ఎవ్వరో, ఎందుకీరీతి సాధింతురో!

నవగ్రహ పూజా మహిమ అని ఒక పాత సినిమావుంది. దానిలో ఒక చక్కటి పాటవుంది. బాణీ, హిందీలో ఓపీ నయ్యర్ సంగీత్ దర్శకత్వం వహించిన ఫిర్ వహీ దిల్ లాయాహూ అనే సినిమాలోని, నాదినీ బడ రంగీహై వాదా తెరా అనేపాట బాణీ.

తెలుగులో ఈ పాట, ఎవ్వరో, ఎందుకీరీతి సాధింతురో, ఎవ్వరో ఏల పగబూని బాధింతురో, కాదు తలవ్రాతయో, దేవతలకోపమో, కాదు ఇది మానవుని మోసమో!, అనేపాట అది.

ఈమధ్య మన తెలుగు బ్లాగులు చూస్తూంటే ఈపాట బాగా గుర్తుకువస్తోంది. ఎందుకో తెలియదు కానీ, బ్లాగుల్లో రాతలు మారిపోయాయి. రాతల ధోరణి మారిపోయింది. అలాగే, వ్యాఖ్యలు మారిపోయాయి. వ్యాఖ్యల తీరు మారింది.

ఇలాంటి సమయంలో, బ్లాగు రాయటం ఒక ఎత్తయితే, వ్యాఖ్యలను manage చేయటం ఒక ఎత్తు.

వ్యాఖ్యల విషయంలో ఎలా వ్యవహరించాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కొందరు బ్లాగుల్లో చెప్పారు. వ్యాఖ్యలను నచ్చకపోతే ఆమోదించవద్దని చెప్పారు. ఇంకొందరయితే, వ్యాఖ్యలపైనే నిషేధం విధించారు.

నామటుకు నాకు ఇలా చేయటం నచ్చటంలేదు. మనం, ఒక వ్యాఖ్యను తొలగించినా, వ్యాఖ్యలనే నిషేధించినా, ఆ వ్యాఖ్యాతల విజయాన్ని సూచిస్తుందది. ఎందుకంటే, వ్యాఖ్యలు రాసే వ్యక్తి ఉద్దేశ్యం ఆ వ్యాఖ్యలవల్ల మనకు తెలుస్తోంది. మనల్ని బాధ పెట్టాలనో, చులకన చేయాలనో అలాంటి వ్యాఖ్యలు రాస్తారు. ఆ వ్యాఖ్యలను నిషేధించటం, తొలగించటం వల్ల మనము వారి వ్యాఖ్యలకు స్పందించినట్టు అవుతుంది. వాటి ప్రభావాన్ని ఆమోదించినట్టవుతుంది.

అలాకాక, వ్యాఖ్యలకు స్పందిస్తే, ఆ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. వాటికి లేని ప్రామాణికతను ఆపాదించినట్టవుతుంది.పైగా, అలాంటి వాటికి స్పందిస్తే మాటలు పెరుగుతాయి. వాదన పెరుగుతుంది. మనసులు బాధపడతాయి. కాబట్టి, అలాంటి వ్యాఖ్యలను ఆమోదించి వదిలేయాలి. వాటిని పట్టించుకోకూడదు.

వ్యాఖ్యను తొలగిస్తే, వ్యాఖ్య వేసినవారికి కోపం వస్తుంది. దాంతో తొలగించిన వ్యాఖ్య పదిమందికీ తెలియచేయాలన్న పట్టుదల పెరుగుతుంది. వ్యాఖ్య తొలగించిన వారిని బాధపెట్టాలన్న కసి కలుగుతుంది.  కాబట్టి, వ్యాఖ్యలను స్వీకరించి వదిలేయాలి. అందువల్ల వ్యాఖ్యానించిన వారికి అహంత్రుప్తి కలుగుతుంది.

ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఎదుటి వాడు మనల్ని వెధవ అన్నాడనుకుందాం. దానికి ప్రతిగా మనం, నువ్వే వెధవ అన్నా వాదన చెలరేగుతుంది. నేను వెధవను కానూ, అన్నా వాదన పెరుగుతుంది.

మనము ఏమిటో మనకు తెలుసు. మనం తెలిసిన వారికి తెలుసు. ఒకడు వెధవ అన్నంత మాత్రాన మనము వెధవలము కామనీ మనకు తెలుసు. మనము వెధవలము కామని మనము తెలిసిన వారికి నిరూపించాల్సిన అవసరము లేదనీ తెలుసు. అయినా, మనము వ్యాఖ్యకు స్పందించి, ఏదో నిరూపించాలని ప్రయత్నిస్తున్నామంటే, ఎక్కడో , మనసు మూలలో, మనము వెధవలమేమో అన్న అనుమానం వుందన్న మాట. అందుకే, ఎదుటి వాడు వెధవ అనగానే భుజాలు తడుముకుని స్పందిస్తున్నామన్నమాట.  ఇది మనపైన మన ఆత్మ విశ్వాస రాహిత్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే, మనమెవరో మనకు తెలుసు. మనవారికి తెలుసు. కాబట్టి అలాంటి వాటికి స్పందించకపోవటమే ఉత్తమం. ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోతుంది.

అలాంటి వ్యాఖ్యలను ఆమోదించటం వల్ల పదిమందికీ వారెలాంటి వారో తెలుస్తుంది. మనము ఏమీ చెప్పకున్నా నిజానిజాలు అందరూ గ్రహిస్తారు. గ్రహించనివారికి ఎంత చెప్పినా లాభంలేదు.

ఇలాంటి వాటికి స్పందించి,  వాదించటంవల్ల మనము బాధపడటమేకాక, మన స్నేహితులనుకూడా line of fire లోకి తెచ్చినవారిమి అవుతాము. వాదనకానీ, చర్చ కానీ సమవుజ్జీలనడుమ జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలవారితో వాదనకు దిగటమంటే వారి స్థాయికి మనము దిగటమే అన్నమాట.

చప్పట్లకు రెండుచేతులు కావాలి. మనమెందుకు రెండోచేయి ఇవ్వాలి?

మరొక విషయం, ఈ మధ్య బ్లాగుల్లో, కొందరు గొడవను సమసిపోనీయక వ్యంగ్య విసుర్లూ, హేళనలూ, వెక్కిరింతల రాతలు రాస్తున్నారు. అది వారి బ్లాగు వారి ఇష్టం.

వృధా చేసే సమయం వున్నవారిని వృధా చేసుకోనీయండి. మన సమయాన్ని మనకు నచ్చిన రీతిలో గడుపుదాము.

అయినా, బాధపడకుండా వుండలేమనిపిస్తే, నవగ్రహ పూజామహిమలో పాటను పాడుకోండి. అంతేకానీ బ్లాగటం మానకండి.

ద్వేషించేకూటమిలోనా నిలచీ, ప్రేమించే మనిషే కదా మనిషీ అంటారు. మనము మనుషులము. మనుషుల్లానేవుందాము!

Enter Your Mail Address

February 17, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

  1. చిలమకూరు విజయమోహన్ - February 17, 2009

    చాలా చక్కగా చెప్పారు

  2. aswinisri - February 18, 2009

    oh! I see!

  3. జ్యోతి - February 19, 2009

    మీరు చెప్పిన మంచిమాటకు మనఃపూర్వక ధన్యవాదాలు …

Leave a Reply