విశ్వనాథ వారి కిన్నెరసాని!

తెలిసిన దాని నుంచి తెలియని దానికి ప్రయాణం చేయటం ఒక పద్ధతి. అందుకే, విశ్వనాథ వారి సహితీ సముద్ర పరిచయాన్ని కిన్నెరసాని పాటలతో ఆరంభిస్తున్నాను.

కిన్నెరసాని చాలామందికి తెలుసు. అవి చదవకున్నా, కనీసం, కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెలపైటేసీ, అనే పాట పుణ్యమాని అయినా తెలుసు.

కిన్నెరసాని కథ హృద్యమయినది.

భర్తపైన అలిగి కిన్నెరసాని వాగై ప్రవహిస్తుంది. అయితే, సంసారమనే రక్షణ కవచాన్ని త్యజించిన మహిళ పురుషులకు చులకన. పురుష హృదయానికి ప్రతీకలాంటి సముద్రుడు, కిన్నెరసానిని చూసి మోహిస్తాడు. ఆమెని కబళించేందుకు చెలియలికట్ట దాటేందుకు సుద్ధపడతాడు.

ఇది కిన్నెరసానిలో వేదన కలిగిస్తుంది. భయం కలిగిస్తుంది. ఆమె దయనీయ దుస్థితిని గమనించిన గోదావరి ఆమెక్ అభయాన్నిస్తుంది. ఆమెను తనలో కలిపేసుకుని సముద్రుడికి కనబడకుండా చేస్తుంది. రక్షణ నిస్తుంది. ఇదీ కథ.

ఆ కాలంలో, అప్పుడప్పుడే, సంసారమనేది అందమయిన అనుబంధంకాక, లోహ పంజరమన్న ప్రచారం మొదలయింది. మహిళా విముక్తి అంటే, స్త్రీ సంసార బంధనాలు, సామాజిక నియమ నిబంధనలు త్రెంచుకోవటమే అన్న ప్రచారం బలంగా సాగేది. ముందు వెనుకలు గ్రహించకుండా, తాత్కాలికాలపైనే దృష్టి వున్న సమాజం గుడ్డిగా అదే ఆధునికము, అభ్యుదయమూ అనుకుంది.

కవి ద్రష్ట అయివుండాలి. తాత్కాలిక ఆవేషాలకతడు లోను కాకూడదు. తన భావావేశానికి, సృజనాత్మక పరవశాన్ని జోడించి, విచక్షణను కలిపి కవిత ద్వారా ప్రజలను జాగృతులను చేయాలి. భూతకాలాన్ని అర్ధం చేసుకుని, వర్తమానాన్ని అవగాహన చేసుకుని, భవిష్యత్ దర్శనం చేస్తూ, ప్రజలకు మార్గ దర్శనం చేయాలి. అలాకాక మామూలు ఆవేశాలకు అక్షర రూపం ఇచ్చేవారు మామూలు రచయితలలా మిగిలిపోతారు. తాత్కాలికంగా పెరౌ సంపాదించినా, శాశ్వతంగా సమాజానికి నష్టం కలిగించిన వారవుతారు. ఎవరయితే, ఆవేశానికి విచక్షణ జోడించి, తాత్కాలికాలవైపు కాక శాశ్వతాలవైపు దృష్టి సారిస్తారో వారు ద్రష్టలవుతారు. అందుకే విశ్వనాథ ద్రష్ట!

అప్పుడు, మహిళలను రెచ్చగొట్టటం, అసంతృప్తులను ఎగదోయటం, తాళి తెంపి పారేసి బంధనాలను తెంచుకోమనటం ఫాషన్. అలా రాసివుంటే విశ్వనాథ వారికి సమాజామోదం లభించేది. పేరు ప్రఖ్యాతులు దక్కేవి. కానీ, అలా చేసి వుంటే ఆయన విశ్వనాథ వారయ్యేవారు కాదు. ఆయన గురించి ఈనాడు చర్చించేవారమూ కాదు.

ఎంతటి చేదు నిజమయినా తాను మంచి అనుకున్నదాన్ని, అన్ని వ్యతిరేకతలను తట్టుకుంటూ ప్రకటించేవాడు నిజమయిన రచయిత. అలాంటి అచ్చమయిన రచయిత విశ్వనాథ.

కిన్నెరసాని కథను గమనిస్తే కవి ప్రత్యక్షంగా చెప్తున్నదానికంటే ప్రతీకాత్మకంగా చూపిస్తున్నదే ప్రాధాన్యం అని అర్ధమవుతుంది.

కిన్నెరసాని భర్తను త్యజించింది. రక్షణను కాదంది. ఇప్పుడామె అరక్షిత. సముద్రుడు వెంటపడ్డాడు. ఒంటరి మహిళను చూస్తే సామాజిక స్థాయితో సంబంధంలేకుండా ప్తతి పురుషుడూ కౌటిల్య కడలిలాంటి వాడవుతాడు. ఇదీ మనం అనుభవిస్తున్నదే. అలాంటి మహిళకు రక్షణ నిచ్చేది తల్లి గోదావరి. ధర్మానికి, సామాజిక సూత్రాల అనుసరణకూ ప్రతీక గోదావరి. ఇప్పుడు, కిన్నెరసాని రచన స్వరూపమే మారి పోతుంది. ప్రస్తుత సమాజంలో మనము చూస్తూ, అనుభవిస్తున్న అనేక వికృతుల స్వరూప స్వభావాలు అర్ధమవుతాయి. ద్రష్టత్వం అంటే ఏమిటో బొధపడుతుంది. ఇది చూడలేని వారు, సముద్రం వొడ్దున దూరంగా కూచుని సముద్రంలోకి రాళ్ళు విసిరే అల్పులే తప్ప అన్యులు కారని అర్ధమవుతుంది.

తన కావ్యాన్ని విశ్వనాథ విలిఖించిన తీరు అత్యంత ఆధునికమూ, అమోఘమూను. ఇది, అర్ధంకాదని, కొరుకుడుపడదని, విశ్వనాథ పాతను పట్టుకుని వ్రేలాడతాడని విమర్శించేవారి అఙ్నానాన్ని, కుత్సితత్వాన్ని బట్టబయలు చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చూడండి, మీరే నిర్ణయించుకోండి.

తన మీద కోపించిన భార్యను భర్త వేడుకోవటం చూడండి

ఇంత కోపమేమిటికే/ ఇంత పంత మేమిటికే/ ఇంతలు జగమున పతులకు/ నింతులు సేయుదురటే…. ఇందులో అర్ధం కానిదేమయినా వుందా? అర్ధం కాని వారికి తెలుగు రాక పోవటమే కాదు హృదయం కూడా లేదని వెర చెప్ప నేల?

నదిలా మారిన భార్యను చూస్తూ,

వెన్నెలవలె తెల్లని నీ/ సన్నని మేని పసందులు/ కన్నులకు కనిపించెను/ చిన్న తరగ చాలు వోలె,

నీ యొయ్యారపు నడకలు/ మాయురే! కనిపించెను పో/ మలకలుగా ప్రవహించిన సెలయేటి భవన్మూర్తిని..

నీనవ్వులు నురుగులుగా/ నీ వళులవి తరగలుగా/ నీ కన్నులు మీనులుగా/ నీ సరణిని ప్రవించెదు…

నీ జఘనము నిసుక తిన్నె/ గాజూచిన నా కన్నులు/ ఊడిపడవు నేల పైన/ నురిసిపోవు లోనె లోనె…

అంటాడు విలపిస్తూ.

ఇందులో అర్ధం కానిదేముంది?

వళులు అంటే బట్టకుచ్చు. ఇది ఇప్పుడు అంతగా వాడుకలో లేదు. ఇలా అర్ధం కానివి రాయొద్దనటం వల్ల అనేక పదాలు అదృష్యమయ్యాయి.

ఇక, కిన్నెరసాని నదిగా మారినప్పుడు నాథుని వర్ణన, వేదన చూడండి.

పరుగెత్తెడు నీ వేణీ/ బంధము పూనితి చేతను/ కరమున వేణికి బదులుగ/ కాళ్వగట్టె నీటి పొరలు…

అద్భుతం. పరుగెత్తుతున్న ఆమె జడ పట్టుకుంటే చేతిలో జడబదులు నీటి పొరలు కాలువయ్యాయట. జడ ఎలా ముడులు ముడులు వేసి వుంటుందో, నది నీరు అలా ప్రవహిస్తుంది. అందుకే స్త్రీ జడను వేణీ అంటారు. నదినీ వేణీ అంటారు. కవి ఊహ, సృజనాత్మక భావావేశం, ఔచిత్యం పాటిస్తూ అక్షరాలద్వారా దృష్యాన్ని సృజించే ప్రతిభాపాటవాలకిది తిరుగులేని నిదర్శనం.

ఇందులో కొరకరాని కొయ్య ఏముంది? అభ్యుదయ నిరోధక భావం ఏముంది? ప్రగతి నిరోధకమేముంది? ఎవరికయినా అవి కనిపిస్తే అవి వారిలో వున్నవే తప్ప విశ్వనాథవారిలో వున్నవి కావు.

ఎడమచేత నీకొంగును/ ఒడిచిపట్టుకుంటే చెలీ/ తడిచేతను కొంగు లేక/ తడబడితిని ప్రియురాలా! వివరణ అవసరమా?

నీవే యిట్లయితివిపో/ జీవములుందునే నామై/ నీవలె నేను ప్రవాహం/ బై వచ్చెద, రానీవే…

నిను కౌగిట నదిమిన నా/ తనువుపులకలణగలేదు/ కనువిప్పితినో లేదో/ నిను కానగలేనైతిని-

నీకై యేడిచి/ నా కంఠము సన్నవడియె/ నా కన్నులు మందగించె/ నా కాయము కొయ్యబారె…

ఈ యేడుపు రొదలోపల/ నా యొడలె నేనెరుగను/ నా యీ దేహమిదేమో/ రాయివోలె నగుచున్నది…

భర్తను విడచిన భార్య నది అయితే, భార్య దూరమయిన భర్త రాయి అయిపోయాడు. విచ్చిన్నమయిన వైవాహిక బంధం వ్యక్తుల మనస్సులపైన చూపే ప్రభావాన్ని ఇంతకన్న ప్రతిభావంతంగా ఎవరు చూపగలరు.

ఇది, కిన్నెర సానిలో తొలి అధ్యాయం మాత్రమే. మిగతా రేపు.

Enter Your Mail Address

January 6, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

No Responses

 1. మాలతీ మాధవం - January 6, 2009

  అద్భుతం!
  మీరు రాసినతీరు కూడా బాగుంది.

 2. కె.మహేష్ కుమార్ - January 6, 2009

  “అప్పుడు, మహిళలను రెచ్చగొట్టటం, అసంతృప్తులను ఎగదోయటం, తాళి తెంపి పారేసి బంధనాలను తెంచుకోమనటం ఫాషన్. అలా రాసివుంటే విశ్వనాథ వారికి సమాజామోదం లభించేది. పేరు ప్రఖ్యాతులు దక్కేవి.”….అలా రాసిన చలం కు దక్కిన నీరాజనాలెన్ని? నిరసనలెన్ని?

  సాహితీ సృజనకర్తలు తాము నమ్మింది రాస్తేనే కాలంప్రవాహంలో అది నిలబడుతుంది. ట్రెండునూ, ఫ్యాషన్నూ నమ్మితే కాదు. అది విశ్వనాధవారిలా రాసినా చలం లా రాసినా!

 3. Aruna - January 6, 2009

  Very Nice. Keep writing. I am waiting for your next post.

  Aruna Gosukonda

 4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి - January 8, 2009

  పైన మాలతీమాధవం ఎవరో నా ప్రొఫల్ కు ఎనేబులు చేసారు, వెంటనే తొలగించాలి అది.

Leave a Reply