ఇతర కవులపై జాషువా విమర్శలు-2

బ్లాగరులందరికీ విరోధినామ యుగాది శుభాకాంక్షలు. ఊ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సర్వే జనా సుఖినోభవంతు.

జాషువా కవిత్వంలో సమకాలీన సామజిక పరిస్థితులు కనిపిస్తాయి. వాటికి ఆయన స్పందన కనిపిస్తుంది.

ఆకాలంలో సాహిత్యం సంధి దశలో వుంది. అనేకానేక సిద్ధాంతాలు, అభిప్రాయాలు సాహిత్యాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. పాత కొత్తల మేల్ కలయిక క్రొమ్మెరులుగులు చిమ్మాలని గురజాడ వాంచించినా, పాత కొత్తల కలయిక సంఘర్షణ రూపం ధరించింది. విచ్చలవిడి తనం, పాతను అవహేళన చేయటం అభ్యుదయం అభివృద్ధి అయింది. ప్రతిక్రియగా, పాతను పట్టుకుని వ్రేలాడటం సాంప్రదాయ పరిరక్షణ అయింది. ఇలాంటి నూతన విప్లవాత్మక మార్పులకూ, పాతను పట్టుకుని వ్రేలాడటాన్ని, ప్రయోగాల పేరిట పద్యాన్ని పాదాలతో తొక్కేయటానికి జాషువా తీవ్రంగా స్పందించాడు. అవకాశం దొరికినప్పుడల్లా, తన భిప్రాయాన్ని నిర్ద్వంగా ప్రకటిస్తూవచ్చాడు.

అయోమయం అనే కవిత ఇలాంటిదే. అలాంటిదే మరో కవిత, కవితాలక్షణము.

ఈ కవితలో జాషువా, ఆధునిక కవిత్వ వికృత పోకడలను వ్యంగ్యం చేస్తూ కవిత్వ తత్వాన్ని, లక్షణాలనూ వివరిస్తాడు.

సందిటకు రాని వృద్ధభూషణము లెన్నో!
తనువున దగిల్చి, కావ్య సుందరిని దిద్ది,
బరువు మోయించి, తత్వంబు మరచిపోవు
కవి, యెరిగడు వ్యంగ్యవాగ్గర్భమహిమ!

మొదటి పద్యంలోనే, వృద్ధభూషణాల బరువు కావ్యసుందరితో మోయిస్తారంటూ విసురు విసిరాడు.

రెండో పద్యంలో, విపులరసభావభరిత గంభీరగమన మమరి చూపెట్టవలయు నని సలహా ఇస్తున్నాడు.

తరువాత పద్యంలో, నవరస ప్రాధాన్య ధన్యోక్తులతో కావ్యాన్ని తీర్చి దిద్దాలని సూచిస్తున్నాడు.

అంటే, జాషువా పూర్తిగా ప్రాచీన కవిత్వ తత్వాన్ని పనికిరాదనటంలేదు. పాతలోని మంచిని గ్రహించమంటున్నాడు.

నేటికైత, అనే కవితలో, కవితావాహిని చీలి పాయలయి ఆగంబై యధేచ్చారతిన్/ బ్రవహింపం దొడగెన్/ బురాతనపు త్రోవల్పుంతలుం బాడు వ?డ్డవి; చ్చందో నియమాది కూలములు భ్రష్టంబయ్యె/ అంటూ సమకాలీన పరిస్థితిని వివరిస్తాడు.

అయితే, అనేక రకాల భావజాలాలు కవిత గొంతు పిసికి రసాన్ని పీల్చేయటాన్ని ఖండిస్తూ, భావితరాలు కవిత్వమంటే విసిగి శపిస్తారు కవులు జాగ్రత్త పడకపోతే, అని భవిష్య దర్శనం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది జాషువా ఊహించి చూపించిందే!

ముసిరిన భావజాలమును బూడిదలోపల వంపి, కుత్తుకల్/బిసికి, యగాధ శబ్ద వనవీధుల దాచి, కవిత్వమన్నచో/ విసిగి, శపించి పోయెదరు, వీనులు శూన్యములై సభాసదుల్/ రసమరికట్టు యీ గులకరాల బిగింపులకేమి హేతువో?

చివరి పద్యంలో తన అభిప్రాయాన్ని ప్రకటిస్తాడు జాషువా.

మొత్తముమీద నాంధ్రకవి ముఖ్యులు పెట్టిన కట్టుబాట్లలో/ నుత్తమ మధ్యమాధమములున్నవి, వానిని కొద్దిగా మరా/మత్తొనరింపనౌ ననెడు మాటకు నేనును సమ్మతింతు; నీ/ బిత్తల తోకపీకుడు కవిత్వపు ఫక్కి ననాదరించెదన్.

బిత్తల తోకపీకుడు కవిత్వాన్ని ఆదరంచనని స్పష్టంగా చెప్తున్నాడు జాషువా. ఇప్పటి కవులను, వారి కవిత్వాల వెర్రిపోకడలను చూస్తే జాషువా ఏమనేవారో?

తన్నుడు చంపుడు, ద్వేషాలు, బూతులు, అర్ధం పర్ధంలేని మాటల్స్ కూర్పులే కవిత్వమని, అవే కొత్త ప్రయోగాలని తమని తామే పొగడుకునే కవులను వారి కవిత్వాన్ని చూస్తే జాషువా ఏమనేవారో సూచన ప్రాయంగా మనకు కవి అన్న కవితలో తెలుస్తుంది.

ఇది రేపు.

Enter Your Mail Address

March 27, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

  1. జ్యోతి - March 27, 2009

    మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు

Leave a Reply