కలిసింది తొలిసారే అయినా, ఎన్నో ఏళ్ళ పరిచయస్తుల్లా కలసిపోయాం.ఎందుకని?

గమనిస్తే, ఈ ప్రశ్న పరిచయమయిన ప్రతి బ్లాగరు మదిలో మెదులుతూన్న ప్రశ్ననే. పరిచయాల గురించి ఎవరి బ్లాగులో చూసినా, ఇదే మొదటి సారి కలవటం అయినా, ఆప్యాయంగా ఎంతకాలం నుంచో పరిచయం వున్న వారిలా కలసిపోయాం అని రాస్తున్నారు. ఇందుకు కారణాలు అణ్వేశిస్తున్నారు.

నా సంగతే చూడండి.

నేను సాధారణంగా ఎవరితోనూ వెంటనే కలవలేను. కలసినా అంతగా మాట్లాడలేను. నేను కలసి నోరిప్పటానికి చాలా సమయం పడుతుంది.

అంతేకాదు, నాకు నాలుగయిదు సార్లు కలిస్తేకానీ పేర్లు, రూపాలు గుర్తుండవు. ఎక్కడో చూశాను, అనుకుంటూంటాను. పేరు గుర్తుకు రాదు. ఏదో పేరు నాలికపైన వస్తుంది. కానీ, రూపం రాదు. అందుకని, ఎవరయినా పలకరిస్తే, పొడి పొదిగా, అంటీముట్టనట్టు మాట్లాడి వెళ్ళిపోతాను. వారు మళ్ళీ పలకరిస్తే గుర్తుపట్టలేను. మరచిపోతాను. కానీ, ఒక్కసారి అలవాటయినతరువాత, నా నోరు మూయించటం చాల కష్టం. నా అతివాగుడు వల్ల ఎందరో దూరం పారిపోయారుకూడా. దాంతో ఆచి తూచి మాట్లాడటం అలవాటయింది.

అందుకే, నేను దాదాపుగా స్కూలు స్థాయి నుంచి హైదెరాబాదులోనే చదువుతూన్నా, ఉద్యోగమూ ఇక్కడే అయినా, నాకు చెప్పుకోవటానికి సన్నిహితులన్నవారు లేరు. బాల్య మిత్రులన్నవారు లేరు. కాలేజీ పరిచయస్థులూ లేరు. ఉద్యోగంలోనూ, అవసరార్ధం మాటలు తప్ప, ఆంతరంగిక పరిచయాలూ లేవు. ఒకోసారి నన్ను చూస్తే నాకే, సాగరం ఒడ్డున కూచుని, ప్రవాహాన్ని చూస్తూన్నవాడిలా అనిపిస్తుంది. సాగరం నీటి తడికి దూరంగా వున్నట్టు అనిపిస్తుంది.

నా గదిలో కూచోవటం, పుస్తకాలు చదవటం, రాయటం, పాటలు వినటం, సినిమాలు చూడటం…ఇంతే! నావల్ల, అందరితో కలివిడిగా వుండే నా భార్యకూడా తన social life కోల్పోయింది. నేను ఫంక్షన్లకు వెళ్ళను. పదిమంది ఉన్నచోటినుంచి దూరంగా పారిపోతాను. ఎవరితోమాట్లాడుతున్నా, నాకు సమయం వ్యర్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో చదవవచ్చు, రాయవచ్చు, ఏమీ లేకపోతే, హాయిగా కూచుని ఆకాశంలో మన కోసం ప్రకృతి సృజిస్తున్న చిత్రలేఖన ప్రదర్శనను చూసి ఆనదించవచ్చు అనుకుంటాను. అందుకే ఎవరితో ఎక్కువగా కలవను. సమయం గడపను.

అలాంటిది, పప్పు అరుణ గారు కలవగానే, అంత వరకూ పరిచయంలేకున్నా, ఎంతో కాలం పరిచయం వున్నట్టు మాట్లాడేను. మహేష్ కుమార్ ని చూస్తే, ఆప్యాయంగా అనిపించింది. చాలా చనువుగా జోకులేసాను. కొన్నేళ్ళు కలసి ఆలోచనలు, అనుభవాలు పంచుకున్నవారితో వ్యవహరించినట్టు వ్యవహరించాను. సుజాత గారికోసమయితే ఎంత ఎదురుచూశానంటే, తన తొలి కథ అచ్చయిన పత్రిక విడుదల కోసం, రచయిత పొద్దుటినుంచీ దుకాణం ముందు పడిగాపులు కాచినట్టు ఎదురుచూశాను. వారు కలవగానే కొత్త అన్నదిలేకుండా, రోజూ మాట్లాడుతూ, నిన్నటి సంభాషణను ఇవాళ్ళ కొనసాగించినట్టు మాట్లాడాను. వరూధినిగారితో అసలు పరిచయంలేదు కానీ, మొహమాటపెట్టి పుస్తకం కొనిపించాను. శిరీష్ కుమార్ గారితో మాట్లాడుతూంటే ఎంతో సన్నిహితుడితో మాట్లాడినట్టు అనిపించింది. జ్యోతి గారి విషయం చెప్పనక్కరలేదు. వారింటికి నన్ను నేనే ఆహ్వానించుకున్నాను. నేను, మా బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళను. అలాంటిది, తలచుకుంటే, నాకే ఆశ్చర్యమనిపిస్తోంది. కనీసం నేను ఎవరితోనూ చాటింగ్ చేయలేదు. అలాంటిది, ఇంటికి ఎలా ఆహ్వానించుకున్నానా, అని ఆలొచిస్తున్నానిప్పతికీ.

దీనికి నాకు ఒకటే ప్రధాన కారణంలా అనిపిస్తోంది. మామూలు ప్రపంచంలోని పరిచయాలకు, బ్లాగు పరిచయాలకు ఉన్న ప్రధానమయిన తేడా ఇందుకు కారణం.

మామూలు ప్రపంచంలో పరిచయాలు, భౌతికమయినవి. మనిషిని చూస్తాం. సామజిక హోదా, మన అవసరాలు, మనకు మాటతీరు నచ్చటం లాంటివన్ని ఆ పరిచయాలు పెరగటంలో పాత్రలు వహిస్తాయి. కలవటానికి వీలు, మాట్లాడేఅ తీరికలు పరిచయం పెరగటానికి తోడ్పడతాయి.

కానీ, బ్లాగు పరిచయాలు, ఆలోచనల పరిచయాలు. తిన్నగా, మనిషి రూపం, సామాజిక స్థాయి, అవసరాలవంటివేవీ లేకుండా, ఇవి మనసులోని మాటల పరిచయాలు.

బ్లాగుల్లో మనం కనపడం. మన ఆలొచనలు కనిపిస్తాయి. మన మానసిక భావాల వ్యక్తీకరణ కనిపిస్తుంది. అంటే, ఎంతో సన్నిహితంగా వస్తే కానీ, మామూలు జీవితంలో సంభాషించలేని విధంగా, మనము బ్లాగుల్లో మాట్లాడుకుంటామన్నమాట. ఇలా, మన భావాలు పంచుకోవటంవల్ల, మనసులోని మాటలు ముచ్చటించుకోవటంవల్ల, మన రూపాలతో, వయసులతో, సామాజిక స్థాయిలతో, gender తో సంబంధంలేకుండా మనము భౌతిక పరిచయం లేకున్నా, మానసికంగా స్నేహితులమయ్యామన్నమాట. ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవటం అన్నది, ఈ మైత్రిని మరింతగా విస్తరించటమే తప్ప మరొకటికాదు.

అందుకే, తొలిసారి కలసినా, అందరమూ , ఎన్నోఏళ్ళా పరిచయాలున్నవారిలా పలకరించుకున్నాము. కొత్త అన్నది లేకుండా మాట్లాడుకున్నాము. ఎందుకంటే, బ్లాగుల్లో మనసువిప్పి మాట్లాడుకుంటున్న మనము ఇప్పుదు కళ్ళతో ఒకరిని ఒకరు చూస్తూ మాట్లాడుకున్నాము.

ఇలా కలవటంవల్ల మన బ్లాగు మైత్రి మరింతగా సన్నిహితమయింది. అందుకే ఈ బ్లాగు బంధం ఏనాటిదో అనుకుంటున్నాము. ఇది కలకాలం ఇలాగే ఉన్నత మయిన ఆలోచనలతో, ఉత్తమమయిన ఊసులతో కొనసాగాలని ఆశిస్తున్నాము.

Enter Your Mail Address

December 28, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. Audisesha reddy. K. - December 28, 2008

  మురళీ కృస్క్ష్ణ గారూ..!
  మీరు నేరుగా తెలియనప్పటికీ పత్రికల ద్వారా అందరికి సుపరిచుతులే. ఈరోజు మీ బ్లాగ్ దొరికింది.

 2. Purnima - December 28, 2008

  Very true,, every single line!

 3. Kumar - December 28, 2008

  So true..

  నేనూ బాగా రిజర్వ్డ్ పర్సన్ అయ్యి ఉండి వుండడం వల్ల, నాకు మీరు చెప్పేవి బాగా అర్ధం అయ్యాయి(from the place where I stand అంటారే అలాగే). ముఖ్యంగా నేను నా కుటుంబ సభ్యుల, బంధువుల మధ్య చాలా రిజర్వుడ్ గా ఉండడం సంవత్సరాల నుంచీ అలవాటయ్యి పోయింది. స్నేహితుల మధ్యనే కొంచెం మాట్లాడుతా కాని, అంతా సూపర్ఫిషియల్ టాక్సే ఎక్కువుంటాయి, కాబట్టి నాకూ డొమెయిన్(technical) ఫ్రెండ్సే తప్ప, దగ్గరి స్నేహితులు లేరు.

  కాని నాక్కూడా మీకనిపించినట్లుగానే, నేను బ్లాగ్మిత్రులని కలిస్తే చాలా తొందరగా వాళ్ళతో సన్నిహితంగా ఉండగలననిపిస్తోంది.

  I am actually looking for something more constructive and meaningful.

  KumarN

 4. శ్రీనివాసకుమార్ గుళ్ళపూడి - December 28, 2008

  హృదయాంతరాళాల్లోంచి వచ్చిన మీ అనుభూతులకు జోహార్లు.

 5. వేణూ శ్రీకాంత్ - December 28, 2008

  Hmm Good analysis. నిజమే పరిచయాల గురించి ప్రతి బ్లాగు లోనూ చదివి ఇదెలా సాధ్యం అని అనుకుంటూ ఉన్నాను, బాగా వివరించారు. అన్నట్లు మీ Social life గురించి చదువుతుంటే నా గురించి చదువుతున్నట్లుంది.

 6. నెటిజన్ - December 28, 2008

  “బ్లాగుల్లో మనం కనపడం. మన ఆలొచనలు కనిపిస్తాయి. మన మానసిక భావాల వ్యక్తీకరణ కనిపిస్తుంది. అంటే, ఎంతో సన్నిహితంగా వస్తే కానీ, మామూలు జీవితంలో సంభాషించలేని విధంగా, మనము బ్లాగుల్లో మాట్లాడుకుంటామన్నమాట. ఇలా, మన భావాలు పంచుకోవటంవల్ల, మనసులోని మాటలు ముచ్చటించుకోవటంవల్ల, మన రూపాలతో, వయసులతో, సామాజిక స్థాయిలతో, gender తో సంబంధంలేకుండా మనము భౌతిక పరిచయం లేకున్నా, మానసికంగా స్నేహితులమయ్యామన్నమాట. ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవటం అన్నది, ఈ మైత్రిని మరింతగా విస్తరించటమే తప్ప మరొకటికాదు.”
  – నిఝం!

 7. కె.మహేష్ కుమార్ - December 28, 2008

  నెటిజన్ ఉటంకించిన మీ వ్యాసంలోని పదాలతో నేనూ…నిజమే అనేసాను.

 8. narasimha rao mallina - December 28, 2008

  నిజంగా నిజమండి. నెటిజన్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

 9. దాట్ల శ్రీనివాసరాజు - December 28, 2008

  కుమార్ గారు చెప్పినట్టు “నేనూ బాగా రిజర్వ్డ్ పర్సన్ అయ్యి ఉండి వుండడం వల్ల, నాకు మీరు చెప్పేవి బాగా అర్ధం అయ్యాయి”
  మీ (మన) వరస చూస్తుంటే ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారులో ఎన్నెన్నో వర్ణాలు పాటలో ఒక లైను గుర్తొచ్చింది..
  “నేనంటూ ప్రత్యేకం; నాదంటూ ఓ లోకం…” :-)

 10. cbrao - December 28, 2008

  Exhibition Stall వ్యాసాల ద్వారా చాలా దగ్గరయ్యారు. మా ఇంటికి తేనీరు సేవించటానికి రండి.
  -cbrao
  San Jose,CA

 11. bollojubaba - December 28, 2008

  మనసులో ఉన్న భావాల్ని యధాతధంగా అక్షరబద్దం చేయటం మామూలు విషయం కాదు.
  మీ భావాలతో ఏకీభవిస్తున్నాను.

 12. pappu - December 28, 2008

  మీరేంటండి బాబూ నా డూప్ లాగ ఉన్నారు.ఇన్నాళ్ళూ నేనే ఎవరితోనూ మాట్లాడను ఎంతో దగ్గరయితే తప్ప అని అనుకుంటూ ఉండేవాడ్ని.మీ రాతలూ,ఈ పైన వ్యాఖ్యలు చూస్తుంటే కొంచెం అటూ ఇటూగా అందరి ఫ్రీక్వెన్సీ ఒకేలాగ ఉన్నట్లుంది.ఒకే గూటి పక్షుల్లాగ.అంతేగా మరి బ్లాగ్ గూటి పక్షులు..

 13. durgeswara - December 28, 2008

  అర్రె ! మిమ్మల్ని కలవలేక పోయానే……………………..

 14. సుజాత - January 3, 2009

  నెటిజెన్ గారి వ్యాఖ్యతో 100 శాతం ఏకీభవిస్తున్నాను.

Leave a Reply