పద్య కవులపై జాషువా విమర్శ.

జాషువా ప్రధానంగా సాంప్రదాయిక చ్చందో బద్ధ కవిత్వం రచించినా, ఆయన తన పద్యాలలో అనేక సమకాలీక సామాజిక వస్తువులను చిత్రించారు. సమకాలీన మనస్తత్వాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగానే, ఆ కాలంలో చలామణీ అవుతున్న కవిత్వ ప్రక్రియలపైనా, కవులపైనా కూడా తన దృక్కోణంలో విమర్శలు చేశారు. అలాంటి విమర్శలలో ఒక కోణం, అయోమయం, కవితలో కనిపిస్తుంది.

రత్నాలు తన కవితలో వున్నాయి, వాటిని ఎవరూ గుర్తించేవారు లేరు, అని వాపోయే కవిని ఆ రత్నాలు ఇంటికి తీసుకుపోయి దాచుకోమని వెక్కిరించారు. ఆ తరువాత పద్యంలో, తన పద్యాలు నన్నయ్య, తిక్కన్నలకు సాటిరాగలవని గర్వించే కవులపై విమర్శనాస్త్రాన్ని సంధించారు.

ఇయ్యది నూత్నపుంగవిత, యీ కవనంబును జూచెనేని, న
న్నయ్యయు గొయ్యవారిచనడా? యని వెర్రిమొగాలు పప్పురా
మయ్యలు, కొందరన్న విని, యాత్మను బొంగెదె? వడ్లగింజలో
బియ్యపుగింజగా కిది, కవిత్వమటోయి! బడాయిగొట్టగన్

ఈ పద్యంలో నన్నయ్య తిక్కనల తన దన్నే ఆధునిక కవితలను రాస్తున్నామని విర్రవీగే సాంప్రదాయిక కవులు, ఆధునిక కవులపైన జాషువా ఉమ్మడి వెక్కిరింపు వుంది.

ఇప్పుడు కవి ఆధునిక ప్రణయ భావ కవిత్వమంటూ రోదనలు, దుర్భర నిరాశా భావనలతో కవనాన్ని నింపే భావ కవుల అభావ కవిత్వాన్ని హేళన చేస్తున్నాడు.

కమ్మని భావము గల ప
ద్యమ్మొక్కటి వ్రాయజాల వన్నిటిలో, మ్య్
గ్దమ్మో! ప్రణయమ్మో! యని
యుమ్మలికించెదవు నీదియుంకవనమా?

ఇలా హేళన చేసి వూరుకోలేదు, తరువాత పద్యంలో కవిబ్రహ్మతో పొలిక తెచ్చుకుంటావెందుకని ఎద్దేవా చేస్తూ, నీయభావకవితాచిత్రాంగి నీ తిక్కనార్యునిముందేల ప్రవేశపెట్టెదు? అని వెక్కిరిస్తున్నాడు.

ఇంతటితో సరిపుచ్చుకోలేదు జాషువా. వరిగడ్డిలా పేలవమయిన అభిప్రాయాలతో చరణాలు సాగని నికృష్టమయిన మార్గాన చీదరపుట్టిస్తావేమి అని ఈసడించుకుంటున్నాడు. అనర్ధవ్యర్ధ వాచాలతతో కవిత్వాన్ని వ్యర్ధం చేయవద్దని సూచనప్రాయంగా చెప్తున్నాడు కవి.

ఇప్పుడు ఉదాహరించేపద్యము సూటిగా కృష్ణ శాస్త్రి భావ కవిత్వపు గుండెలో దిగబడుతుంది.

కవిసమయంబుదప్పి నుడికారపు సొంపును బాడుసేసి నీ
వెవతుకకోసమో కుమిలి యేడ్చుచు జక్కని తెల్గుకైతకా
యువులు గుదించి యేమిటి కయోమయముం బొనరింతువీవు? నీ
కవనము పాడుగాను! వెడగా! యికనేనియు రమ్ము దారికిన్

ఆధునిక కవిత్వము నాల్గుపాదాలకు కుదించారు కొందరు. ఆ నాల్గుపాదాల కవితనే సంపూర్ణ కవిత అన్నారు. అందుకే కవి కవిత ఆయువును తగ్గించేశారని వెక్కిరిస్తున్నాడు. అంతేకాదు, భావకవిత్వంలో ప్రేయసి కోసం కుళ్ళి యేడ్వటాన్ని కవి వెక్కిరిస్తున్నాడు.

ఇక్కడ మనము ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఏ కవిని కూడా అందరూ మెచ్చుకోరు. ప్రతి కవిపైనా, అతని కవిత్వం పైనా విమర్శలు వస్తాయి. అతనికి అభిమానులూ వుంటారు. అందుకే ఎదుటివారి విమర్శలతో సంబంధం లేకుండా ఎవరికివారు స్వయంగా కవి కవిత్వాన్ని చదివి నిజానిజాలు తేల్చుకోవాలి.

ఇక్కడ జాషువా అభిప్రాయంలో కృష్ణశాస్త్రి కవిత పనికిరానిది. కానీ అనేకులకు కృష్ణశాస్త్రి కవితలో తమలోని భగ్న ప్రేమికుడి హృదయ వేదన కనిపిస్తుంది. తమ విఫల ప్రణయ మనోరధాలు అక్షర రూపంలో లభించి సాంత్వన కలుగుతుంది.

అలాంటప్పుడు జాషువా విమర్శించాడు కాబట్టి అటు విశ్వనాథ, ఇటు, కృష్ణశాత్రి కవితలు పనికిరావంటామా?

కవిసమయం తెలియనివని అన్నాడు జాషువా. కాబట్టి ఆ కవితలన్నీ తప్పులంటామా?

కాబట్టి, విమర్శలలో అనేక అంశాలుంటాయి. ఒకరు విమర్శించారుకాబట్టి కవి పనికిరానివాడయిపోడు. పొగిడారు కాబట్టి గొప్పవారయిపోరు. కృష్ణశాస్త్రి కయినా, విశ్వనాథ కయినా ఇది వర్తిస్తుంది.

విమర్శ అనేది విమర్శకుడి వ్యక్తిగత అభిప్రాయం. అది విశ్వజనీనం కాదు. సార్వజనీనంకాదు.

గనిస్తే, జాషువా విమర్శలో కసి కనిపిస్తుంది.

ఒక కవిని ఇంకా నీల్గెదవేమిటి? అని ఎద్దేవా చేశాడు. ఇంకో కవిని నీదియుం కవనమా? అని తీసిపారేశాడు. మరో కవిని నీ కవిత పాడుగాను అని ఈసడించాడు.

ఇతర సమయాల్లో ఎంతో సౌమనస్యం ప్రదర్శించే జాషువా, సాటి కవులదగ్గరకు వచ్చేసరికి ఇంత అసహనం, ఆగ్రహాలు ప్రదర్శించటం వెనుక, ఆయన అనుభవించిన వివక్షత, తిరస్కారాల ప్రభావం వుందన్నది నిర్వివాదాంశం.

మిగతా రేపు.

Enter Your Mail Address

March 25, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. రాఘవ - March 25, 2009

  ౧ కృష్ణశాస్త్రిగారి మీదనే ఆ పద్యమని అనుకోనక్కరలేదనుకుంటానండీ.

  ౨ “విమర్శ అనేది విమర్శకుడి వ్యక్తిగత అభిప్రాయం. అది విశ్వజనీనం కాదు. సార్వజనీనంకాదు.” నికార్సైన మాట. :)

 2. సూర్యుడు - March 26, 2009

  పిరదౌసి లేఖ చదువుకున్నాము ఎప్పుడో హైస్కూల్లో, బాగా వ్రాస్తారు, జాషువా గారు.

  ఆంధ్రప్రభ వారపత్రికలో మళ్లీ ఎప్పుడో అబ్బూరి వరదరాజేశ్వర రావు గారు వ్రాస్తే ఇంకొద్దిగా తెలిసింది జాషువా గారి గురించి.

  ~సూర్యుడు :-)

Leave a Reply