హమ్మయ్యా! టెస్టు డ్రా చేసి బ్రతికించారు!

మొత్తానికి న్యూజీలాండులో తెస్టు సిరీసు గెలిచే అవకాశాలను సజీవంగా వుంచుకుని మన క్రికెట్ ఆటగాళ్ళు మనల్ని బ్రతికించారు.

క్రికెట్ ఒకరోజు ఆటగా, 20-20 గా రకరకాల రూపాలు ధరించినా తెస్టు మాచ్ కున్న  విలువ వేరు. అయిదు రోజుల ఆట అని బోరు అన్నా, ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే టెస్టు గీటురాయిలాంటిది.

20-20 పోటీల్లో, బంతిని బౌండరీ దాటించటంలో ప్రావీణ్యం తెలుస్తుంది. వొత్తిడికి లొంగకుండా, క్రీజువద్ద ఎక్కువ సమయం గడపకుండా, లేడికి లేచిందే పరుగన్నట్టు బాటు పుచ్చుకుందే కొట్టటానికన్నట్టు ఆడగలగాలి.

ఒకరోజు పోటీలో కాస్త తీరిక దొరుకుతుంది. ప్రణాలిక ప్రకారం ఆడాలి. ఇన్నింగ్స్ ను నిలబెట్టే వీలుంటుంది. వికెట్లు త్వరగా పోయినా, నెమ్మదిగా, 50 ఓవర్లలో నిలదొక్కుకుని ఆడి జట్టుని గట్టెక్కిచ్చే వీలుంటుంది.

అయిదు రోజుల ఆట ఆటగాడి వ్యక్తిత్వానికి పరీక్షలాంటిది. 20 ఓవర్లో, 50 ఓవర్లో ఓపిక పడితే అయిపోదు. అయిదు రోజులు అదే ఏకాగ్రత, అదే పోరాట పటిమ, అదే పట్టుదల నైపుణ్యం చూపాల్సివుంటుంది. అందుకే, 20-20 ఆటలో గొప్పగా విజయం సాధించిన వారు 50-50 ఓవర్లలో అంత ప్రతిభను చూపలేరు.

50-50లో అద్భుతంగా ఆడినవారు అయిదు రోజుల ఆటలో నిలద్రొక్కుకోలేరు.  టెస్టు పోటీల్లో అద్భుతమయిన ఆట చూపేవారు ఒకరోజు పోటీలలో నిలబడలేరు.

కానీ, అన్ని ఆటలలోనూ ఆటగాడికి అవసరమయిన నైపుణ్యం ఒక్కటే. ఆటగాడు సందర్భాన్ని అనుసరించి, వేగంగా పరుగులు తీయటం, కాస్త నిలబడిన తరువాత పరుగులు తీయటము, నింపాదిగా ఆడుతూ వీలును బట్టి పరుగులు తీయటమూ చేయాలి. అంతే, ఇది అర్ధమయినవారు ఏరకమయిన ఆటలోనయినా పేరు పొందుతారు.

గౌతం గంభీర్ 20-20 నుంచి పూర్తిగా తేరుకోకముందే 50 ఓవర్ల ఆటవచ్చింది. దానికి అలవాటయ్యేలోగా తెస్టు మాచ్ వచ్చింది. అందుకే, అతడు నిరాశ కలిగించాడు. కానీ, రెండో తెస్టు రెండో ఇన్నింగ్స్ లో అతడికి ఎలా ఆడాలో అర్ధమయింది. ద్రావిడ్ మొదటి ఇన్నింగ్స్ లో ఎక్కడ ఆపాడో రెండో ఇన్నింగ్స్ అక్కడి నుంచే ఆరంభించాడు. నిజానికి ఇటువంటి సందర్భాలలో ఆడటం ద్రావిడ్ కు కొట్టినపిండి. మొదటి సారి తొందరపడి, తెండోసారి దురదృష్టం వల్ల  ద్రావిడ్ 100 పరుగులు చేయలేకపోయాడు. లక్ష్మణ్ ద్రావిడ్ తరువాత ఇలాంటి పరిస్థితిలో ఎలా ఆడాలో తెలిసినవాడు. అందుకే అతడు రెండి ఇన్నింగ్స్ లోనూ చక్కగా ఆడాడు. యువరాజ్ సింగ్ కు ఇది తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితి. ఆడాడు. సెహవాగ్ అలవాటయిన రీతిలో ఆడాడు. కానీ, పరిస్థితికి తగ్గట్టు ఆడలేదు. సచిన్ ఎలా ఆడినా అద్భుతమే.

అయితే, మనవాళ్ళు ఆటను డ్రా చేయటం వల్ల మనం బ్రతికి పోయాం. లేకపోతే, టీవీ చానళ్ళలో మిడి మిడి ఙ్నానపు యాంకర్లు గొప్ప గొప్ప ఆటగాళ్ళను పనికిరాని వారిలా దూశించి, అవమానపరచటం ఒక వారంపాటు భరించాల్సి వచ్చేది. బ్యాటు పుచ్చుకోవటం సరిగ్గా తెలియని విశ్లేషకులంతా చానళ్ళలో వచ్చేసి ఆటగాళ్ళపైన అక్కసు ప్రకటించటం చూడాల్సివచ్చేది. పత్రికలన్నీ ఆటగాళ్ళని తిట్టేవి.

ఒక వారం క్రితం ఈ ఆటగాళ్ళనే, ఈ చానళ్ళు, ఈ పత్రికలు పొగిడాయి. ఆకాశానికి ఎత్తేశాయి. మొదటి ఇన్నింగ్స్లో చతికిలబడగానే, మన వాళ్ళు ప్రాక్టీసు బదులు ఎంజాయ్ చేశారని పదే పదే దూషించాయి. అసలు మనవాళ్ళకు ఆట రానట్టే చర్చలు జరిగాయి.

ఒక తెలుగు చానల్లో ఇంకా బొడ్డూడని వార్తగత్తె మన ఆటగాళ్ళు జిడ్డు ఆట చూపారని తన అమూల్యమయిన అభిప్రాయం ప్రకటించింది. నిజానికి వార్తగత్తెల వ్యాఖ్యలు స్క్రిప్తు రయిటర్లు రాస్తారు. అంటే, ఆట సమయమూ సందర్భమూ కూడా తెలియని స్క్రిప్టు రచయితలు, తిట్టి గొప్పగా భావించుకునే న్యూనతా భావం తో సతమతమయ్యేవారూ మనకు వార్తలూ విశ్లేషణలూ అందించి మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నారన్నమాట. ఈ చానళ్ళే ఒక రోజు ముందు మనవారు అనవసరమయిన షాట్లు కొట్టబోయి అవుటయ్యారని తిట్టాయి. తెల్లారేసరికి జిడ్డూఅట చూపారని హేళన చేస్తున్నాయి.కొందరు ఎక్స్పర్టులయితే, ధోనీ లేకపోటంవల్ల ఆటగాళ్ళు ఆడలేకపోతున్నారని అన్నారు. సచిన్, ద్రావిడ్ లాంటి ఆటగాళ్ళు ధోనీ లేకపోతే ఆడలేరన్నమాట!

ఆట గురించి, ఆటలో మెళకువల గురించి తెలియని వారు, సమయమూ సందర్భమూ గ్రహించనివారు మన చానళ్ళలో నిండి వున్నారు. అందుకే ఆటను డ్రా చేసి మన ఆటగాళ్ళు మనల్ని బ్రతికించారు. లేకపోతే ఈ పాటికి టీవీలనిండా, పత్రికలనిండా, మన ఆటగాళ్ళ పైన విమర్షలుండేవి. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ ల కన్నా ఆట ఎక్కువగా తెలిసినట్టు ప్రతివాడూ వ్యాఖ్యానించేవాడు. ఆట డ్రా అవటంవల్ల మనమీ దుస్థితినుంచి తప్పించుకున్నాము. అందుకు మనము ఆటగాళ్ళకు కృతఙ్నలమయివుండాలి.

అందుకే డ్రా చేసి మనల్ని బ్రతికించారు మన ఆటగాళ్ళు.

Enter Your Mail Address

March 30, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

No Responses

  1. gItAcArya - March 30, 2009

    Well said about the reviewers.

  2. చిలమకూరు విజయమోహన్ - March 30, 2009

    మీరు చెప్పింది నిజం.అత్త కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినచందాన మనవాళ్ళు ఆడనందుకుకాదుగానీ ఈ వెధవమీడియా ఎక్స్పర్టుల వ్యాఖ్యానాలతో చచ్చేవాళ్ళం ఒకవేళ మనవాళ్ళు ఓడిపోయివుంటే .thank god

Leave a Reply