కదిలించే కథలు! వెంటాడే కథలు!

ఈ కథలు హృదయాన్ని కదిలిస్తాయి. చదివిన తరువాత స్థిమితంగా వుండనీయవు. అనుక్షణం గుర్తొస్తూ వెంటాడతాయి. నిద్రపోనీయవు. నిలవనీయవు.

ఈ కథలు చదివిన తరువాత మనల్ని మనం చూసే దృష్టి పూర్తిగా మారిపోతుంది. మన సమాజాన్ని మనం అర్ధం చేసుకునే రీతిలో మార్పు వస్తుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే, మన ఆలోచనావిధానం, ఈ కథలు చదవకముందు, చదివిన తరువాత గా మారిపోతుంది!

మహా శ్వేతా దేవి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఆమె రచనా చాతుర్యం గురించీ చెప్పాల్సిందేమీ లేదు. తన కథలకు ఆమె నిత్య జీవితంలో జరిగే సంఘటనలను కేంద్రంగా చేసుకుంటారు. చేదు నిజాలను అంతే చేదుగా నిక్కచ్చిగా ఎలాంటి తీపి పూయకుండా నిర్మొహమాటంగా ప్రదర్శిస్తారు. అందుకే, ఆమె వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ఏకీ భవించని వారు, ఆమె సిద్ధాంతాలతో విభేదించేవారు కూడా ఆమె కథలను చదివి కదలిపోకుండా వుండలేరు. ఆమె ప్రభావాన్నుంచి తప్పించుకోలేరు.

ఆధునిక భారతీయ రచయితలలో అనేకులు దేశ విదేశాలలో అనేకానేక అవార్డులు కొట్టేసుండవచ్చుగాక. నీరాజనాలందుకుని వుండవచ్చుగాక. వారి పుస్తకాలు లక్షల సంఖ్యలో అమ్ముడు పోతూండవచ్చుగాక.

కానీ, వారెవరూ మహాశ్వేతాదేవికి సాటి రారన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే, మహా శ్వేతాదేవి రచనలు ఈ మట్టిలోంచి జన్మించినవి. తరతరాల జీవన విధానంలొ వ్రేళ్ళూనుకున్నవి. మానవుడికి మనసుండి,ఆ మనసు స్పందించగలిగేదయివున్నంతకాలం మహాశ్వేతాదేవి కథలు చిరంజీవులుగా వుంటాయి. అంత సజీవమయినవి ఆమె కథలు.

ఇందుకు తిరుగులేని ఉదాహరణ, ఆమె  నాలుగు కథల సంకలనం, bitter soil.

పేరులోనే ఆమె చేదు నిజాలను, చేదు విషయాలను మాత్రమే చెప్తున్నానై సూచిస్తున్నారు. కాబట్టి ఆ చేదును అనుభవించేందుకు ఇష్టపడినవారే పుస్తకాన్ని తెరిచి ఆమె సృజించిన చేదు ప్రపంచంలోని చేదు నిజాల కథల జగతిలోకి అడుగుపెడతారు.

ఇందులోని నాలుగు కథలు నాలుగు రకాల చేదునిజాలకు దర్పణం పడతాయి.

little ones అనేకథ చదివిన తరువాత ఇక మెదడు చాలాసేపటివరకూ పనిచేయదు. తరువాత కథ చదవ బుద్ధికాదు. బలవంతాన చదవాలని ప్రయత్నించినా, మెదడు ఏ విషయాన్నీ గ్రహించదు.

ఈ కథలో కరవు సమయంలో ప్రభుత్వం అందించే సహాయం గురించిన చేదు నిజాలను, గిరిజన ప్రజల బ్రతుకులతో నాగరీకులు ఆడే అమ్మనుష అనాగరిక ఆటలతో ముడిపెట్టి ఎద కరిగే రీతిలో కథ చెప్తారు రచయిత్రి.

seeds కథ కూడా ఇంతే. విత్తనాల రాజకీయాలకు, భూపోరాటాల ఆరాటాల మోసాలను జత పరచి కఠినమయిన విషాల్లాంటి చేదు నిజాలను చూపుతారు.

 the witch కథ గిరిజనుల మూఢ నమ్మకాలతో, నాగరీకులు తెలివయినవారు ఆడుకునే ఆటలను నిక్కచ్చిగా చూపుతుంది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, ఓ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి, గిరి జనులలొ మంత్రగత్తె అంటే వున్న మూఢనమ్మకాన్ని వినియోగించటం గుండెలు పగిలేలా చూపుతుంది.

మూఢనమ్మకాలింకా ఎక్కడ వున్నాయని వాదించే మిడి మిడి ఙ్నానుల అఙ్నానాన్ని పటాపంచలు చేస్తుందీ కథ. వార్తా పత్రికలలో చదివే వార్తలలో నిజాల వెనుక పొంచివున్న నీడలపై వెలుతురు ప్రసరింపచేస్తుందీ కథ.

 salt కథ పరమాద్భుతమయినది. ఆదివాసులకు ఉప్పు అందించకుండా వారి జీవితాలను అల్లకల్లోలం చేసి, అనేక అనర్ధాలకు ఓ నాగరీకుడు కారణమవటాన్ని ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శిస్తుంది రచయిత్రి. ఈ కథలోనే, వారిని ఉద్ధరించాలని ప్రయత్నించేవారి అహంకారాలను, అవగాహనా రాహిత్యాన్ని, ఉద్ధరించాలనే ప్రయత్నాలవల్ల మరింతగా తీవ్రమయ్యే అనర్ధాలనూ నిక్కచ్చిగా చూపుతుంది రచయిత్రి.

ఈ కథలన్నీ చదువుతూంటే, మనము, పట్టణాలలో వుంటూ, ఏసీ గదులలో కూచుని సిద్ధాంతాల రాద్ధాంతాలకు మేత నిచ్చేవారి పుస్తకాలు తిరగేస్తూ, అదే నేను గ్రహించిన ఙ్నానమని విర్రవీగుతూ, సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతూ, గొడవలు చేస్తూండటం ఎంత ~అమ్నానమో అనిపిస్తుంది.

మనకసలు ఏమీ తెలియదని, మనల్ని మించిన మూఢులు మరొకరులేరనీ అనిపిస్తుంది. టీవీలో భూకంపాలను, అగ్నిపర్వత విస్ఫోటనాలనూ చూస్తూ గొప్ప సాహసం చేసిన వారిలా భావించుకునే బావిలో కప్పలమని అనిపిస్తుందీ కథలు చదువుతూంటే.
ఈ కథల అనువాదం ఉత్తమంగా వుంది.
అయితే, రచయిత్రి చేదు నిజాలను అంతే నిక్కచ్చిగా రాయాలని అనుకోవటంతో, అక్కడక్కడా కథనం బిగువు సడలి, వార్తా పత్రికలలో వార్తలు చదువుతున్నట్టు అనిపిస్తుంది.

మరో ప్రధాన విషయం ఏమిటంటే, రచయిత్రి ఈ కథలు రాయటంలో తన ఉద్దేష్యాన్ని వివరిస్తూ i believe in documentation. after reading my work, the reader should face the truth of facts and feel duly ashamed of the true face of india. అంటుంది.

ఇది, నెగటివ్ ధోరణి. ఇప్పటికే పని గట్టుకుని అనేకులు మనల్ని చూసి మనం సిగ్గుపడేలా చేయాలని అహరహం శ్రమిస్తున్నారు. ఉన్నదానికీ లేని దానికీ పనికి రాని వాదనలతో మనల్ని కించబరచి, చిన్న బుచ్చి మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. అలాంటి పనే రచయిత్రి చేయాలనుకోవటం శోచనీయం.

చేదు నిజాలను ప్రదర్శించటంతో రచయిత పని అయిపోదు. శ్ర్జనాత్మక రచయిత చేదు నిజాలను ప్రదర్శిస్తూ, పాఠకుల మనస్సాక్షిని జాగృతం చేయాలి. వారిని కార్యాచరణకు ప్రేరేపించాలి. వారిలోని నిరాశ భావనలను పారద్రోలి, ఆశాభావాన్ని నింపాలి. చీకటిని చూపించాల్సిన పనిలేదు. ఆ చీకటిని పారద్రోలే చిరుదివ్వెను వెలిగించే మార్గం చూపాలి. కనీసం అలాంటి ఆలోచనను కలిగించాలి. కానీ, రచయిత్రి చీకటినే మరింత చీకటిగా చూపాలని ప్రయత్నించటం వల్ల కథలలో స్ఫూర్తి లేకుండా పోయింది. పైగా, ఈ కథలు చదివిన తరువాత అనవసర ద్వేషం కలుగుతుంది.

నిజానికి రచయిత ఉన్నదున్నట్టు చూపేటప్పుడు,  సామాజిక పరిస్థితులను, మన స్తత్వాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూపటంవల్ల ద్వేషాలబదులు అవగాహన కలుగుతుంది. గతంలోని దోశాలను గుర్తించి వర్తమానంలో వాటిని సరిచేయటానికి ప్రణాళికలు వేసి భవిష్యత్తుకు బంగారుబాటలు నిర్మించే వీలు కలుగుతుంది.

కానీ, ద్వేషాన్ని నూరిపోస్తేనే గుర్తింపు, మేధావి అన్న ఆదరణలు లభించే మన సమాజంలో అది ఆశించటం అత్యాశే అవుతుంది.

అందుకే, ఈ కథలు చదవండి. ఆలోచించండి. నిజాన్ని గ్రహించి సమన్వయం సాధించేందుకు ప్రయత్నించండి.

ఒక తత్వ వేత్త అన్నట్టు, ద్వేషాన్ని వెదచల్లటం సులభం. సమన్వయం సాధించటం కష్టం.

 bitter soil.
stories by maha sweta devi
translated by ipsita chanda.
seagull books
275/-

Enter Your Mail Address

April 3, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

Leave a Reply