పుస్తక ప్రదర్శనలో నా పుస్తకాలు!

ఈసారి పుస్తక ప్రదర్శనలో నా పుస్తకాలు ప్రధానంగా నాలుగు పుస్తకాల షాపులలో ప్రదర్శితమవుతున్నాయి.

సాధారణంగా, మా పుస్తకాలను ఏ దుకాణంలోనూ అందరికీ కనబడేట్టు పెట్టరు. ఎందుకంటే, అందరూ కొంటారని నమ్మకం వున్న పుస్తకాలను కనబడేట్టు పెడితే లాభం. మాలాంటి పుస్తకాలున్నట్టే చాల మందికి తెలియదు. అలాంటప్పుడు వీటిని ప్రధానంగా ప్రదర్శించి స్థలాన్ని వ్యర్ధం చేఉకోవటం దండుగ. అది వ్యాపారం. ఎవరినీ తప్పు పట్టటానికీ లేదు.

అందుకని నేను నా మితృలతో కలసి తెలుగు బుక్ డిపో దుకాణంలో ఒక రాక్ అద్దెకు తీసుకుని మా పుస్తకాలను ప్రదర్శించేవారము. గత రెండేళ్ళు నాందేడ్ లో వుండటం వల్ల అది కుదరలేదు. ఏసారి సమయానికి వెనక్కు వచ్చేయటం వల్ల మళ్ళీ మితృలతో కలసి తెలుగు బుక్ డిపోలో ఒక రాక్ ను అద్దెకు తీసుకున్నాము.

నేను ప్రచురించిన పుస్తకాలు, అసిధార, అంతర్మధనం, జీవితం-జాతకం,4@5,మనీప్లాంట్ లతో పాటు గుడిపాటి, పెన్నా శివరామకృఇష్ణ, కోడిహళ్ళి మురళీ మోహన్ ల పుస్తకాలు కూడా ఆ రాక్ లో వుంటాయి. ఏ ఎస్ లక్ష్మి గారి అద్దంలో మనం సంకలనం కూడా వుంటుంది.

ఎమెస్కో షాప్ లో కూడా వారు ప్రచురించిన నా పుస్తకాలు రాజ తరంగిణి కథలు, మర్మయోగం, ఇంకా ఇతర కాల్పనికేతర రచనలతో పాటూ నేను ప్రచురించిన పుస్తకాలను కూడా వారు ప్రధానంగా ప్రదర్శిస్తున్నారు.

జూలూరి గౌరీశంకర్ దుకాణం (23) లో కూడా నా పుస్తకాలుంటాయి.

ఈసారి తమ పుస్తకాలను ముద్రించుకున్న రచయితలకు ప్రత్యేక షెల్ఫులను ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ నా పుస్తకాలను అక్కడకూడా వుంచుతున్నాను. అయితే, ఈ దుకాణంలో ఎవరి పుస్తకాలను వారే అమ్ముకోవాలట. అందుకని ప్రతి రోజూ నేను ఆ దుకాణంలోనే వుంటాను. శని, ఆది వారాలలో తుంగభద్రా స్నానానికి వెళ్ళాలనుకోవటం వల్ల నా బదులు సోమశంకర్ కానీ, వేదాంతం శ్రీపతి శర్మ కానీ వుంటారు.

ఇలా పుస్తకాలను ప్రదర్శించటం వల్ల అందరూ పడీ పడీ కొంటారని కాదు. కనీసం ఒక సారి మా పుస్తకాలను చూస్తారన్న ఆశ. భవిష్యత్తులో ఎక్కడయినా వీటి ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారని ఆశ.

మన సమాజంలో పుస్తకానికి తగు ప్రచారమిచ్చే వ్యవస్థ లేదు. పత్రికలలో పుస్తకాల సమీక్షలే ప్రధాన ప్రచారం. కానీ పత్రికలలో ఈ సమీక్షల వెనుక బోలెడన్ని రాజకీయాలుంటాయి. అన్ని పత్రికలలో సమీక్షలు వేయరు. వేసినా రంగుటద్దాలు ఆలు నిజాన్ని చెప్పనివ్వవు. మన టీవీల్లో ఆంగ్ల పుస్తకాల గురించి చర్చిస్తారు కానీ తెలుగు పుస్తకాల ప్రసక్తి రాదు. ఒకవేళ ఎవరయినా మాట్లాడినా పాత రచయితల పుస్తకాలనే ప్రస్తావిస్తారు. కొత్త రచయితల రచనలు వీరు చదవరు.

కొత్త రచయితలను ప్రస్తావించేవారు, తమ ఇజాల నిజాలను, ఉద్యమాల రంగులను ప్రతిబింబించే రచయితల గురించే ప్రస్తావిస్తారు. దాంతో ఆయా రచయితల పేర్లు నలిగినా వారి రచనలు ఉద్యమాల్లోని వారికే పరిమితమవుతాయి. పాఠకుల ఆదరణను పొందవు. తమ భావాలను ప్రతిబింబించే రచనలున్నా అవి వున్నట్టు తెలియక పోవటంతో పాఠకుడు పుస్తకాలకు దూరమవుతాడు. చదివే అలవాటు పోతోందని అంతా గోల చేస్తారు. కానీ, అసలు విషయం గురించి ఆలోచించరు.

కాబట్టి, కనీసం మామూలు ఉద్యమ రచనలు, పాత ప్రసిద్ధుల రచనలే కాక, మధ్యతరగతి మనుషుల సందేహాలు, భయాలతో పాటు ఆశలు ఆనందాలను ప్రతిబింబించే మాలాంటి రచయితల పుస్తకాలున్నాయని పాఠకులకు తెలియబరచేందుకే వీలయినన్ని స్థలాలఓ మా పుస్తకాలు ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నాము.

మా ఈ ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారాలు, ఉత్సాహ ప్రోత్సాహాలు లభిస్తాయని ఆశ.

Enter Your Mail Address

December 19, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

  1. సుజాత - December 19, 2008

    దురదృష్ట వశాత్తూ, ఒక్కో సారి మంచి అంశం, భావ వ్యక్తీకరణ, విశ్లేషణ ఉన్న పుస్తకాల కంటే, సంచలనం సృష్టించిన పుస్తకాలు, లేదా మంచి ప్రాపగాండా ఇచ్చుకున్న పుస్తకాలూ ప్రదర్శనలో ఆదరణకు నోచుకుంటాయి. కానీ మంచి పుస్తకాలు మాత్రమే కొనాలని చూసే (నాలాంటి) వారికి మీ పుస్తకాలు ఎక్కడ దాక్కునా కనపడతాయి. రాజ తరంగిణి, అసిధార ఇలా ఒక ప్రదర్శనలోనే కొన్నాను. వివరాలు ఇచ్చారు కాబట్టి ఈ సారి మరికొన్ని చూస్తాను.

  2. నెటిజన్ - December 19, 2008

    “మన సమాజంలో పుస్తకానికి తగు ప్రచారమిచ్చే వ్యవస్థ లేదు. పత్రికలలో పుస్తకాల సమీక్షలే ప్రధాన ప్రచారం.” నిజమే. ఐనా వాటిని చదివో, స్వీకారంలో చూసో, పుస్తకాని చూసి, కొనుక్కునే వారున్నారు. ఇక తమ పుస్తకాలని తామే అమ్ముకునే స్థితి ఒక విధంగా మంచిదే. పుస్తకంలో సరుకు ఉన్నప్పుడు, వెతూక్కుంటూ వెళ్ళీ కొనుక్కుంటారు పాఠకురాళ్ళు, సుజాతగారి లాగ:) లేని వాడు లేదు. వ్యవస్థ లేదు నిజమే, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చెయ్యడానికి, దానికి చెయ్యగలిగినది ఏమైనా ఉన్నదా?

  3. కోడీహళ్లి మురళీ మోహన్ - December 19, 2008

    @నెటిజన్ గారూ యిప్పుడు మనం చేయాల్సింది అలాంటి వ్యవస్ఠ యేర్పడటంలోని సాధ్యాసాధ్యాలను చర్చించడమే!

Leave a Reply