స్లం డాగ్ మిలియనీర్-ఒక విశ్లేషణ!

నేను స్లం డాగ్ మిలయనీర్ సినిమాను చూసే ఇది రాస్తున్నాను. ఎవరో చెప్తే విన్నదీ, వారీ వీరీ అభిప్రాయాలను ఆధారం చేసుకొన్నదీ కాదు. ఇది నా స్వంత అభిప్రాయం.

ముందుగా ఒక మాట. మామూలు పరిస్థితులలో మనవాళ్ళేకాదు, విదేశీయులు తీసినా ఈ సినిమాను నేనయితే చూసేవాడిని కాను.

భద్రం కొడుకోతో సహా, ఇంకా, ఇలాంటి అనేక పేదరికాన్ని ప్రతిబింబించే సమాంతర సినిమాలను చూసిన తరువాత ఇలాంటి సినిమాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను.

ఈ సినిమాకు అవార్డులు వచ్చి (విదేశాలలో), ఆస్కార్ కు నామినేట్ కాకపోతే ఈ సినిమా టీవీలో ఫ్రీగా కూడా చూసేవాడిని కాదు. కాబట్టి విదేశీయుడు తీశాడా, మన వాళ్ళు తీసారా అన్నది ఇక్కడ ప్రధానంగా ఈ సినిమాకు ఆకర్షణ కాదు. ఈ సినిమా ఆకర్షణ దానికి విదేశాల్లో గుర్తింపు లభించటం!

ఇన్నిన్ని అవార్డులు వచ్చి, ఆస్కార్ కు నామినేషన్లు లభించటంతో అంతగా వారిని ఆకర్శించిన విషయం ఏమిటోనన్న కుతూహలం ఈ సినిమా చూసేట్టు చేసింది.

సాధారణంగా విదేశాల్లో అవార్డులు కొట్టే సినిమాలలో పేదరికాన్ని చూపేవే అధికం. అమర్ అక్బర్ ఆంథోనీకో, దిల్వాలే దుళన్ లేజాయేంగే కో అవార్డులు రావు.

దో భీగా జమీన్, పథేర్ పాంచాలి ఇలా మనకు అవార్డు సినిమాలంటే పేదరికాన్నయినా చూపాలి. లేకపోతే, తెరపై బొమ్మ కదలక మనల్ని సేట్లోంచి కదిలించి బయటకు తరమాలి. అందుకే అవార్డు సినిమాలపైన అన్ని జోకులు.

అందుకే, పేదరికానికి అవార్డు రావటమూ కొత్త కాదు, తెరపైన పేదరికాన్ని చూడటమూ కొత్తకాదు. అందుకే, ఈ సినిమా ఎలాంటి ప్రత్యేకంగా అనిపించదు.

ఒకరకంగా చూస్తే, ఇంతకన్నా దుర్భర దారిద్ర్యాన్ని, కంట నీరు పొంగించి, కడుపు తిప్పేటంత దారిద్ర్యాన్ని మనం మన సినిమాల్లో చూశాము.

సిటీ ఆఫ్ జాయ్ లో కూడా దరిద్రాన్ని చూశాము. అయితే, మనల్ని విదేశాలనుంచి వచ్చినవాడే ఉద్ధరిస్తాడని చూపుతాడా సినిమాలో. అయితే, ఆ సినిమా స్క్రిప్టు పకడ్బందీగా వుండి, కెమేరాపనితనం, నటనలు గొప్పగావుండటం, ముఖ్యంగా కథలో బలం వుండటం ఆ సినిమాను, పేదరికాన్ని చూపే సినిమానే అయినా, అంతగా బాధ కలిగించదు. ఎందుకంటే, ఆ సినిమాలో పేదరిక ప్రదర్శనలో కెమేరా ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుండదు. పేదరికాన్ని అందంగా చూపించే ప్రయత్నాలు కనబడవు. కెమేరా కోణాలలో, తెరపైన కనిపించే దృష్యాల రంగులు, లైటింగులలో, పేదరికంలోని వేదనను, బాధను ప్రేక్షకుడికి చేరువ చేసి మనస్సాక్షిని తట్టి లేపాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. అందుకే, సిటీ ఆఫ్ జాయ్, ఒక విదేసీయుడు రాసిన కథ అయినా, తీసిన సినిమా అయినా, విదేశీయుడు ప్రధాన పాత్ర పోషించినా సినిమా పరంగా ఒక ద్రుశ్య కావ్యంగా మిగులుతుంది.

ఇదేమాట, స్లం డాగ్ మిలియనీర్ గురించి అనలేము.

ముందుగా, సినిమా కథలో లోపాలున్నాయి. ఇది, నవలపైన వ్యాఖ్య కాదు. ఎందుకంటే, సినిమా నవలను అనుసరించదు.

సినిమా నాయకుడిని, పోలీసులు హింసించటంతో కథ ఆరంభమవుతుంది. వాళ్ళు ఎందుకు హింసిస్తారంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంలో ఆ పేద పిల్లవాడు మోసం చేశాడని కార్యక్రమ నిర్వాహకులు అనుమానిస్తారు. అందుకని.

ఇది ఏరకంగానూ లాజిక్ కు నిలవదు.

ఒకవేళ నిర్వాహకులే అనుమానిస్తే, ఆ విషయాన్ని బట్టబయలు చేయరు. దానివల్ల వారి కార్యక్రమమే దెబ్బ తింటుంది. వారి credibility అనుమానాస్పదమవుతుంది. టీఆఋపీ రేటింగులకోసం ఆ పని చేశారనుకుంటే, సినిమాలో ఆకోణం చూపరు. కేవలం, ఒక మురికివాడల పిల్లవాడికి అంత తెలివి వున్నదని ధనవంతులు నమ్మరని చూపాలన్నది దర్శకుడి వుద్దేశ్యం. అందుకోసం వారు ఎంచుకున్న మలుపు సినిమాలో పొసగలేదు. దాంతో సినిమా కథ బలహీనమయిపోయింది.

ప్యాసా సినిమాలో ఒక సన్నివేశముంది. హీరో పేదవాడు. రహెమాన్ పాత్ర అతడి రచనలను ప్రచురిస్తానంటాడు. కానీ రహెమాన్ కు కవితలకన్నా, హీరోను అవమానించటం పైనే ద్రుష్టి వింటుంది. ఒక పేదవాడి మనో భావాలతో ధనవంతులెలా ఆడుకుంటారన్నది, ఆ సీను చూపినంత ప్రతిభావంతంగా చూపిన సనివేశాలు తక్కువ.

అనాడి అని రాజ్ కపూర్ సినిమా వుంది. దాన్లో ధనికుడయిన మోతీలాల్ మోసాన్ని పేదవాడయిన రాజ్ కపూర్ అర్ధం చేఉకుని నిరసిస్తాడు. గొప్ప సీనది.

అలాగే, శ్రీ420 లో అందరూ డబ్బు వెంట పడుతూంటే అసహ్యించుకుని రాజ్ కపూర్ పాత్ర డబ్బుని వెదజల్లి మనుషుల డబాశను పరిహాసం చేతుంది. ఇదెంత గొప్ప సీనంటే దీన్ని మక్కీగా  its a mad mad mad world సినిమా పతాక ంసన్నివేశంలో కాపీ కొట్టారు.

ఈ మూడు ఉదహరించిన ద్రుష్యాలలో పేదరికం బాహ్యంగా కనబడదు. కానీ, పేదరికంతో ఆడుకునే ధనికుల మనస్తత్వాలు, పేదల మనస్సులలో దాగిన అగ్నిజ్వాలలు, నిరసనలు తెలుస్తాయి.

నిజాయితీగా తాను సమాధానాలిస్తున్నా, తనని అనుమానించిన వారిని మన స్లం హీరో ఏమీ అనడు. అసలా ప్రసక్తే తేడు. ఏమీ జరగనట్టు పోలీసు స్టేషన్ నుంచి, స్టుడియో కెళతాడు. సమాధానమిచ్చి గెలుస్తాడు. నాయికతో సంతోశంగా వుంటాడు. హీరోలో నిరసన, క్రోధం, గెలిచానన్న కసి ఏమీ కనబడవు. అంటే , ఈ సినిమా తీసిన వారికి పేద పిల్లవాడి మనసుతో సంబంధం లేదు. మురికివాడలను అంత దగ్గరగా, సహజంగా చూపినవారు, పిల్లవాడి మనస్తత్వాన్ని అంతే లాజికల్ గా ఎందుకు చూపలేదు. ఇది స్క్రిప్టు లోపమా? దర్శకుడి ద్రుష్టి దోషమా?

ఇందులోని, అనేక సన్నివేశాలలో క్రమం లేదు. అవి logical conclusion కు చేరటమన్నది లేదు. rounding off of scene అన్నది స్క్రిప్టు రచయితకూ, దర్శకుడికీ తెలిసినట్టు లేదు.ఏ ఒక్క సన్నివేశంలోనూ తీవ్రత లేదు. పిల్లలు తాజ్ మహల్ లో వ్యాపారం చేసిన సంఘటనలు, దొంగల గుడారంలో సంఘటనలు, ఎంతో క్రుతకంగా వున్నాయి. ఒక సీగ్రడు తెలుగు సినిమాలో దీని కన్న ఎక్కువ పట్టు వుంటుంది. అలాగే, ఇద్దరు హీరోలు, పేదరికంలోంచి ఒకడు దొంగగా, ఇంకొకడు మంచివాడిగా ఎదగటం మన ఫక్తు ఫార్మూలా సినిమా కథ. ఈ కథ ఆధారంగా మనవారు గొప్ప సినిమాలు బోలెడు తీశారు. అవి చూసిన తరువాత ఈ సినిమాలో మనకు కొత్త దనమెలాగో వుండదు, వాటి ముందు ఇది, తప్పటడుగులు నేరుస్తున్న పిల్లవాడి ప్రయత్నంలా వుంది.

ఇక, దొంగ దగ్గర వున్న నాయిక దగ్గరకు, హీరో వెళ్ళిన సన్నివేశం, ఆమె తప్పించుకున్న వైనం, చివరికి ఇద్దరూ కలవటం లాంటివన్నీ చూస్తూంటే మన పాత సినిమాలలో హీరో డిల్లీలో వుండి పాడితే జెర్మనీలోవున్న హీరోయిన్ విని పరుగెత్తుకు వచ్చిన సంఘటనలే వీటికన్నా నమ్మేఅట్టున్నాయనిపితుంది.

ఈ సినిమా కథను చెప్పేందుకు స్క్రిప్టు రచయిత ఎంచుకున్న విధానమూ లోప భూయిష్టమే. ఇలాంటి కథకు అలాంటి కథన పద్ధతి సరిపోదు.

ఫారెస్ట్ గంప్ అని ఒక సినిమా వుంది. ఇదే కథన పద్ధతి అది. ఈ పద్ధతిలో  emotional drama లు బాగా పండుతాయి. సస్పెన్స్ కథలలో ఒక్కొక్క నిజాన్ని కొంచెం కొంచెం చూపుతూ ఉత్సుకత పెంచుతూ ప్రేక్షకుడిని తప్పుదారి పట్టించి, చివరికి అసలునిజాన్ని వెల్లడి చేసి ఆశ్చర్య పరచటానికి ఈ పద్ధతి పనికోస్తుంది.

అయితే ఈ సినిమాలో ఎమోషనలూ లేక సస్పెన్సూ లేక సినిమా విసుగొస్తుంది. ఎందుకంటే, ఈ పద్ధతివల్ల ప్రేక్షకుడు ఏ పాత్రతోనూ తాదాత్మ్యం చెందలేకపోతాడు. identify చేసుకోలేకపోతాడు. అది జరగాలంటే, కథ, నటులు, కథనం ఫారెస్ట్ గంప్ అంత గొప్పగా వుండాలి. డిజావూ అంత సంక్లిష్టంగా నయినా వుండాలి. 13 ఫ్లోరంత తిక మకగానయినా వుండాలి. అవేవీ లేక పోవటంతో సినిమా బోరొస్తుంది.

పాత్రల వ్యక్తిత్వ చిత్రీకరణ, మనస్తత్వ పరిశీలన పయిన శ్రద్ధ పెట్టక పోవటం, కేవలం పేద రికం నిజానికి దగ్గరగా వుండి మిగతా విషయాలు మనకలవాటయిన రీతిలో వుండటంతో ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చినా మన దృష్టిలో ఇదొక మామూలు, అలవాటయిన అర్ధంలేని అవార్డు సినిమాగా మిగులుతుంది.

గమనిస్తే, ఈ సినిమాలో అందంగా కనిపించిన దృష్యాలేవయినా వుంటే అవి మురికివాడలవే. ఆ దృష్యాలను, స్పష్టమయిన కాంతిలో, పంచ రంగులలో చూపటంవల్ల, అవి చూస్తూ కెమేరా ఆనందాన్ని అనుభవిస్తున్న భావన కలుగుతుంది. సాధారణంగా, విషాలమయిన సముద్రాన్ని, ఇతర ప్రకృతి దృష్యాలనూ చూపేటప్పుడిలాంటి రంగులను, కెమేరా కోణాలనూ వాడతారు. అందుకే  voyeuristic అన్నారు కొందరు.

ఇంకా గమనిస్తే, దుర్భరమయిన దార్ద్ర్యాన్ని చూపే సన్నివేశాలీ సినిమాలో లేవు. వొళ్ళు ముడుచుకుని, కళ్ళల్లో ఒక్క రూపాయికి ఆశతో అడుక్కునే ముసలైవారీ సినిమాలో లేరు. తిండి కోసం చెత్త కుండీల దగ్గర కాట్ల కుక్కలలా తమలో తాము, తమతో పోటీ పడే పందులతో పోరాడే పేదలు లేరు. అలాంటి హృదయ విదారకమయిన దృష్యాలేవీ ఈ సినిమాలో లేవు.

మురికివాడల్లో వుంటూ, మేకప్పు వేసుకున్న నాయకుడి తల్లిని హిందూ మత తత్వ శక్తులు చంపటం, పిల్లలు హాయిగా పరుగెత్తి తప్పించుకోవటం, ఇద్దరు ముస్లిం పిల్లలు, హిందూ బాలికపయిన జాలిపడి మానవత్వం చూపటం, ఇవన్నీ మనకలవాటే.

ఇలాంటి  clitched సీనుల  clitched  సినిమాలు, మనకేకాదు, వారికీ అలవాటే. మామూలుగా అయితే, ఇలాంటి లోపభూయిష్టమయిన అర్ధంలేని అసంబద్ధ సినిమాను వారు అవార్డుకు పరిగణించేవారేకారు. మన మదర్ ఇండియా, లగాన్ లే వారికి పనికి రాలేదు. మరి ఇది ఎందుకు అంత వారికి అంత గొప్పగా అనిపిస్తోందో వేరే చెప్పాల్సిన అవసరం లేదుకద!

Enter Your Mail Address

February 5, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

No Responses

 1. కె.మహేష్ కుమార్ - February 5, 2009

  సినిమా తీసింది నచ్చిన స్కిప్ట్ పట్టుకుని, భారత దేశంలోని పెదరికాన్ని చూపించడానికి కాదు. మీ కోరికలు అసంబద్ధంగా ఉన్నాయి. మీ ఆరోపణలు amateurish గా ఉన్నాయి.

 2. Pradeep - February 5, 2009

  ఏదైనా ఒక సినిమా చూసేప్పుడు మనను ఆ కధలో లీనమయ్యేలా చెయ్యడంలోనే సినిమా గొప్పదనం కనిపించేది. ఈ సినిమా చూసాక నాకు ఒక బి గ్రేడు బాలీవుడు సినిమా చూసిన అనుభూతి మాత్రమే కలిగింది. ఇక మీరు ఫారెష్టుగంపు లాంటి మేరువుతో పోలిస్తే ఇది డి గ్రేడు స్థాయికి పడిపోతుంది.
  అందరూ పరిగెడ్తున్నారని పరెగెట్టడం. అందరూ పొగుడుతున్నారని మనమూ పొగడడం మనకలవాటయిపోయాయి.

 3. బాబు - February 5, 2009

  నవతరంగం లో “సినిమాలు ఎందుకు మూస దాటవు?” అన్న వ్యాసం రాసింది మీరేనా? అయితే గనక, నా విచారాన్ని వెలిబుచ్చుతున్నాను.

 4. అబ్రకదబ్ర - February 5, 2009

  అనిల్ కపూర్ పాత్రకి జమాల్ లాంటి పేద వాళ్లంటే ఎంత చిన్నచూపో క్విజ్ షోలో అనేక సందర్భాల్లో బయటపడుతుంది. అతను జమాల్‌ని పోలీసులకప్పగించటానికీ కారణం అదే. Who Wants to be a Millionaire షో కోసం GATE స్థాయిలో తయారయ్యే యువత గురించిన ప్రస్తావన కూడా ఉంది. మేధావుల కోసం ఉద్దేశించిన తన కార్యక్రమాన్ని ఒక మురికివాడ నుండొచ్చిన కుర్రవాడు కేవలం అదృష్టంతో గెలవటం అనిల్ కపూర్ జీర్ణించుకోలేని విషయం. అదీ అతనే స్వయంగా వెల్లడిస్తాడు. అంత స్పష్టంగా ఉన్నా మీరు అందులో లాజిక్ లేదనటం వింతగా ఉంది. ‘అయినా సరే, అలా పోలీసులకప్పగిస్తారా ఎవరైనా’ అని మీరడిగితే, ‘అప్పుడే కదా డ్రామా మొదలయేది’ అనేది నా సమాధానం. ఆ సన్నివేశంలో మీరో నేనో ఉంటే ఎలా ప్రవర్తిస్తామనేది వేరే ప్రశ్న. నాకు మాత్రం అనిల్ కపూర్ పాత్ర తన సహజ ధోరణిలోనే ప్రవర్తించినట్లనిపించింది.

 5. చిలకపాటి శ్రీనివాస్ - February 5, 2009

  మీ అభిరుచుల్ని ప్రశ్నించలేను గానీ “సాధారణంగా విదేశాల్లో అవార్డులు కొట్టే సినిమాలలో పేదరికాన్ని చూపేవే అధికం.” అనే వాక్యంతో విభేదించక తప్పదు. ఎక్కడి అవార్డుల గురించి చెప్తున్నారు మీరు?

  ఫారెస్ట్ గంప్ కథన పద్ధతి ఇది కాదు.

  ఇదేమీ గొప్ప సినిమా అనను కానీ నాకయితే చాలా బాగుంది. పేదరికం మీద జాలి కలిగించడం కంటే మురికివాడలో పుట్టీ బతకడం కోసం, ప్రేమ నిలబెట్టుకోవడం కోశం ప్రధాన పాత్ర తపనా, పట్టుదలా కనిపించేలా తీసిన ప్రయత్నం అని అనిపించలేదా మీకు?

 6. Marthanda - February 5, 2009

  మా వీధిలో ఎక్కువ మంది బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళకి దళితుల పైన, మురికివాడ వాసుల పైన ఎంత నెగటివ్ అభిప్రాయం ఉందో నాకు తెలుసు. మా వీధి వాళ్ళ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బున్న సినిమా నిర్మాతలకి మురికివాడ వాసుల్ని కించపరిచే తత్వం లేదంటే నేను నమ్మను.

 7. Suresh - February 6, 2009

  ఈందీన్ చిత్రలకు ఓస్కర్ నమిఎ కి వెల్లతం ఇది ఒక అరంభం. ంఅన ఈందీన్ ఫిల్మ్ మకెర్స్ కూద ఈవిషయం అర్ద్థం చెసుకుని, త్వరలొ ఇంతకంతె మంచి చినెలను ప్రపంచనికి అందజెస్థరని అసిథం. ఈది నా అభిప్రయం.

 8. Marthanda - February 6, 2009

  నేను ఆ సినిమా చూడలేదు కానీ ఆ సినిమా టైటిల్ కూడా వికారంగా ఉంది. కథ గురించి నేనేమీ చెప్పలేను కానీ టైటిల్ లో డీసెన్సీ ఉండాలన్న జ్ఞానం సినిమా తీసిన వాళ్ళకి లేదా? ఇలాంటి వికృతమైన టైటిల్ వాళ్ళు తెలియక పెట్టారంటే నేను నమ్మను. డీసెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ గురించి ఏడేళ్ళ పిల్లలకి చెప్పినా అర్థమవుతుంది. ఇంత వయసు పెరిగిన వాళ్ళకి లాంగ్వేజ్ డీసెన్సీ తెలియకపోవడం విచిత్రంగా ఉంది.

Leave a Reply