నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది!

నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. నేను ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ఇప్పటి వరకూ ఎలాంటి అదనపు బాధ్యతలూ నిర్వహించలేదు. ఒకరకంగా చెప్పాలంటే, నేను కేవలం ఒక పీ ఎఫ్ నంబరుగా ప్రవర్తించానే తప్ప ఎలాంటి ఇతర కార్యక్రమాలలోనూ పాల్గొనలేదు.

డబల్ డ్యూటీల జోలికి పోలేదు. చివరికి కోలీగుల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకూ పోలేదు. అంటే, ఆఫీసులో వుండాల్సిన సమయము, చేయాల్సిన పని తప్ప మిగతా ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేదు. నిజం చెప్పాలంటే, కోలీగులెవరితోనూ నాకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు.

చాలామందికి నేను రాస్తానని కూడా తెలియదు. కొన్ని సందర్భాలలో నా రచనల గురించి నాముందే చర్చించుకోవటమూ జరుగుతుంది.

సాధారణంగా, ఆఫీసవుతూనే అందరికన్నా ముందు బయటపడేది నేనే. ఆఫీసులో వ్యర్ధమవుతున్న సమయం, మిగతా సమయాన్ని వ్యర్ధంకానీయకపోవటం నేర్పింది.

అలా ఎలాంటి కార్యక్రమాలలోనూ పాల్గొనని నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది.  తప్పించుకునేవీలు లేదు.

ఇంతకీ డ్యూటీ పడింది చంద్రాయణగుట్ట ప్రాంతంలో.

తప్పనిసరి తద్దినం కావటంతో, నేను సైతం భారతదేశ ప్రజాస్వామ్య మహా యంత్రంలో బోల్టునొక్కటి అయిపోయానూ అనుకుంటూ ట్రయినింగుకు వెళ్ళాను.

మళ్ళీ 11వ తారీఖున ఇంకో ట్రయినింగ్ వుంది.

హాయిగా, పుస్తకం చదువుతూనో, రాస్తూనో గడపవలసిన నేను, ఇలా గడపాలన్న ఆలోచననే భయంకరంగా వుంది.

ఒకరోజు ముందే వెళ్ళి అక్కడే వుండాలట. ఎన్నికల రోజంతా అక్కడే వుండాలి.

నాకేమనిపిస్తోందంటే, ఇలా ఇంతమంది ఇన్నిరకాలుగా తమ శక్తిని, సమయాన్ని వెచ్చించి ప్రజాస్వామ్య  అవ్యవస్థ చక్రాన్ని ముందుకుతోయటంలో సహాయపడుతూంటే, మన ప్రజా ప్రతినిధులు మాత్రం, తమ బాధ్యత తెలుసుకుంటున్నట్టు లేదు. అసలు బాధ్యత అనేపదం కూడా వారికి తెలుసో లేదో
అనుమానమే!

అందుకే, ఇప్పటి నుంచే నాకు ఏమీ రాయాలనిపించటంలేదు. త్వరగా 16వ తారీఖు వచ్చి వెళ్ళిపోతే నా పనులు నేను నా ఇష్టమొచ్చినట్టు చేసుకోవచ్చని ఎదురుచూస్తున్నాను.

Enter Your Mail Address

April 2, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. చదువరి - April 2, 2009

  మీకు అలా ఉందిగానీ, నాకు మాత్రం మీరు అదృష్టవంతులు అని అనిపిస్తోంది!

  పోలింగు విధుల్లో పాల్గొనాలని నాకు చాలా ఉత్సాహం. 1999లో – నా గత ఉద్యోగంలో ఉండగా – ఎన్నికల డ్యూటీ చెయ్యాలని ఉబలాట పడ్డాను. చిన్నపాటి లాబీయింగు కూడా చేసాను. అప్పటి పరిస్థితుల్లో నాకు ఆ పని ఇవ్వలేదు. నా తోటివారికి పడింది. నాకదో తీరని కోరిక.

 2. chavakiran - April 2, 2009

  ఆలా అంటారేమిటి? నేనయితే ఎగిరి గంతేసే వాడిని. ఎన్ని అనుభవాలు వస్తాయి, ఎన్ని కథలకు వస్తువులు దొరుకుతాయి.

 3. కస్తూరి మురళీకృష్ణ - April 3, 2009

  చదువరి గారూ, చావాకిరణ్ గారూ,

  మీరన్నది నిజమే. తప్పనిసరి అయినప్పుడు ఆనందంగానే చేస్తాను. లేకపోతే అనవసరమయిన అశాంతి. బోలెడన్ని కొత్త అనుభవాలు, వింత మనుషులు, కథలకు ప్లాట్లు అని సంతోశాన్ని పెంచుకుంటున్నాను. అదీగాక, ఇన్నాళ్ళు రాజకీయాలగురించి రాశాను. ఇప్పుడు వాటిలో ఓ ప్రక్రియను దగ్గరనుంచి చూస్తాను. ధన్యవాదాలు.

 4. సుజాత - April 3, 2009

  కొత్త అనుభవాలకోసం ఎదురు చూసే మీకు ఇలా అనిపిస్తోందా, “ఎందుకొచ్చిన ఖర్మరా బాబూ” అనుకునే వారికి ఆ డ్యూటీలు పడతాయి. మా అత్తగారు హై స్కూలు హెడ్ మిస్ట్రెస్ గా పని చేసారు. ఆమెకు ఎప్పుడూ రిటర్నింగ్ అధికారిగా డ్యూటీ పడటం, “ఇంటికి తిరిగొస్తానో రానో” అని తిట్టుకుంటూ వెళ్లి పని చేయడమూ నట! ఆ ఎలక్షను రెండు రోజులూ సెలవిస్తే హాయిగా పిల్లలతో గడొపొచ్చు అనుకునేవారట ఆమె!

  మురళీకృష్ణ గారు,చాంద్రాయణ గుట్ట అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే మీరు!
  మీ అనుభవాలతో కొత్త టపాలు రాస్తారని చూస్తున్నాం!

 5. అరిపిరాల - April 3, 2009

  మురళిగారు,

  చావాకిరణ్‌గారి మాటే నా మాట. ఎలక్షన్ ప్రహసనంలో భాగంగా వుంటూ రాజకీయాన్ని కొండకచో అరాచకీయాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశమిది. ఈ వస్తువుతో ఎన్ని కథలు పుట్టబోతున్నాయో..!! మీరు మాత్రం కొంచెం జాగర్తగా పని కానిచ్చుకోని రండి.

 6. bollojubaba - April 3, 2009

  ఎలక్షను డ్యూటీ అంటే చాలా సందర్భాలలో పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం లాగ ఉంటుంది.

  ఎన్నికలనగానే దాని వెనుక బలం, ధనం, ఎలాగైనా నెగ్గాలన్న కసి, దాగి ఉంటాయి. ఈ ప్రక్రియలో అన్ని వత్తిడులకు తట్టుకొని సమాధానం చెప్పి, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, ఎప్పటికప్పుడు తోలు కాపాడుకుంటూ ఉండాల్సింది పోలింగ్ సిబ్బందే.
  దీనికి తోడు ఏరులైపారే మద్యం వల్ల వచ్చే మాటలకంపునూ భరించాల్సిందే.

  ప్రజలలో మరీముఖ్యంగా అభ్యర్ధులతరపు పోలింగ్ ఏజెంట్లలో ఉండే అపోహల వల్ల పోలింగ్ అధికారి మాట్లాడే ప్రతీ మాట, ప్రతీ కదలికా నిశితంగా పరిశీలింపబడుతూంటుంది. ఒక్క లూస్ మాట (రాజకీయపార్టీలగురించి లేదా అభ్యర్ధులగురించి), లేదా ఒక్క అనాలోచిత చర్య (ఏజెంట్ల కదలికలను అనుమతించటంలోనో లేక వోటర్ల గుర్తింపులోనో, లేదా infirm voters companions నిర్ణయించటంలోనో వంటి చిన్నచిన్న విషయాలే చాలు) గందరగోళానికి దారితీసి పోలింగు సిబ్బంది పై భౌతిక దాడులు జరిగిన సంఘటనలు కోకొల్లలు.

  దీనికంతటికీ కారణం చాలా ఖరీదుగా మారిన ఎన్నికల ప్రహసనం. చావో రేవో అన్నట్లుగా పరిణమించిన పోటీలు.

  పోలింగ్ క్లర్క్ ల స్థాయి పని అయితే కొంతవరకూ బాధ్యత ఉండదు కానీ ప్రెసైడింగ్ ఆఫీసర్ గానయితే కత్తి మీద సామే.

  ఇవన్నీ ఒక ఎత్తయితే సదుపాయాల లేమి మరొక ఎత్తు. ఎన్నికల ముందురోజు వోటింగ్ యంత్రాలు (ఒకప్పుడు బాక్స్ లు ) సవాలక్ష స్టేషనరీ పత్రాలు, ఇతరసామాగ్రి చేతిలో పెట్టి, బస్సులో పోలింగ్ బూతులవద్ద దింపేస్తారు. ఆరోజు నుంచి తిండి, టాయిలెట్ కష్టాలు మొదలౌతాయి. ఎక్కడ తింటున్నామో, ఏమితింటున్నామో కూడా తెలియని స్థితి.

  పోలింగ్ బూత్ లు కొన్ని సందర్భాలలో మారు మూల పల్లెలు, ఏమీ దొరకని ప్రదేశాలు కూడా ఉండవచ్చు. అక్కడ స్థానిక అభ్యర్ధులు పంపిన తిండిని తీసుకొన్నట్లయితే మరో రకమైన తంటా. వాడెళ్లి పోలింగ్ సిబ్బందిని “మేనేజ్” చేసేసానని చెప్పుకోవచ్చు, తద్వారా మరో వర్గం నుంచి అనుమానపు చూపులు, వారికి తాడుకూడా పాములా కన్పించటం తప్పూ కాకపోవచ్చు.

  ఇక పోలింగ్ ముగిసాకా, నింపి సంతకాలు తీసుకోవలసిన పత్రాలు సుమారు ఒక 50 పైన ఉంటాయి. కొన్నిచోట్ల పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెట్టటానికి నిరాకరించవచ్చు, అదొక ప్రయాస. వాటిని కవర్లలో సీల్ చేసి, గోనె సంచెలో మూటకట్టుకొని వాటిని అప్పచెప్పే ప్రదేశానికి మోసుకొంటూ వెళ్లాలి (ఈ దశలో ప్రెసైడింగ్ అధికారి మాత్రమే మిగులుతాడు, మిగిలిన సిబ్బంది వెళిపోతారు).

  సెంటర్ కి వెళ్లే సరికే రాత్రి పది దాటుతుంది. అక్కడ రిలీజ్ సినిమా వద్ద ఉన్నంత క్యూ ఉంటుంది. తోసుకొంటూ కుమ్ముకుంటూ ఈ కవర్లనీ, బాక్సులు/యంత్రాలను అప్పచెప్పి బతుకుజీవుడా అనుకుంటూ బయటపడేసరికి రాత్రి రెండో మూడో అవుతుంది. (నాకు చాలా సార్లు ఆలానే అయ్యింది)

  అక్కడితో అయ్యిందనుకుంటే పొరపాటే, లెక్కింపు సమయంలో ఎన్నివోట్లు పోల్ అయ్యాయో మనం ఇచ్చిన సంఖ్యకూ, బాక్సులో ఉన్న వోట్లకూ ఏమైనా తేడా వచ్చినట్లయితే మరలా తాఖీదులు వస్తాయి. వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

  అలాంటి తేడా ఎందుకు వస్తుందంటే వోటర్ స్లిప్ ఇచ్చినతరువాత వోటర్ దానిని వేయకుండా మరో అదే రంగు కాగితాన్ని బాక్సులో వేసి నిజమైన వోట్ స్లిప్ ను పట్టుకు పోవచ్చు. (అదొక చైన్ లా సాగితే అది ఇంకో పెద్ద తప్పిదం) లేదా పోలింగ్ యంత్రంలో తెలియక నొక్కకుండా పోవచ్చు. హడావిడిలో దానిని గుర్తించం.

  ఇవన్నీ ముమ్ములను బెదరగొట్టటానికి కాదు ఎందుకో పంచుకోవాలనిపించింది.

  ఈ పనులన్నీ చేయటానికి అభ్యంతరాలు ఏమీ లేవు. ఉద్యోగస్తులందరూ తలలు అమ్ముకొన్న వారే. ఏ పని చెపితే అది చెయ్యాల్సిందే. ఇంతకన్నా ఎక్కువ పని గంటలూ చెయ్యగలం.
  కానీ ఈ విధులు నిర్వర్తించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొంటేనే కొంచెం నిర్వేదం కలుగుతుంది. (పోలీసులు, సైనికులకూ నిరంతర శిక్షణ ఉంటుంది)

  ఒక రకమైన భయానకమైన వాతావరణంలో ఉత్కంఠతో కూడుకొన్న ఉద్యోగమిది. దీనికి కారణం చాలా చాలా ఖరీదుగా మారిపోయిన ఎన్నికలే.

  ఇంతా అయిపోయాకా లెక్కింపుల రోజున పెద్ద పెద్ద గజమాలలతో “వాడు” ఊరేగుతూంటే ఎక్కడో కాల్తున్న వాసన వినిపిస్తుంది. :-)

  బొల్లోజు బాబా

  మీరు కానీ నేను కానీ విధి నిర్వహణలో మనల్ని మనం మరచిపోయి, ఒక అధికారి గానే ప్రవర్తించుకు రావటం శ్రేయస్కరమని నేను నేర్చుకొన్న పాఠం.

  ప్రతీ పోలింగ్ అధికారికి ఒక నంబరు ఇస్తున్నారు. విధి నిర్వహణలో మనమా నంబర్లుగానే ఉండాలి తప్ప, బొల్లోజు బాబా, లేదా మురళీ కృష్ణలము కాదన్న మాట.

  ఆల్ ద బెస్ట్

 7. సుజాత - April 3, 2009

  ఇంతా అయిపోయాకా లెక్కింపుల రోజున పెద్ద పెద్ద గజమాలలతో “వాడు” ఊరేగుతూంటే ఎక్కడో కాల్తున్న వాసన వినిపిస్తుంది.

  బాబా గారు, మీ స్టైల్లో ఉంది ఈ వాక్యం!

 8. కస్తూరి మురళీకృష్ణ - April 3, 2009

  బొల్లోజు బాబా గారు,
  మీ చివరి వాక్యం సరిగ్గా ఈ ప్రక్రియ పట్ల నా వైమ్య్ఖ్యాన్ని పట్టుకుని చెప్పినట్టుంది. మనము అన్ని అనవసరమయిన రిస్కులు తీసుకుంటాము. కష్టాలు పడతాము. ఫలితంగా వాడెన్నికయి, అధికారం సంపాదించి కసరత్తులు చేస్తాడు. ఒక సైనికుడో, పోలీసో చేసే బలిదానంలో అర్ధంవుంటుంది. పోలింగ్ డ్యూటీలో ఏమి జరిగినా వ్యర్ధమే. కనీసం రోడ్డు మీద పోతూంటే ప్రమాదం జరిగితే నా బండి, నా పొరపాటు, నా గ్రహపాటు. కానీ, ఎవడో అధికార దాహానికి అర్ధం పర్ధం లేని రిస్కు తీసుకోవటం చిరాకనిపిస్తోంది. పైగా, ఎలక్షన్ కమీషనర్ ఓ డిక్టేటర్ లా ప్రవర్తిస్తూ ట్రైనింగ్ కు రాని వారికి కోర్టు నోటీసులు పంపటం చూస్తే వొళ్ళు మండుతుంది. ఈ ప్రహసనంలో గాయాలయితే 5 లక్షలు, పోతే 10 లక్షలూట! పోయిన తరువాత 10 లక్షలయితేనేమి, 100 కోట్లయితేనేమి? తాను రక్షణ సంపూర్ణంగా కల్పించలేని పని తప్పనిసరి చేయటం ఏరకంగా సమంజసం? నాయకులకు పదవులు, అధికారాలు, వాళ్ళ కొట్లాటలలో బలవటానికి మనకు నిర్బంధ విధులు. ఇది దేశ సేవట! ధన్యవాదాలు, మీ వ్యాఖ్య నాకు ఊరట కలిగించింది.

Leave a Reply