటం ఒక రకంగా రచయిత రచనా సంవిధానం, ఆలోచనా తీరు, దృక్కోణం వంటి అనేక అంశాలను మనకు చేరువ చేస్తాయి. రచయిత రచనల గురించి ఒక అభిప్రాయానికి రావటంలో తోడ్పడతాయి. ముందుగా ఈ కథలు చదువుతూండగానే అర్ధమయ్యే విషయం….రచయిత ప్రధానంగా గ్రామీణ వాతావరణాన్ని , సమస్యలను తన కథల్లో ప్రతిబింబిస్తున్నాడు. ఇది ప్రధానంగా మన ఉత్తమ కథల సంపాదకులకు నచ్చే విషయం. మరో అంశం ఏమిటంటే…కొన్ని కథలు చదివే సరికి, మిగతా కథలు ఆరంభమవగానే అంతమెలా అవుతాయో తెలిసిపోతూంటుంది. అంటే రచయిత పరిధి చాలా పరిమితమని, ఆ పరిమిత పరిథిలోనే అపరిమితమయిన విభిన్న అంశాలతో రచనలు చేసే బదులు , పరిమితమయిన అంశాలచుట్టే పరిభ్రమించే కథలు రచయిత రచైంచాడు. అంటే ఒక విజయవంతమయిన ఫార్మూలాను అనుసరిస్తూ వచ్చాడు తప్ప మానవ మనస్తత్వంలోని విభిన్న కోణాలనుకానీ, మానవ ప్రపంచంలోని వైవిధ్యాన్ని కానీ రచయిత ప్రదర్శించలేదు, కనీసం, ఉత్తమ కథలుగా భావిస్తున్న ఈ ఏడు కథల్లో!!!!
అయితే, కొట్టొచ్చినట్టు కనిపించేది, రచయిత రచనా సంవిధానం. కథ ఆరంభమ్నుంచి చివరి వరకూ ఆసక్తి కరంగా చదివిస్తుంది. అందుకే, ఈ కథలు చదువుతూంటే రచయిత ఒక చట్రంలో బిగిసిపోయి, తన పరిథిని తానే కుచింపచేసుకోకపోతే, ఎన్నెన్ని అందమయిన కథలు వచ్చేవో, తెలుగు కథా సాహితాన్ని ఎంతగా సుసంపన్నం చేసేవో…..అనిపిస్తుంది.
కర్రావు, చాలా ఆకర్షణీయంగా రాసిన కథ. గోవిందమ్మ అనే ఆమెకు చిన్నప్పుడే పెళ్ళి అవుతుంది. కాపురానికి వచ్చిన పదేళ్ళలో ఆడదిక్కులేని సంసారాన్ని ఒక దారికి తెస్తుంది. ఇంటిని ఒక దారికి తెస్తుంది. ఆమె భర్తకు గవర్నమెంటు ఉద్యోగం వస్తే, బలవంతాన పొరుగూరికి పంపిస్తుంది. అయితే, అక్కడ ఓ అమ్మాయిపై మోజు పడ్డ ఆమె భర్త, నువ్వు బాగాలేవు, నిన్నిడిచి వేరేదాన్ని తెచ్చుకుంటానంటాడు. విషయం పంచాయితీకి వెళ్తుంది. పంచాయితీవాళ్ళు, కూతురు తల్లి దగ్గర కొడుకు తండ్రి దగ్గర వుండాలని తీర్పునిస్తారు. ఇదే సమయానికి కర్రావును అమ్మేస్తారు. దూడనుంచి దాన్ని వేరు చేస్తారు. అయితే, అది అందరినీ ఎదిరించి దూడ దగ్గరకు వచ్చేస్తుంది. అది చూసిన గోవిందమ్మ ఇంటికి పరుగెత్తుకు వచ్చి కొడుకుని లాకుని వెళ్తుంది. దూడను కూడా తీసుకువెళ్తుంది. ఇదీ కథ..కథ చక్కగా వుంటుంది. కథ చదువుతూంటేనే, పశువుకు మనిషికి సామ్యం తెస్తూ ఒక హృదయం ద్రవించే చేదు నిజాన్ని రచయిత అత్యంత ప్రభావితం చేసే రీతిలో సమర్ధవంతంగా ప్రదర్శిస్తున్నాడని అర్ధమవుతుంది. ఈ కథ 1990 నాటిది. ఫెమినిజం కథలు వేళ్ళూనుకుంటున్న కాలం అది. ఇలాంటి ప్రతిభావంతులయిన రచయితలు అత్యంత సమర్ధవంతంగా రాసిన ఇలాంటి కథలు భవిష్యత్తులో ఫెమినిజం కథలు రాసే రచయితలకు ప్రేరణగా నిలిచాయి. అయితే, ఈ తొలి తరం రచయితలలో ఉన్న ఆలోచన, అవగాహన, ఆర్తి వంటివి లేని తరువాత ఫెమినిస్టు రచయితలు ఫెమినిజం అంటే బరితెగింపు, పురుషద్వేషం, పీరియడ్ గురించి చర్చించటం, అక్రమ సంబంధమే అసలు సంబంధం , ఎంత విశృంఖలత్వం చూపితే అంత స్వేచ్చ అన్నట్టు కథలు రాసి, మహిళలకు జరిగే అన్యాయాలను విస్మరించారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అన్న అంశాలను వదలి ఫెమినిజాన్ని తప్పుత్రోవపట్తించి అభాసుపాలు చేశారు. అందుకే, అలాంటి కథలు ప్రమాణికత సాధించటానికి దారిని సుగమంచేసిన రచన ఇది అనిపిస్తుంది. ప్రతిభావంతుడొక దారి చూపిస్తాడు. ప్రతిభలేకున్నా ఆశవున్న వాడు, ఆ దారిని మళ్ళిస్తాడు. దాంతో గమ్యం మారుతుంది. అందుకే, ఇలాంటి తొలి తరం ఫెమినిస్టు రచయితల కథలను పునశ్చరణ చేసుకుంటూంటే, దారి మళ్ళిన వారికి దారి గుర్తుకురాకున్నా( ఎందుకంటే ఆ దారిలోనే వారికి పేరొచ్చింది కాబట్టి) తరువాతి తరాలకయినా అసలు లక్ష్యం తెలిసే వీలుంటుంది.
గూడు కథకూడా పల్లెవాతావరణికి సంబంధించిందే. ఈ కథ విచ్హిన్నమవుతున్న సమిష్టి కుటుంబ వ్యవస్థ తొలిదశలోని సంఘర్షణలను, సందిగ్ధాలను, వ్యక్తులలోని ఆశలను, నిరాశలను చక్కగా ప్రదర్శిస్తుంది. ఇప్పుడంటే ఇలాంటి కథలు అలవాటయిపోయాయి కానీ, 1994లో ఇలాంటి కథ రాయటమంటే, తన చుట్తూ వున్న సమాజాన్ని దర్శిస్తూ అందులోని ధోరణులను, మనుషుల మనస్తత్వాల్లోని మార్పులను అర్ధంచేసుకుంటూ, భవిషయత్తులో జరగబోయే పరిణామాలను ఊహించి ప్రదర్సించిన పయనీర్ కథలలో ఈ కథను కూడా ఒక కథగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఆకాలంలో విచ్చిన్నమవుతున్న సమిష్టి కుటుంబ వ్యవస్థను రచయితలు ప్రదర్శించినా, చివరలో ఉపన్యాసాలిచ్చి, సమిష్టి కుతుంబాన్ని సమర్ధించేవారు. వేరు వెళ్ళిన వారు తప్పు తెలుసుకుని పశ్చాత్తపపడటం చూపేవారు. ఇందుకు భిన్నంగా మార్పును గ్రహించి కుతుంబ విచ్చిత్తి తప్పదని మార్పుకు సిద్ధంగా వుండాలని మార్పుతో రాజీపదటం చూపిన అరుదయిన కథ ఇది. ఒక రైతు కుతుంబంలో కొడుకులు కోడళ్ళ ఆకాంక్షలు, అసూయలు భయాలను చూపుతూ ఆ ఇంటి పెద్ద అయిష్టంగానే ఆస్తుల పెంపకానికి ఒప్పుకోవటం కథ. కథ చక్కగా అందరి ద్రుక్కోణాలనూ ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా రచయిత ఒకరి వైపు తీసుకుని తీర్పు చెప్పటం లేకపోవటం కథ విలువను పెంచుతుంది. రచయిత సానుభూతి ఇంటి పెద్దవైపు వున్నా….మార్పు అనివార్యం అని గ్రహించటంతో పాత్ర పెద్దరికం నిలుస్తుంది. పాత్ర ఎలివేట్ అయింది.
పండుటాకు కూడా ఇప్పుడు అలవాటయినా, 1995 నాటి దృష్టితో చూస్తే…చేదు నిజాన్ని చక్కగా ప్రదర్శించిన కథ. ఇంట్లో అత్తగారు కోడలికి భారం. కొడుకు ఎంత బ్రతిమిలాడినా ఆమె ఊళ్ళోని ఇంత్లో ఒంటరిగా వుంటుంది. అనారోగ్యంగా వున్నప్పుడు కొడుకు దగ్గరికి వస్తుంది. ఇంకో కొడుకు దగ్గర వుండదు. ఇది కోడలికి కోపం. ఈసారి అనారోగ్యంతో వచ్చినప్పుడు వైద్యం చేయించే డబ్బులు కూడా కొడుకు దగ్గరవుండవు. ఇది ఆమె గ్రహిస్తుంది. అయినా కొడుకు ఆమెకు వైద్యం చేయించాలని ఆరాటపడతాడు. ఆమె కోలుకున్నట్టే కోలుకుంటుంది. తెల్లారి అందరూ లేచి సూసే సరికి ఆమె వుండదు. ఇంత్లో తలగడపక్కన సాంబ్రాణీ వెలుగుతూంటుంది. ఇదీ కథ. కథ చక్కని కథ. పాత్రల వ్యక్తిత్వాలనూ, ప్రేమలను, నిస్సహాయతలను రచయిత చక్కగా ప్రదర్శించాడు. నిజానికి ఈ మూడు కథలు కథలు కావు, జీవితాలు. సామాజిక జెవాన పరిణామక్రమంలో తమ ప్రమేయంలేకుండానే రూపాంతరం చెందుతున్న మానవ సంబంధాలు, మానవ మనస్తత్వాల చిత్రణ ఈ కథలు అనిపిస్తాయి. ముఖ్యంగా 1990 నుంచీ దేశంలో ఆరంభమయిన పెను మార్పులు మానవ సంబంధాలపై చూపిస్తున్న ప్రభావాన్ని ప్రదర్శించిన కథలివి. భవిషయత్తులో అనేకులిలాంటి కథలు రాశారు. కానీ, మార్పు సంభవిస్తున్న సమయంలోనే, మార్పులింకా గట్టి పడి నిర్దిష్టమయిన రూపం దాల్చకముందే మార్పు ఫలితాలను పసికట్టి ప్రదర్శించిన కథలుగా ఈ మూడు కథలు మిగిలిపోతాయి.
ఈ మూడు కథలు కాట్రగడ్డ దయానంద్ లోని అత్యంత సృజనాత్మకము, సున్నితము, ఆలోచనాత్మకమయిన రచయితను మనకు పరిచయం చేస్తాయి. ఈ కథలను ఉత్తమ కథలుగా భావించటంలో కానీ, మార్పు ఆనవాళ్ళను పసికట్టి రూపాంతరం చెందుతున్న సామాజిక స్వరూపాన్ని చిత్రించిన దార్శనిక కథలుగా కానీ భావించటంలో అభ్యంతరం వుండదు.
మిగతా కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో…

Enter Your Mail Address

December 31, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply