నా తల్లో జేజమ్మ వదిలింది!

నిన్న హాయిగా ఇంట్లో కూచుని పుస్తకాలు చదువుకుంటున్న నన్ను నా మిత్రాధముదు చలో సినిమాకి అని లాక్కుపోయాడు. అరుంధతి అనే సినిమా హాలులో కూచోబెట్టాడు.

ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా వినివుండటంవల్ల, చదివి వుండటం వల్ల, సినిమా సూపెర్ హిట్ అయివుండటం వల్ల నేనుకూడా సరే పద అన్నాను.

సినిమా చూశాను.

మొదటి దృశ్యం చూస్తూంటేనే, ఇలాంటి సినిమాలు బోలెడన్ని చూశామన్న భావన కలిగింది. సినిమా కొనసాగుతూంటే అది బలపడింది.

విశ్రాంతి సమయంలో వెళ్ళిపోదాం, అన్నాడు నా మితృడు. కానీ, డబ్బులు పెట్టినందుకు పూర్తిగా చూడాలి, అని వాడికో అయిస్ క్రీం కొనిచ్చి, ఇద్దరమూ, తెరపై రక్తపాతాలూ, పగలూ, ప్రతీకారాలూ, మాయలూ, మంత్రాలూ, నవ్వుతూ, జోకులేసుకుంటూ చూశాము.

సినిమా అయిన తరువాత, జేజమ్మా, జేజమ్మా, అనిపాడుకుంతూ బయటకు వచ్చాము. దెబ్బకు తలలో జేజమ్మ వదిలింది.

ఎక్సోర్సిస్ట్, ఓమెన్, పోల్టెర్గీస్ట్, నైట్ మేర్ ఆన్ ది ఎల్మ్ స్ట్రీట్, డ్రాకులా, మమ్మీ, ఇంకా, ఇలాంటి, అనకొండాలు, భయంకరమయిన జీవుల వాతపడే సినిమాలూ, ఈవిల్ డేడ్డులూ, వంటి సినిమాలు చూసీ, చూసీ విసిగి హారర్ సినిమాలు చూస్తూ నవ్వుకునే స్థితికి చేరుకున్నవారికి అరుంధతి, సీ గేడు సినిమా.

ఇలాంటి సినిమాలతో పెద్దగా పరిచయం లేని వారికి ఇదొక అధ్బుతమయిన సినిమా. మన తెలుగు తెరపైన, ఇలాంటి, సాంకేతిక అద్భుతాలు చూడటం ఆనందం కలిగించే విషయమే అయినా, కథ పరంగా, స్క్రిప్తు పరంగా, ఎడిటింగ్ పరంగా, ఇంకా అనేక ఇతర సాంకేతిక అంశాల పరంగా చూస్తే, అరుంధతి బిలో ఆవెరేజ్ సినిమాగా మిగులుతుంది.

సినిమాలోని అనేక సన్నివేశాలు మనకు గతంలో చూసిన, అలవాటయిన సన్నివేశాలను ఙ్నప్తికి తెస్తాయి.

ఆడ్రే రోస్ తో సహా గతంలోని వాంపయిర్,  హారర్, దయ్యాల సినిమాలన్నీ గుర్తుకు వస్తాయి.

నాణెం నుదుటిన వొత్తగానే సెగలూ, పొగలొచ్చి దయ్యం పారిపోవటంలాంటివి, శిలువ చూపగానే, నుదుటిన వొత్తగానే సైతాను పారిపోయే సన్నివేశాలను గుర్తుకు తెస్తుంది.

సజీవ సమాధిచేసి, వాడు చచ్చిపోతే, ఉలిక్కిపడి ఆశ్చర్యపడటం నవ్వుతెస్తుంది.

దేవుడి గదిలో వున్నా, దయ్యం తనపనులు చేసేసుకు పోవటం, ముగ్గును తొలగించేందుకు నీళ్ళను ఉపయోగించటం మంచి హాస్య సన్నివేశం. ఒక దశలో ఆ గదిలో టైటానిక్ ను ముంచేన్ని నీళ్ళున్నాయేమో ననిపించింది.

కార్లోంచి లోయలో పడ్డ ఫకీరు, చెట్టు ఈవిల్ డేడ్ లో లాగా ఇనుప సమాధిలో బంధిస్తే దాన్ని చేదించుకుని వచ్చి, నాయికకు ఆయుధాన్నివ్వటం లాంటి సన్నివేశాలు, గద్వాల్ దాటనివ్వనన్న దయ్యం, వికారాబాదు వరకూ నాయికను పోనివ్వటం, కొబ్బరికాయలు తలపైన మోదుతూంటే రక్తం ధారలా కారటం,  ఇలా ఒకటేమిటి, ప్రతి సన్నివేశం ఈ సినిమాను ఒక హాస్య చిత్రంగా తీర్చి దిద్దటంలో ఇతోధికంగా సహాయపడ్డాయి.

నిశ్చితార్ధం అయిన తరువాత, కాబోయే మొగుడు ఊరొస్తే, ఇంటికి రమ్మనే బదులు అర్ధరాత్రి పాడుపడిన కోటలోకి రమ్మనగానే వెళ్ళటం, ఫకీరు చెప్పేదాకా సెల్ ఫోను చేయాలని గుర్తుకు రాకపోవటం, ఎవరయినా కోటలోకి వెళ్తూంటే, ఉట్టిగా అడ్డుపడే ఓ దయ్యం (సస్పెన్స్ పెంచుతున్నమనుకుని, అపహాస్యం పాలు చేస్తుంది), ఇలాంటి అర్ధంపర్ధం లేని పాత్రలూ, సన్నివేశాలూ, ఈ సినిమా లోని హాస్యాన్ని మరింత పెంచుతాయి.

అఘోరీలవద్దనుంచి శక్తులు సంపాదించిన విలన్, కోటలోకి వచ్చి, చేయి విసిరి అందరినీ చంపేయటం చూస్తూంటే, రిటర్న్ ఆఫ్  ది డ్రాగన్ లో బ్రూస్లీ, చెక్కిన సన్నని ముక్కలను విసరటం గుర్తొచ్చి, నవ్విస్తుంది. వాడొచ్చి నానా హంగామా చేస్తూంటే, కత్తి పట్టుకున్న నాయిక కత్తిని పడేసి, వాడిముందుకు వెళ్ళి నిలబడటం అర్ధంలేనిది. నాయిక పైటను తీయించి నాట్యమాడించే వీలు కళాకారులకు కలిగింది.

విలన్ మాటి మాటికీ, నాయిక వాసన చూడటం కుక్కను గుర్తుకు తెస్తుంది. వాడి కేకలు, అరుపులు, ప్రతిగా నాయిక, రేయ్ అని అరుపులు, అబ్బబ్బ, చెవులు చిల్లుపడేశాయి. బహుషా, అప్పుడేనేమో నా తల్లో జేజమ్మ, కదలటం మొదలయివుంటుంది.

సినిమా మొదట్లో, నాయిక రేషనల్ వాదన చేసి, ఒక బంధువు దయ్యం వదలటం నుంచి కాపాడుతుంది. తరువాత వాడికి చికిత్స మాట తలపెట్టదు. ఇంటిలో సరిగా వుంచదు. మళ్ళీ చెట్టుకి కట్టేస్తుంది ఇంటి బయట. అలాగే, కొడుకు సమాధిలోంచి లేవటానికి ఎదురుచూసిన వాడి తల్లి ఆతరువాత ఏమయిందో మనకు తెలియదు. ఇలాంటి స్క్రిప్టు లోపాలు అనేకానేకాలు.

నాయిక కొన్ని సందర్భాలలో అందంగా కనబడుతుంది. ఆమెకు శాస్త్ర్ర్య నృత్యం రాదని తెలుస్తుంది సులభంగా. మిగతా వారంతా, అరుపులు, కేకలు, ఓవరాక్షన్లతో తల హోరెత్తిస్తారు.

సినిమాలో క్రౌర్యం, హింస హద్దులు దాటింది. ఒక అమ్మాయిని, కత్తితో వొళ్ళంతా గాయాలు చేసి, ఆమె ప్రాణాలు పోతూంటే, ఆమెను అనుభవించి, నీప్రాణాలు సుఖంగా పోతున్నాయని అనిపించటం, ఈ దృష్యాన్ని విపులంగా చూపటం అనవసరం. విలన్ క్రూరుడని చూపాలంటే, ఇలాంటివేవీ లెకుండా కూడా చూపవచ్చు. కానీ, ప్రజలు పెద్ద ఎత్తున సినిమాను ఆదరించటంతో లోపాలన్నీ హుష్ కాకీ అవుతాయి. లోపాలు వెతికేవాడు రంధ్రాన్వేషి అవుతాడు.

అయితే, ప్రజలు ఈ సినిమాను ఇంతగా ఆదరించటం, ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. మన ప్రేక్షకులు, కాస్తయినా నాణ్యమయిన సినిమాకోసం మొహం వాచి వున్నారు. ఏమాత్రం కొత్తదనం కనబడినా, భిన్నంగా వున్నా, ఆదరించి, మూస సినిమాలపట్ల వ్యతిరేకతను తెలుపుతున్నారు. ఇది గమనించి కళాకారులు ప్రేక్షకులివే చూస్తారని కాక, తమ మనసుకు నచ్చిన సినిమాలు నాణ్యంగా తీస్తూ ఉన్నత ప్రామాణికాలేర్పరచాలి.

ఇక్కడే మరో విషయాన్ని గమనించాలి. మన స్థాయిలో సీ గ్రడు సినిమా స్థాయిలో వున్న స్లం డాగ్ మిలియనీర్ వాళ్ళకు అద్భుతంగా అనిపిస్తోంది. అవార్డుల వర్షాలు కురుస్తున్నాయి.

వారి స్థాయితో పోలిస్తే, సీ గ్రేడు స్థాయి సినిమా అయిన అరుంధతి, మన దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఇతర కళాకారులకు ఆదర్శమవుతోంది.

సినిమాలో అరుపులు కేకలతో నా తలలో జేజమ్మ పూర్తిగా వదలిపోయింది. ఇప్పుడర్ధమయివుంటుంది మీకు, బ్రహ్మబుధ్ ని ఈ సినిమావైపుకు కూడా నేనెందుకు పోనీయటంలేదో!

Enter Your Mail Address

February 15, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సినెమా రివ్యూ

No Responses

 1. Malakpet Rowdy - February 16, 2009

  హ హ హా .. అయితే సూపర్ కామెడీ హారర్ చిత్రమంటారు!

 2. రాఘవ - February 16, 2009

  నన్ను ఈ సినిమా ఈ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టించలేకపోయింది. మీరన్నట్టుగానే ఒక్కోచోట ఒక్కోటి గుర్తొస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా చెత్త సినిమాలకంటే ఇది చాలా నయం.

 3. అభిమాని - February 16, 2009

  తప్పొప్పుల పట్టిక

  తప్పు – ఒప్పు

  పాడుకుంతూ – పాడుకుంటూ
  సీ గేడు – సీ గ్రేడు
  స్క్రిప్తు – స్క్రిప్టు
  బహుషా – బహుశా
  సీ గ్రడు- సీ గ్రేడు
  శాస్త్ర్ర్య – శాస్త్రీయ

  ఇన్ని తప్పులతో వ్రాస్తే మీ టపా సీ గ్రేడు టపా కాక మరేం అవుతుంది?

 4. అభిమానికి అభిమాని - February 16, 2009

  తప్పొప్పుల పట్టిక

  మిత్రాధముదు – మిత్రాధముడు
  సూపెర్ – సూపర్
  గ్రడు – గ్రేడు

  ఇంకా ఉన్నాయ్ :-(

 5. Sarojini - February 17, 2009

  Though I have not seen the movie I felt like watching a comedy movie by reading your blog. keep it up. I like your C Grade Tapa.

 6. శ్రీ - March 6, 2009

  బాగా చెప్పారు. నాకు కూడా చాలా మందికి లాగే ఈ సినిమా కామెడీగా అనిపించింది. సినిమాలో జేజమ్మ పాట వస్తూ ఉంటే ఒకటే నవ్వులు. నేను కూడా పాట సరదాగ ఉందని రింగ్ టోనుగా పెట్టుకున్నాను.

  అరుపులు, కేకలు తప్పితే సినిమాలో ఏమీ లేదు. సరిగ్గా కాపీ కూడా కొట్టలేరా ? అనిపించింది.

Leave a Reply