విశ్వనాథ వారి కిన్నెరసాని-2

అక్షరాల కలయిక తో పదాలు ఏర్పడతాయి. ఒక కోణంలోంచి చూస్తే వొంటరిగా అక్షరాలు నిర్జీవాలు. కానీ, ఒకదానితో ఒకటి కలవటంవల్ల అక్షరాలు పదాలుగా మారి ప్రత్యేకార్ధాన్ని సంతరించుకుంటాయి. సజీవమవుతాయి. ఒక భావాన్ని కలిగిస్తాయి. కనులముందు ద్రుశ్యాలను నిలుపుతాయి. అయితే, ప్రతి పదానికి శక్తి వుంటుంది. ఆయా సందర్భాలాలో ఆయా ధ్వనులు కల శక్తి వంటమయిన పదాల వాడకంవల్ల కవి కనులముందు సజీవ దృశ్యాలను నిలుపుతాడు. వ్యక్తి ఊహాత్మక శక్తి రెక్కలిస్తాడు. తన సృజనాత్మక ఆవేశ స్థాయికి పాఠకుడిని పదాల బలంతో ఎదిగిస్తాడు.

అక్షరాల శక్తి తెలిసిన కవి మేధలో పదాలు సజీవం. అవే పదాలు ఇతరులు వాడితే ఆ పదాలే మామూలుగా అనిపిస్తాయి. అయితే, చాలా మందికి అక్షరాల శక్తి గురించిన వగాహనలేదు. కవి వాడిన పదాలను నిర్దాక్షిణ్యంగా మార్చేస్తారు. రచనను నిర్వీర్యం చేస్తారు.

అక్షరాల శక్తి తెలియాలంటే విశ్వనాథవారి రచనలలో సందర్భానుసారంగా ఆయన కవిత పోయిన పోకడలు గమనించాలి. పదాల చిందులను అర్ధంచేఉకోవాలి. పదాల ద్వారా సినిమాను మించిన చలన చిత్రాలను సజీవంగా కళ్ళముందు నిలిపే కవిత్వ సరస్వతీ శక్తిని అనుభవించాలి.

కిన్నెరసాని నదిగా మారిపోయింది. జీవితంలో కొన్ని నిర్ణయాలు క్షణికావేశంలో తీసుకుంటాము. వెంటనే పొరపాటు గ్రహించినా వెనక్కి తిరిగి తీసుకునే వీలుండదు. కిన్నెరసాని అలాంటి నిర్ణయం తీసుకుంది. భర్త మీద ఆమెకు ప్రేమవుంది. కానీ, ఒక బలహీన క్షణంలో, ఆవేశానికి లోనయి తొందరపాటు నిర్ణయం తీసుకుంది. భర్తను వదిలి నదిగా మాఇంది.

నది నీటి లక్షణం ప్రవహించటం. వడిగా, దూకుడుగా, సుళ్ళు తిరుగుతూ కదలిపోతుంది నది. అయితే, కిన్నెరసాని మామూలు నది కాదు. ఒక నదిగా మారిన వనిత. భర్త రాయి అయిపోయాడు. అతడిని వదలలేదు. కానీ వదలి కదలక తప్పదు. నదిలా నడవక తప్పదు.

ఈ సందర్భంలో విశ్వనాథవారి కవిత నదీనీటి కదలిక భంగిని కదలుతుంది. సాంప్రదాయికంగా కవులకు చందస్సు ఒక వీలును కల్పిస్తుంది. సందర్భానికి తగ్గ కవిత గమనాన్ని ఎంచుకుని, అక్షరాలను కూరిస్తే, కవితకు స్వాభావికంగా రచయిత ధ్వనింపచేయాలనుకుంటున్న భావాం కవిత గతి ధ్వనింపచేస్తుంది.

ఆ సాంప్రదాయిక పద్ధతిని ఆధునికీకరణం చేసి తన కవితను విశ్వనాథ వెలయించిన తీరు పరమాధ్భుతం. గమనించండి.

కిన్నెర నడకలను, కవిత గతి, పదాల కూర్పు కళ్ళముందుంచే కవి ప్రతిభాపాటవాల మాయా ప్రపంచాన్ని అనుభవించండి.

కరిగింది కరిగింది
కరిగింది కరిగింది

కరిగి కిన్నెరసాని వరదలై పారింది
తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది
పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది.

అందరికీ అర్ధమయ్యే మామూలు పదాలకు లయలో వొదగగానే ఎంత శక్తి వచ్చిందో చూడండి. ఎలా చదివినా నదీ గమనాన్ని స్ఫురింప చేస్తుందీ కవిత.

కదిలింది కదిలింది
కదిలింది కదిలింది

కదిలి కిన్నెరసాని వొదుగల్లు పోయింది
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది
ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది.

ఇక్కడ కవి సుదతి ఎందుకు వాడాడు? మహిళ అని అందరికీ అర్ధమయ్యేపదం వాడచ్చుకదా? అని అక్షేపించవచ్చు. ఇందువల్ల అర్ధం మారదు. గతి మారదు. కానీ సుళ్ళుగా కు సుదతికి సంబంధంవుంది. బుద్ధి గ్రహించలేని ఈ సంబంధం మనస్సు గ్రహిస్తుంది. స్పందిస్తుంది. ఇదే కవితను సుదతి బదులు మహిళ అని చదవండి. అక్షరాల శక్తి అర్ధమవుతుంది. ప్రతి పదం తనకే ప్రత్యేకమయిన జీవ లXఅణాన్ని కలిగి వుండటం బోధపడుతుంది.

కదలగా కదలగా
కాంత కిన్నెరసాని

పదుపుకట్టిన లేళ్ళకదుపులా తోచింది.
కదలు తెల్లని పూలనదివోలె కదలింది
వదలు తెల్లని త్రాచు పడగలా విరిసింది.

ఇక్కడ గతి తేడా గమనించండి. ఆరంభంలోని సంశయాలిప్పుడు కిన్నెరలో లేవు. నది తానని గ్రహించింది. కదలికలో వేగం వచ్చింది. ఒక ease వచ్చింది. కవిత దాన్ని ప్రతిబింబిస్తోంది. పదాలు ఆ భావాన్ని పూయిస్తున్నాయి. కదలు కిన్నెరసానిని కళ్ళముందు నిలుపుతున్నాయి.

ఇక్కడే కవి ప్రతిభ తెలుస్తుంది. నదీగతికి బండరాయి అడ్డొస్తే దాని చూట్టూ తిరిగి సుళ్ళుగా ప్రవహిస్తుంది. ఈ లక్షణాన్ని కథకు అన్వయించి, ఊహను నిజంగా అనుకునే రీతిలో కవి చూపటం తెలుస్తుంది.

కథ ఒక ఊహ. కానీ ఆ ఊహను నిజానికి దగ్గరావుంచి చెప్పటంవల్ల ఊహలో కల్పన మరుగునపడి కల్పన నిజమయి నిలుస్తుంది.

కిన్నెరసాని నది అయితే ఆమె భర్త రాయి అయ్యాడు. భర్తను వదలి వెళ్ళాలని లేదు. కానీ వెళ్ళక తప్పదు. దాంతో రాయి అయిన భర్త చుట్టూ తిరిగి తిరిగి వదలలేక వదలలేక వదలి కదలింది కిన్నెరసాని. నీటి లక్షణాన్ని, మహిళా మనస్త్వానికి అన్వయించి, సృజనాత్మకత రంగరించి కవి సాహిత్య ప్రపంచంలో పూయించిన పరిమళ భరితమైన పూవును మనసుతో చూడండి.

పతి రాయివలె మారి
పడియున్న చోటునే

పడతి కిన్నెరసాని విడలేక తిరిగింది
ముగుద కిన్నెరసాని వగచెంది తిరిగింది
వెలది కిన్నెరసాని గలగలా తిరిగింది

ఏదీ కఠిన పదం? ఏదీ కఠిన భావం? ఏదీ వెనుకబడినతనం? ఎందుకని విశ్వనాథ అంటే అంత ద్వేశం?

ఒక ఉత్తమ సాంప్రదాయాన్ని పనికి రాదనేబదులు, పూర్వీకులందించిన ఆస్తిని పదింతలు చేసి నూతన అంతస్థులు జోడించాలన్న ఔన్నత్యాన్ని ఆచరించి చూపుతున్నందుకా?

తామీ భావనా ఔన్నత్యాన్ని అందుకోలేమని గ్రహించి, ఆ ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించేబదులు, పైనున్నవాడిని క్రిందకులాగి, బురదచల్లి వాడిని దిగజార్చామని సంతృప్తిపడే నీచ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది వీరి ప్రవర్తన.

తుదకేమి చేయగా
నెదవోక అలవోక

పతిరాయిగా మారి పడియున్న గుట్టపై
అతివ తన కెరటాల హస్తాలతో చుట్టి
వెతపొంది వెతపొంది బిట్టు ఘోషించింది

తాను నదిగా మారింది కాబట్టి భర్తనూ నదిలా మారి రమ్మని ప్రార్ధించింది. ఇద్దరం కలసి కెరటాలు కెరటాలు కౌగలిద్దామురా అని రమ్మంది.

ఆతరువాత ఏమి జరిగిందో రేపు.

Enter Your Mail Address

January 7, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

Leave a Reply