25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ-27(2)

1998లో ఉత్తమకథలుగా ఎంపికయినవాటిలో తలపాగా స్వగతం ఒకటి. కాట్రగడ్డ దయానంద్ రాసిన ఈ కథ నేను తలపాగాని, అంటూ ఆరంభమవుతుంది. కథ ఆరంభంలోనే గొంతుకేదో అడ్డం పడుతుంది. నేను తలపాగాని, అన్న తరువాత వాక్యం- మోకాళ్ళు దాటని పంచె, ముతక బనీను, బనీను జేబులో నాలుగు పుగాక్కాడలు, మాసిన గడ్డము, మట్టి శరీరము, నెత్తిన కిరీటం…..నేను తలపాగాని…మట్టితోనూ, మట్టిని నమ్ముకున్న జీవుల్తోనూ నా సహచరం….
ఇక్కడ ..కథ తలపాగా స్వగతం. అంటే తలపాగా తనగురించి చెప్పుకోవాలి. కానీ..అది తనగురించి చెప్పుకోవటంలేదు. రైతు గురించి, మారుతున్న రైతుల జీవితం గురించి చెప్తోంది. తలపాగా స్వగతం అంటే అదెలా పుట్టింది? దాని బాధలేమిటి? తలపైన వుండటంలో సాధకబాధకాలు, దాని కష్టాలు, తాను ఎవరి తలపైవుందో వారి వ్యక్తిత్వాన్ని, సామాజిక హోదాని బట్టి పొందే గౌరవం, అవమానాలు ఇలాంటివేవో వుంటాయనుకుంటాం. కానీ ఇక్కడ రచయిత తలపాగాను విభిన్నార్ధంలో, తన సంకుచిత ద్రుక్పథం ప్రకారం వాడటంతో..ఇది తలపాగా స్వగతం కాదు, రైతు ఆత్మకథ అయింది…..దాంతో పేరుతోనే కథ పై అసంతృప్తి మొదలవుతుంది. కథ మామూలుది. ఈ సంకలనంలో ఇలాంటి కథలు ఇంకువిదిలిస్తే చుక్కలెక్కడ పడ్డాయో కూడా తెలియనన్ని….దాంతో..ఒకటి అన్వయదోషం, ఆపై కథలో లోపం,,,దాంతో ఇది ఉత్తమ కథ కాదు కదా, కథగా కన్నా ఒక వ్యాసంగా రాస్తేబాగుండేది అనిపిస్తుంది. పగిడీ సంభాల్ జట్ట అని షహీద్ అనే భగత్ సింగ్ సినిమాలో ఒక పాట వుంది. ఆ పాటలో తలపాగా ను ఆత్మాభిమానానికి ప్రతీకగా చూపి, బ్రిటీష్ వాడి కాళ్ళ దగ్గర రైతు తలపాగా పెట్టటాన్ని బానిసత్వానికి, ఆత్మగౌరవాన్ని వదులుకోటానికి నిదర్శనంగా చూపుతాడు…అలాంటిదేదీ లేదీ కథలో. పైగా…తలపాగాను రైతు ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి సంకేతంగా చేయటం పై రచయిత దృష్టి లేనేలేదు. తలపాగా పేరు చెప్పి రైతులు, పంటలు పోవటం..అలవాతయిన అంశాలే కనిపిస్తాయి. దీనికి తోడు పంట పోయినప్పుడల్లా, రైతు నష్టపోయినప్పుడల్లా నేను చచ్చిపోయాను అనటం…రచయిత తలపాగా అని ఏదో ప్రతీకాత్మకంగా చెప్పే బదులు తిన్నగా రైతుల వెత కథ చెప్పేస్తే కనీసం చదవగలిగేవాళ్ళమేమోఅనిపిస్తుంది. ఏరకంగానూ ఈ కథను ఉత్తమ కథగా గుర్తించలేము…నిజానికి కథకు వుండాల్సిన లక్షణాలూ లేని దీన్ని..మెమోయిర్స్ అనవచ్చేమో!!!!
నేలతిమ్మిరి 2001లో ఉత్తమకథలలో ఒకటిగా ఎంపికయింది…ఈ కథకూడా అలవాటయిన పంథాలోనే సాగుతుంది. రైతులు ఆత్మహత్యలు…..అలా అలా…సాగుతుంది. లక్ష్మయ్య అని ఒక రైతుంటాడు. చాలా కష్టాల్లో వుంటాడు. అయినా బోలెదంత డబ్బుపోసి మేనల్లుదిని చదివిస్తాడు. అతడు తన కూతురిని పెళ్ళిచేసుకుంటాడని ఆసపడతాడు. కానీ, పై చదువులకోసం లక్ష్మయ్య డబ్బు సర్దకపోతే మేనల్లుడు వేరేవడి కూతురును పెళ్ళి చేసుకునే ఒప్పందం చేసుకుని డబ్బు తీసుకుంటాడు. దాంతో డబ్బుల్లేక, కూతురి పెళ్లి చెయ్యలేనన్న బాధతో లక్ష్మయ్య ఆత్మహత్య తలపెడతాడు. అది ముందే పసికట్తిన అతని భార్య కూతురు అడ్దుకుంటారు. ఎలాగోలా పిల్లల్ని బ్రతికించుకుంటామని భార్య ధైర్యం చెప్తుంది. కథ అయిపోతుంది. కథ చివరలో భూకంపం వస్తుంది. అది నేలతిమ్మిరి. దాన్ని, ఈ ముగ్గురే గమనించారంటూ కథ ముగిస్తాడు రచయిత..కథ ఆరంభిస్తూనే ముగింపు గ్రహించేయగలిగే కథ ఇది. ఏమాత్రం, ఆసక్తి, కొత్తదనం లేని అలవాతయిన కష్టాల కడగంద్ల కథ ఇది. సంపాదకులు ఇదే సామాజాన్ని ప్రతిబింబించే గొప్ప కథగా భావించినట్తున్నారు. అది వారి దోషం కాదు. వారి దృష్టి దోషం!
గుండ్లకమ్మ తీరాన కథ కూడా అలవాటయిందే..రైతుల భూములను కొని రొయ్యల పెంపకం ఆరంభించాలని పట్నం నుంచి డబ్బులు పట్టుకుని వస్తూంటారు. దాన్ని ఓ రైతు ఎదిరిస్తాడు. భూములన్నీ ఉప్పునీటి కయ్యలవుతాయంటాడు. గూండాలు అతనిపై దాది చేస్తారు. ఏమాత్రం కొత్తదనమూ, ఆసక్తి లేని మామూలు అలవాటయిన కథ ఇది. మార్పును గ్రహించి ఆ మార్పును ఎదుర్కొనేందుకు మానసికంగా సమాజాన్ని సిద్ధం చేసే కథలు రచించిన రచయిత, మార్పు మరణ సద్ర్శం అన్న రీతిలో సంపాదకులు మెచ్చే మూస ఉత్తమకథలు రాసే స్థాయికి దిగజారటం ఈ కథ ప్రదర్శిస్తుంది.
2003 లో ఎంపికయిన ఉత్తమ కథలలో కాట్రగడ్డ దయానంద్ రాసిన అలజడి ఒకటి. ఇది సంపాదకులు చదవకముందే ఉత్తమ కథగా నిర్ణయించే ఆర్ధిక సంస్కరణల దుష్ఫలితాలు, మారుతున్న ఊళ్ళు, ప్రైవేటుపరమవుతున్న కంపెనీలన్నితి దుష్ఫలితాలను హోల్ మొత్తంగా చూపించేసిన కథ ఇది. కథలో నారాయణ అనే ఆయన తన తండ్రికి అనారోగ్యంగా వుంటే చూడాలని ఊరు వస్తాడు. వాళ్ళ నాన్న మైకా గనుల్లో పనిచేసేవాడు. ఇప్పుడు గనులు ప్రైవేత్ పరమయిపోతూ ఉద్యోగులను పట్తించుకోదు. అప్పుడెలావుంది? ఇప్పుడెలా అయింది? మానవ సంబంధాలేమయ్యాయి? అంటూ అన్నిటినీ సంస్కరణలపై నెట్టేసి మార్పుల వల్ల ఇబ్బంది మాత్రం చూపిన కథ ఇది. ఆరంభంలో మార్పును గ్రహించి మార్పుకు తగ్గట్టు మారమని చెప్పిన రచయిత ఈ సంకలనంలోని ఇతర ఉత్తమ కథల రచయితల్లాగే చివరికి మార్పును చూసి భోరు భోరు భేరు భేరు మంటూంటే…ఒక రచయితను తనను తాను మరచిపోయి అందరూ నడుస్తున్న దారిలోకి తేవాలంటే అతని కథలను ఉత్తమ కథలను, ఉత్తమ కథలిలా వుంటాయని, ఇవే ఉత్తమ కథలని చూపి ఆపై సిద్ధాంతం ముసుస్గేసేస్తే..వెయ్యిమందిలో ఒక్కడుగా ప్రత్యేకంగా నిలబడే రచయిత వెయ్యిమందిలో ఒక్కడయిపోతాడు అన్న అభిప్రాయాన్ని బలపరుస్తాయి కాట్రగడ్డ దయానంద్ చివరి నాలుగు కథలు…
ఉత్తమ కథలంటే రైతుల కథలు, పల్లెల్లో మార్పుల కథలు, అణచివేత, అన్యాయాల కథలు, ప్రభుత్వాన్ని, సాంప్రదాయాన్ని వ్యతిరేకించే కథలు మాత్రమే అన్న దురభిప్రాయం తొలిగితేకానీ చక్కని రచయితలు కూడా ఉత్తమ కథలు రాసి కొందరి మెప్పు పొంది సంత్ర్ప్తిపడటం మాని తమ వ్యక్తిత్వం అభిప్రాయాల ప్రకారం తాము రాయాలనుకున్న కథలు రాయరు. అలా రచయిత మనసులోంచి వచ్చిన కథలే పాఠకులకు చిరకాలం గుర్తుండి వెంటాడే కథలు. లేకపోతే….అదిగో రోడ్డు మీది ఇడ్లీ దుకాణం మూసుకుపోయింది ప్రపంచీకరణ వల్ల అని ఫైవ్ స్టార్ హోటల్లో ఏసీలో ఖరీదయిన ఆర్గానిక్ తిండి తింటూ నాయిక వాపోవటమే ఉత్తమ సామాజిక స్పృహకల కథలుగా మిగులుతాయి. రచయితలు కూడా అలాంటి సామాజిక నిస్పృహనే ప్రదర్శించి ఉత్తమ రచయితలైపోవాలని తహతహ లాడతారు.
వచ్చే వ్యాసంలో మధురాంతకం నరేంద్ర కథల విశ్లేషణ వుంటుంది.

Enter Your Mail Address

January 6, 2018 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply