జాషువా ఖండకావ్యాలు-4

ఈ విశ్వంలో అత్యంత అద్భుతమయినది శిశు జననం. భౌతికంగా శిశు జననానికి కారణాలు తెలుసు. ఎలా శిశువు ఆవిర్భావం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ, ఎవరికీ తెలియనిదేమిటంటే, శిశువుకు చైతన్యం ఎలా వస్తుంది? ఏశక్తి, స్పెర్మ్, అండాల కలయికను పిండంగా మారుస్తుంది? ఏ శక్తి ఆ మాంసపుముద్దను సజీవ మానవుడిగా మలుస్తుంది?

ఇంతకీ మనిషి ఎక్కడినుంచి వస్తాడు? ఏమైపోతాడు మరణంతో? మరణం నుంచి మళ్ళీ జన్మవరకూ ఈ మనిషి ఏ అనంత లోకాలలో ఏరూపంలో వుంటాడు? ఆటగాడు మైదానం అంచులలో కూచుని తనవంతు ఆటకు పిలుపు వచ్చేవరకూ ఎదురుచూసినట్టు ఎక్కడ ఎదురుచూస్తాడీ మనిషి?

ఇలాంటి ప్రశ్నలు బోసినవ్వుల శిశువును చూసినప్పుడల్లా మనసులో మెదులుతాయి. అతడి చేష్టలకు మురుస్తాము. ముద్దులొలికే చేతలకు మైమరచిపోతాము. కానీ, తరచిచూస్తే, శిశువు పరమాద్భుతానికి ప్రతీక.

శిశువు తన బోటనవేల ముల్లోకాలని చూసి ఆనందపడతాడేమో అన్న ఆలోచన కవికి అందుకే వస్తుంది. జమించకముందు ఈ శిశువు ఎన్నెన్ని లోకాలు తిరిగాడో! ఏమేమి వింతలను చూశాడో! ఇప్పుడు నోరు తెరచి మనకు చెప్పలేడు. చెప్పినా మనకు అర్ధంకాదు. అందుకే, జాషువా, తన కవిత ఆరంభంలో

బోటవ్రేల ముల్లోకములు చూచి లోలోన
నానందపడు నోరులేని యోగి

అనగానే ఒక ఆలోచనా వీచిక ఎగసిపడుతుంది. శిశువు నోరు లేని యోగి.

యోగి మౌనంగా వుంటాడు. ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు.

జన్మించేకన్నా ముందు శిశువు మాతృ గర్భంలో తొమ్మిదినెలలు, చీకటిలో, యోగ నిద్రలాంటి స్థితిలో, ఆహారము లేక మౌన ధ్యాన స్థితిలో వుంటాడు. అందుకే, కవి శిశువును మౌన యోగి అనగానే మనసు ఝల్లుమంటుంది.

తల్లిదండ్రుల తనూవల్లరీద్వయికి వ
న్నియబెట్టు తొమ్మిదినెలలపంట.

శిశువు, తల్లితండ్రుల సమ్మిశ్రిత స్వరూపం. అందుకే నీరజ్ అనే హిందీ గేయ రచయిత ఒక పాటలో

థోడా హమారా, థోడా తుమ్హారా
ఆయేగా ఫిర్ సే బచ్పన్ హమారా

అనిపిస్తాడు నాయికా నాయకులతో సంతానం గురించి పాడే పాటలో.

జాషువా భావం ఇప్పుడు మరింత స్పష్టమవుతుంది.

ఇలా శిశువు లక్షణాలు వర్ణిస్తూ, చివరికి,

ఎవరెరుంగ, రితని దేదేశమోకాని
మొన్న మొన్న నిలకు మొలిచినాడు

అంటాడు.

శిశువు ఎక్కడ జన్మిస్తే అదే అతని దేశం. ఇంత మాత్రం కవికి తెలియదా? అనెవరయినా అనుకుంటే వారికి కవి హృదయం తెలియనట్టే. ఏదేశమో, అనటం వెనుక మనము ముందు చర్చిన ఆలోచన వుంది.

ఇంకా శిశువును,

సతిని ముట్టని సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి

అని వర్ణిస్తాడు కవి.

ఏమి పనిమీద భూమికి నేగినాడో

అని ఒక చోట ఆలోచిస్తే,

చిక్కుచీకటి జిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు

అంటాడింకో చోట.

జననీ జఠరే శయనాన్ని కవి ఎంత సుందరంగా, ఆలోచనాస్ఫోరకంగా వర్ణించాడో!

జననానికి ముందు శిశువు గురించి మనకు తెలియదు. జనం తరువాత కూడా మన స్థాయికి దిగేవరకు శిశువు మనసులోని వూహలు మనకందవు. అందుకే తనలో తాను నవ్వుకొనే శిశువును చూసి కవి,

పరమేశ్వరుండేమి సరసంబులాడునో? బిట్టుగా గేకిసల్గుట్టుకోనును

అంటాడు కవి.

అద్భుతమయిన ఊహ. పరమాద్భుతమయిన భావ వ్యక్తీకరణ.  పై పైన చూస్తే శిశువును ఆనందంగా వర్ణిస్తున్నాడు కవి. తరచి చూస్తే, పరమ తాత్వికమయిన ఆలోచనలను అతి సున్నితంగా  ప్రదర్శిస్తున్నాడు.

ఉత్తమ కవితా రచనకు అత్యుత్తమ తార్కాణమిది.

శిశువు కవిత మనల్ని ఇంతగా తాత్వికపుటాలోచనలతో ఉక్కిరి బిక్కిరి చేస్తే తరువాత కవిత బాష్ప సందేశము, మన్ల్ని కొరడాతో చళ్ళున కొట్టి అత్యంత ప్రధానమయిన మానవతా సమస్యవైపు మళ్ళిస్తుంది.

ఇది రేపు.

Enter Your Mail Address

March 17, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , ,  · Posted in: పుస్తక పరిచయము

No Responses

 1. aswinisri - March 17, 2009

  very good. keep going like this!

 2. padma - March 17, 2009

  BAGUMDI MEE VISLESHANA

 3. rayraj - March 17, 2009

  బావుంది.

  “పరమేశ్వరుండేమి సరసంబులాడునో? బిట్టుగా గేకిసల్గుట్టుకోనును”
  నిజంగా – పాతకాలం పెద్దలు అలాగే అనేవారు – దేవుడి కబుర్ల చెబ్తాట్ట అని!

  కండల వస్తాదు ; తల్లితో ఊడిగము చేయించుకొనును అని ఏవే రెండు లైన్లు ఉండేవే – శిశువు భలే ముద్దొచ్చింది ఆ మాటల్లో! అది గుర్తుండి పోయి,దీని కోసం చూశాను. ఈ శిశువు ఎక్కడన్న నెట్ లో ఉందా? “లింక్” ఇవ్వండి. లేకపొతే కాస్త ఏమనుకోక టైపు చేసి పెడుదురూ!ప్లీజ్!

Leave a Reply