పుస్తకాక అమ్మకంలో నా అనుభవాలు-2

నిజానికి నా పుష్కర స్నానానుభవాలు రాదామనుకున్నాను. కానీ, ప్రొద్దున్నే సగటుమనిషి స్వగతం, వార్తకు బ్లాగుస్పాట్ లు అర్జెంటుగా రాయాల్సి రావటంతో సమయం చిక్కలేదు. ఆతరువాత ఆఫీసు, అటునుంచి పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు అమ్మటానికి వెళ్ళటంతో వీలు చిక్కలేదు. రాత్రి రాగానే కవర్ స్టోరీ రాత కోసం తగిన సమాచారం సేకరించటంతో ఆలస్యమయిపోయింది. అందుకే ప్రొద్దున్నె లేవగానే కంప్యూటర్ ముందు కూచున్నా.

మనిషి జీవితంలో కొన్ని అనుభవాలు కలుగుతాయి. అనుభవం కలిగిన వెంటనే దాని తీవ్రత అధికంగా వుంటుంది. కానీ, కొద్ది కాలానికి ఎంత తీవ్ర మయిన భావన అయినా పలుచనయిపోతుంది. ఒక అల వచ్చి అంతకు ముందరి అలను మింగేసినట్టు కొత్త అనుభవం పాత అనుభూతిని వెనక్కు నెడుతుంది.

అందుకే పుష్కర స్నానానుభవం వెనుకబడింది. పుస్తకాల అమ్మకాల అనుభవం దాన్ని మించింది. దాంతో నా టపా పుస్తకాల అమ్మకాల అనుభవంగా మారిపోయింది.

ముందుగా సుజాత గారికి ధన్యవాదాలు. కానీ ఈ రకంగా అయినా మిమ్మల్ని కలవగలననుకున్నాను. సోమ శంకర్, అంత sensitive గా వుంటే ఎలా? మన sensitivity మనల్ని రచనలకు ప్రేరేపించేదిగా వుండాలికానీ బాధకు దారి తీయవద్దు. ఆయన పుస్తకాన్ని విస్రేసిన దాన్ని వర్ణించాను తప్ప అది నీ పుస్తకంపైన వ్యాఖ్య కాదు. నా వ్యాఖ్య లోని శ్లేషను అర్ధంచేసుకోవాలి. ఒక అనువాద పుస్తకం కన్నా డబ్బు సంపాదన నేర్పే పుస్తకానికే ప్రాధాన్యం అన్న ధ్వని ని గమనిస్తే నా వర్ణన పుస్తకానికా, ఆ పుస్తకాన్ని అర్ధంచేసుకోలేని మనస్తత్వానికా అన్నది అర్ధమవుతుంది.

పుష్కర స్నానానికి వెళ్ళాను కానీ నా మనసంతా పుస్తక ప్రదర్శనలోనే వుంది. మన ఈ తెలుగు కార్యక్రమంలో మరి కొందరు బ్లాగర్లను కలసే అవకాశం పోయిందన్నది ఒక బాధ. జనం అధికంగా వచ్చేరోజు నేను లేకుండా పోతున్నానే అన్నది మరో బాధ. అయితే, పుష్కర స్నానం తరువాత అమ్మ ఆనందం చూసిన తరువాత మిగతావన్నీ చిన్నవి అయిపోయాయి. మంచిపని చేసానన్న సంతృప్తి కలిగింది. బ్లాగర్లము మళ్ళీ ఎప్పుదో కలవవచ్చు. కానీ పుషకరాలు మళ్ళేఎ మళ్ళే రావుగా. అదీగాక అమ్మ top priority కదా!

దారిలో వున్నప్పుదు, స్టాలులో వున్న శ్రీపతి శర్మ ఫోను చేశాడు. కమ్మ ప్రచురణలను సర్ది మన పుస్తకాలకు స్థలం ఏర్పాటు చేశాను. కానీ, తెలంగాణా పుస్తకాల ప్రచురణల వాళ్ళు వచ్చి హడావిడి చేస్తున్నారు. బానర్లు కట్టేసారు. మన పుస్తకాలను పక్కకు నెట్టి వారి పుస్తకాలను పరిచేసారు. కమ్మ, తెలంగాణాల మధ్య మనం కనబడకుండా నలిగి పోతున్నాం, అన్నాడు. అది రచయితల స్టాలు. అందరిదీ. బోర్దులు పెట్టి ఎవరూ స్వంతం చేసుకునేవీలు లేదు. మన స్థలం కోసం పోరాడు. ఏదో చేయి అన్నాను. కానీ, మనసంతా ఆయన వీళ్ళిద్దరి మధ్యా ఎలా నలుగుతున్నాడో అని భయంగానే వుంది.

అందుకే, సోమవారం రెండుకల్లా హాజరయిపోయా. ఎండగా వుంది. మాకు స్టాలులో రెందు టేబుళ్ళిచారు. ఒక దాని నిండా, కమ్మ చరిత్ర, కమ్మ నామ గోత్రాలు, ఇంతి పేర్లు, విదేశాల్లో కమ్మవారు లాంటి పుస్తకాలు, కమ్మ పత్రికలు నిండిపోయాయి. మరో టేబిల్ పయిన తెలంగాణా కథలు, తెలంగాణం, లాంటి పుస్తకాలు నిందిపోయాయి. కేసీయార్ నవ్వుతో పడివున్నాడు. ఈ గుట్టల మధ్య అసిధార పయిన సరస్వతి బిక్కు బిక్కు మంటోంది. జీవితం జాతకం పుస్తకం పైని గ్రహాలు వికటంగా నవ్వుతూన్నాయి. అంతర్మధనం పైని కల్లోల సాగరం ఓ మూల అణగి వుంది.

అయితే తెలంగాణా బానర్ దెబ్బకు శ్రీపతి, పెద్ద తెల్ల కాగితాల మీద మా పుస్తకాల వివరాలు రాసి స్టాలంతా అతికించాడు. తెలంగాణా పుస్తకాల ప్రచురణకు నిధులు కేసేఆర్ నుంది లభించాయి. అందుకని వారు రంగు రంగుల పెద్ద బానర్ కట్టారు. మాకు ఉన్న నిధి మా రచనా ప్రతిభనే. అందుకనే తెల్ల కాగితం పైన స్కెచ్ పెంతో రాసి పెట్టాడు. కానీ, రచయితల స్టాలు కాస్తా కులం ప్రాంతీయం అయిపోయింది. వచ్చిన వారు తెలంగాణా స్టాలనుకుంటున్నారు. అటు ఆ పుస్తకాలు చూస్తున్నారు. ఇటు కమ్మ పుస్తకాలు చూస్తున్నారు. మధ్యలో వున్న ఆధ్యాత్మిక పుస్తకాలు చూస్తున్నారు.

అంటే, ఒక వైపు ప్రాంతీయ సంకుచితం, మరో వైపు కుల సంకుచితం, ఇవి కాకపోతే ఆధ్యాత్మిక సాహిత్యం-వీటి నడుమ అసలు సాహిత్యం మరుగున పడుతోంది.

ఇలావుంటే లాభంలేదని proactive aggressive marketing ఆరంభించాను. వచ్చిన వారందరికీ జీవితం జాతకం చూపించి దాన్లో నేను చేసిన ప్రయోగాలు, చమత్కారాలు చెప్పటం ఆరంభించాను. దాంతో పుస్తకాన్ని తిప్పి చూసారు కొందరు. తొంగి చూఒసారు కొందరు. కానీ తెలంగాణా, కమ్మ పుస్తకాలే కొన్నారు. అవీ అమ్మింది నేనే. ప్రతివారూ కమ్మ పుస్తకాలలో తమ ఇంటి పేర్లు చూసుకుని ఆనందిస్తున్నారు. కొందరు తెలంగాణా లో రజాకారు ఉద్యమం గురించి పుస్తకాలు అడిగారు. ఈ మధ్యలో ఒకాయన జీవితం జాతకం కొనటానికి సిద్ధపడ్డాడు.

ధర చెప్పాను. 50 రూపాయలు. 10 శాతం తగ్గిస్తే 45/- అన్నాను. 35/- కి ఇవ్వరాదా అన్నడు. నవ్వాను. మేము రచయితలము. మాకు వ్యాపారం రాదు. రాయటమే వచ్చు అన్నాను. ఆయన నవ్వి 20/- చేతిలో పెట్టి పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు నోట మాట రాలేదు. తేరుకుని, వెనకే వెళ్ళి 20/- ఇచ్చేసి పుస్తకం ఫ్రీగా తీసుకోంది అన్నాను. ఆయన వెంటనే వెనక్కి వచ్చి ఇంకో పుస్తకం తీసుకుని థాంక్స్ అని వెళ్ళిపోయాడు. అదేమితి ? అని అడిగా.

ఒక పుస్తకాన్ని నేను కొన్నాను. ఇంకోటి మీరు ఫ్రీగా ఇచ్చారు అన్నాడు వెళ్ళిపోయాడు, 20/- రూపాయలు జేబులో సర్దుకుంటూ.

ఆతరువాత proactive approach వదలి passive marketing చేసాను. ముగ్గురు జీవితం జాతకం కొన్నారు. మిగతా అంతా తెలంగాణ, కమ్మ పుస్తకాలు, శ్రీచక్రానికి సంబంధించిన పుస్తకాలు.

నేను ఫోను చేయటంతో రిషి పీఠం వారు సామవేదం శణ్ముఖ శర్మ పుస్తకాలు తెచ్చిపెట్టారు. వారికి కూడా టేబిల్ పైన స్థానం కల్పించాను. ఆ పుస్తకాలు కొన్నరు.

ఇంతలో శ్రీపతి వచ్చాడు. ఆ తెలంగాణా ఆయన వచ్చాడు. ఆయన వస్తూనే మళ్ళేఎ పుస్తకాలను పరిచాడు. మా పుస్తకాల పైన ఆయన పుస్తకాల్ను పెట్టాడు. నేను తీయబోతే వుంచండి అన్నాడు. అయినా ఆయనవి ఒక పక్కన సర్దాను. కానీ ఏ పక్కన వున్నా కులం, ప్రాంతీయాన్ని గెలవలేమని అర్ధమయింది. స్టాలు ఆయనకు అప్పగించి ఎక్సిబిషనంతా తిరిగాను. అది చూస్తూంటే ఒక ఆలోచన బలంగా తాకింది.

ఇక్కడ నేనేమి చేస్తున్నాను? నేను రచయితను. రాయటం నా పని. పుస్తకాలమ్మటం నా పనికాదు. ఇక్కడ ఇలా వుండటం వల్ల నా సమయం వృధా అవుతోంది. ఈ సమయంలో నేను ఎంతో చదివేవాడిని. రాసేవాడిని. ఇదంతా వదలి ఇక్కడ ఏం చేస్తున్నాను? అనిపించింది.

రాయటం నా పని. నేను రాస్తాను. దాన్ని స్వీకరించటమో తిరస్కరించటమో సమాజం పని. వాళ్ళాకే అవసరం లేనప్పుదు నేను తాపత్రయ పడి లాభం ఏమిటనిపించింది.

దాంతో రెపటి నుంచీ వీలయినంత తక్కువ సమయం గడపాలని నిశ్చయించాను. ఎందుకంటే ఇంత సేపు అక్కడ గడిపి నేను అమ్మింది 3 పుస్తకాలు. దీని కోసం నా విలువయిన సమయాన్ని వ్యర్ధం చేయటం సమంజసమా?

తిరిగి వస్తూంటే అయాన్ రాండ్ వ్యాఖ్య గుర్తుకువచ్చిని.

ఒక సమాజంలో ప్రజలు పెద్ద ఎత్తున నీచతాపరిపూర్ణమయిన విషయాలను ఆదరిస్తున్నారంటే కళాకారుడు బాధపడకూడదు. వాళ్ళా స్థాయి అంతే అనుకోవాలి, తన పని తాను చేసుకుంటూ పోవాలి.

నేనూ అదే చేయాలనుకుంటున్నాను.

Enter Your Mail Address

December 23, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. Darla - December 23, 2008

  మీ ఆవేదన చదువుతుంటే ఏదో వేదన వెంటాడింది. మీరు అన్నట్లు…
  “ఒక వైపు ప్రాంతీయ సంకుచితం, మరో వైపు కుల సంకుచితం, ఇవి కాకపోతే ఆధ్యాత్మిక సాహిత్యం-వీటి నడుమ అసలు సాహిత్యం మరుగున పడుతోంది.” నిజం.
  మీ
  దార్ల

 2. Kumar - December 23, 2008

  ఓర్నాయనో, మీరు క్రితం టపాలో ఏంటో కమ్మ పత్రికలు అని చాలా సార్లంటే, నాకేం అర్ధం కాలేదు. నేను పెరిగిన తెలంగాణాలో ఒక్క పేపర్ ని “కమ్మ” అని అంటాం. బహుశా సింగిల్ పేపర్ లేక కొన్ని పేజీల సాహిత్యం ఏమో అనుకున్నా..కులం గురించని నా మెదడుకి అస్సలు తట్టలేదు సుమీ. ఒకవేళ ఆ అనుమానం వచ్చినా మీరు మరీ అంత బహిరంగంగా కుల ప్రస్తావన ఎందుకు చేస్తారులే పుస్తక ప్రదర్శనలో, అనుకుని వుంటుంది నా అట్టడుగు మనసు. It’s pretty yuck you know!!

  నాకు కళ్ళు తిరిగి పోయాయి ఈ టపాతో. ఇలా “కుల” సాహిత్యం అంటూ ప్రత్యేకంగా వుందా? అదీ ఇంత బహిరంగంగా మార్కెటింగ్ కూడా చేస్తూంటారా? అప్పుడెప్పుడో శ్రీశైలం దగ్గరో ఎక్కడో కులాలకి ప్రత్యేకంగా భోజనశాలలు ఉంటాయని విని ఆశ్చర్య పోయా. ఎప్పుడూ చూడలేదు.

  నాకో ఆశ్చర్యం…అలాంటి చోట్ల పని చేసే వాళ్ళు, బయట చెప్పుకుంటారా మేము అక్కడ పని చేస్తాము అని!!!!! కొంచెం తల కొట్టేసినట్లుండదూ..అలా చెప్పుకోవాలంటే.

  ఇకపోతే, మీరు చివర్లో చెప్పిన విషయం గురించి, దీర్ఘమయిన నిట్టూర్పు వచ్చింది నాకు. కాని మురళీ కృష్ణ గారు మీరే అలా అంటే ఎలా అండీ. నాకు అమెరికాలో దేవుడు ఇచ్చిన వరాల్లో పుస్తకాలు ఒకటి అని నేను ఎప్పుడూ ఫీల్ అవుతుంటా. లక్షల్లో ఉన్న లైబ్రరీలే కాకుండా, ప్రతి నగరంలో పేట కో రెండు, మన దగ్గర ఓ మాల్ సైజంత ఉండే పుస్తకాల దుకాణాలు, దాంట్లో ఉచితంగా దోచుకోవడానికి కావాల్సినంత దొరికే సౌభాగ్యం..అబ్బ నా ఉద్దేశంలో అమెరికా ని బలంగా నిలబెడుతున్న పిల్లర్స్ లో అది కూడా ఒకటి.

  మన సమాజంలో దురదృష్ట వశాత్తూ, చదివే అలవాటు దాదాపు శూన్యం. వార్తా పత్రికలు, వార పత్రికలు, సినిమా పత్రికలూ, ఈ మద్యన పర్సనాలిటీ డెవలప్మెంట్ తప్పితే అస్సలు ఇంకేమయినా చదువుతున్నారా ఈ జనాలు. నేను ప్రతి వారం తప్పక చూసే చానెల్స్ లో, బుక్ టివి ఒకటి ఇక్కడ. బుక్ టివి లాంటిది ఎప్పుడైనా ఊహించగలనా మన రాష్ట్రంలో.

  తప్పదు సార్.. ప్రజల కోసమూ రాయాలి మీరు, మీ కోసమూ రాయాలి. అది మీ భాద్యత.

  గుర్తు పెట్టుకోండి..చరిత్రలో ఎప్పుడైనా మాకు మీరు ఇర్రిలవెంట్ అంటూ నిర్లక్ష్యం కాబడ్డా ఆలోచనా పరులే, సామాన్య ప్రజల్ని కాస్త ఆలొచించేలా తోసారు.

  It’s always the responsibility of people who ‘have’, to think about people who don’t ‘have’. That’s called leadership too. Whether your team likes you or not, you got to do what is best for them, because you stand at the vantage point, that they are unable to see.

  KumarN

 3. కె.మహేష్ కుమార్ - December 23, 2008

  @కుమార్: ప్రస్తుతం కులం ఇంతై వంటుడింతై బ్రహ్మాండంబంతై..అని పెరిగిపోయింది. విశ్వంలో ఎక్కడున్నా దీని ప్రభావానికి దూరం కావడం కష్టతరమైపోయింది. మీరు దీని బారినపడకుండా ఎలా సురక్షితంగా ఉన్నారా అని సందేహంగా ఉంది.

 4. కస్తూరి మురళీకృష్ణ - December 23, 2008

  దార్ల గరికి, కుమార్ గారికి, మహేష్ కుమార్ కు మీ స్పందనలకు ధన్యవాదాలు.

  ఒక చిన్న వివ్వరణ. మళ్ళీ నేను రాసింది చదువుకుంటే పొరపాటుగా అర్ధం చేసుకునే వీలుందని ఈ వివరణ రాస్తున్నాను. నేను భావనలనే సంకుచితం అన్నాను కానీ, ప్రదర్శించిన పుస్తకాలలో భావనలను సంకుచితం అనలేదు. నేను ఆ పుస్తకాలు చదవలేదు. ఇక్కడ భావనలను ఒక విస్తృతార్ధంలో వాడాను. ఇది, చివరన ఇచ్చిన అయాన్ రాండ్ వ్యాఖ్యకూ వర్తిస్తుంది. కాబట్టి ఎవరయినా నేను ప్రదర్సించిన పుస్తకాల గురించి వ్యాఖ్యానించానని అనుకుంటే అది పొరపాతు. అలాంటి అర్ధం వచ్చేట్టు రాసిన నా భావ వ్యక్తీకరణ లోపాన్ని వొప్పుకుంటూ ఈ సవరణను ఇస్తున్నాను.అర్ధం చేసుకో ప్రార్ధన.

 5. సుజాత - December 23, 2008

  కుమార్ గారు, మురళీ కృష్ణ గారి టపా కాదు కానీ మీ వ్యాఖ్య చూస్తే నా కళ్ళు తిరిగాయి! కుల సాహిత్యం అంటూ ఒకటుందా అని మీరు ఆశ్చర్యపోతుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకూ మీరు విదేశాలకెళ్ళి ఎన్నేళ్ళయింది? లేక మీరు సాహిత్యం వైపు ఎక్కువగా రాలేదా? ఫలానా కులం వాళ్ల ఇంటిపేర్లు, గోత్రాల పేర్లు, వారి పాండిత్యం, వీరత్వం, పరిపాలన, వగైరా సబ్జెక్టులతో కూడా కుల సాహిత్యం ఉంది! ఆ పుస్తకాలు చూసినపుడు “అయ్యో, ఇలా ఎందుకు జరుగుతోంది” అని బాధ పడటం తప్ప ఏమీ చేయలేం! (అది ఏ కులమైనా సరే)

  మురళీకృష్ణ గారు,
  ఆదివారం కూడా మీ పుస్తకాలు ఈ ‘ఫలానా ‘ సాహిత్యం కిందే ఇరుక్కుపోయి ఉన్నాయి. నేను ఒకటి కష్టపడి వెదికితే మరొకాయన మరో పుస్తకం వెదికి ఇచ్చారు. అదిసరే, ఈ ఫ్రీ స్టఫ్ ఆశించే వాళ్ళు పుస్తక ప్రదర్శనలో కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఉంది. పైగా బేరాలాడ్డం ఒకటా!

 6. shivaspeaks - December 23, 2008

  “ఇక్కడ నేనేమి చేస్తున్నాను? నేను రచయితను. రాయటం నా పని. పుస్తకాలమ్మటం నా పనికాదు. ఇక్కడ ఇలా వుండటం వల్ల నా సమయం వృధా అవుతోంది. ఈ సమయంలో నేను ఎంతో చదివేవాడిని. రాసేవాడిని.”

  అవును . అది నిజం .

  తెలుగు రత్న లో మీలాంటి రచయుతల కోసము ఒక విభాగం ఉంది .
  మీ పుస్తకాలను అక్కడ కుడా కలపండి వీలైతే.
  http://teluguratna.com/component/option,com_booklibrary/Itemid,58/

 7. shivaspeaks - December 23, 2008

  తెలుగు రత్నలో పుస్తకాలు కలపడం పూర్తిగా ఉచితం ..
  వివరాలి ఈ వ్యాసంలో కింద ఉన్నాయి ..గమనించండి . మీ స్నేహితుల పుస్తకాలు కూడా కలపండి వీలైతే..ల్

  http://teluguratna.com/content/view/91/35/

Leave a Reply