శ్రీ సీతారాముల కళ్యాణము చూశాం మేమండీ!

image0001అమ్మ ఎప్పటినుంచో సీతారాముల కళ్యాణాన్ని చూడాలన్న కోరికను తెలుపుతూవుంది. కానీ, నాకు జన సమూహాలంటే భయం. ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో గుళ్ళకెళ్తే దేవుడు కనిపించటమేమోకానీ తాతలు ముత్తాతలు గుర్తొస్తారు. నక్షత్రాలు నేలపైకి దిగివస్తాయి. అందుకే, అమ్మ సీతారామ కళ్యాణమన్నప్పుడలా ఎంటీరామారావు సినిమా కాసెట్టిస్తూంటాను.

ఈసారి అనుకోకుండా నిన్న సాయంత్రం వేముగంటి మురళీ కృష్ణ ఫోను చేశారు. మాటల సందర్భంలో  image0011సిద్దిపేటలోని అతి ప్రాచీన రామాలాయం వారిదేనని చెప్పారు. అంతేకాదు, శనివారం తాను సిద్దిపేట వెళ్తున్నాననీ, వస్తే కళ్యాణం చూసేవీలుంటుందనీ అన్నారు. నేను అమ్మని అడిగి చెప్తానన్నాను.

అమ్మని అడగి అటూ ఇటూ చూసేలోగా, అమ్మ తయారయి, ఎప్పుడు వెళ్ళటం? అని అడిగింది. రేపు, అని చెప్పి, వేముగంటికి ఫోను చేసి ప్రొద్దున్నే మేమూ వస్తామని చెప్పాను. పద్మ ఆఫీసుకి ఫ్రెంచి లేవు పెట్టేసింది. రాముడిముందు ఉద్యోగంలో ఒక రోజొకలెక్కా?

image0021నమ్మేవాళ్ళకు నమ్మకం వేయి ఏనుగుల బలాన్నిస్తుంది. వారిని, వారి విశ్వాసాన్ని చూస్తే, దేన్నీ నమ్మలేని వారికి అసూయ. అందుకే, నమ్మేవారిని వెక్కిరిస్తారు. హేళన చేస్తారు. వారి విశ్వాసాన్ని దెబ్బతీసి తమాషా చూస్తారు.

అనుకున్నట్టే, ప్రొద్దున్నే, లోథ్ కుంట దగ్గర ఉన్న ఐసీఐసీఐ ఏటీఎం  దగ్గర్కు వేముగంటి, మేమూ ఒకేసారి చేరుకున్నాము. కారులో సీరామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన సినిమా పాటల సీడీలో పాటలు వింటూ ఝామ్మని సిద్దిపేట చేరుకున్నాము.

సిద్దిపేటలో మొత్తం మూడు అతి ప్రాచీన ఆలయాలున్నాయి. కనీసం 7-8 వందల సంవత్సరాలనాటివి. వీటిలో, రామాలయం, పక్కనే శివాలయం వున్నాయి. కాస్త దూరంలో, భోగేశ్వరాలయం వుంది.

image0031రామాలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ రాముడు సతీ లక్ష్మణ సమేతుడేకాదు, భరత, శతృఘ్న, ఆంజనేయ, గరుత్మంత సమేతుడు. విగ్రహాలు అందంగా వున్నాయి. వైభవంగా పూజలందుకుంటున్నాయి.

ఆలయం నడవటంలో వూరివారంతా తమవంతు విరాళాలిస్తున్నారు. నిత్య పూజలకోసం శాశ్వత విరాళాలిచ్చినవారి పేర్లు రాసిన రేకు గుడి ఆవరణలోవుంది. 

పక్కనేవున్న శివాలయం చూస్తేనే ప్రాచీనమయినదని తెలుస్తోంది.

భోగేశ్వరుడయిన శివుడు ఎలాంటి భోగాలులేక పాడుపడిన గుడిలో కొలువైవున్నాడు. అరుదయిన త్రికూటాలయాల్లో ఇదొకటి. త్రికూటాలయాలంటే, ఒకే ఆలయంలో విష్ణు, శివుడు, సూర్యుడు కొలువై వున్న ఆలయాలు.

అసలు ఆలయం శిథిలమయి సమకాలీన స్థితికి ప్రతీకాత్మకంగా వుంది. ఆలయానికి దూరంగా విరిగిన విష్ణు విగ్రహం వుంది, చెత్తలో. పొలానికి సరిహద్దులా అనేక పానపట్టాలున్నాయి. అంటే, చారిత్రిక image0041సత్యాలను తమలో ఇముడ్చుకున్న అనేకానేక విలువయినవన్నీ ఇలా మరుగున పడివున్నాయన్నమాట. సత్యశోధనలో వెయ్యవవంతుకూడా చేయకుండానే, దొరికిన వాటిని పైపైన చూసి రాసే చరిత్రనే అసలయిన చరిత్ర అని నమ్మిస్తున్నారు. మనము నమ్ముతున్నాము. దాన్ని పట్టుకుని పోరాడుతున్నాము.image0051

ఈ ఆలయంలోని ధ్వజ స్థంభం గొప్పగా వుంది.image0061

ఇవన్నీ చూసి మళ్ళీ వెనక్కి వచ్చి, సీతాకళ్యాణాన్ని చూశాము.

image013సిద్దిపేట వెళ్ళటంవల్ల నాకు వేముగంటి నరసిమ్హాచార్యులవారి రచనలు లభించాయి. వేముగంటి మురళీ గారి అన్నయ్యతో పరిచయమయింది. ఆయన సేకరించిన అనేక విలువయిన చారిత్రిక ప్రాధాన్యం కల వస్తువులను చూశాను. అద్భుతమయిన విషయాలను తెలుసుకున్నాను.

image018తిరిగివస్తూంటే, మనకు తెలియకుండా ఎన్నెన్ని మహాద్భుతమయిన సత్యాలు మరుగునపడిపోతున్నాయో అన్న ఆలోచన కలిగింది.image012

అంతేకాదు, నిజంగా ఎవరయినా, మన దేశం అణువణువూ ఒక ఉద్యమంలా తిరిగి, ప్రతి గ్రామంలోని, ప్రతి వ్యక్తినీ కలసి, వారి చరిత్రను తెలుసుకోగలితే, అనెక అద్భుతమయిన సత్యాలు ఆవిష్కృతమవుతాయి. మన అసలు చరిత్ర గురించి కనీసం ఒక అవగాహన ఏర్పడుతుంది.

image016ఇది జరిగేపనికాదు. కాబట్టి అప్పటివరకూ ద్వేష భావాలు నిండిన ఈ చరిత్రనే మన చరిత్ర అనుకుని పోరాడుకుందాం. ఉపనిషత్తుల్లో చెప్పినట్టు గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళకు త్రోవ చూపుకుందాం.

అయితే, మురళి వాళ్ళ అన్నయ్య అడిగిన ఒక ప్రశ్న అందరమూ ఆలోచించాల్సినది.

అందరూ తెలంగాణా అంటూన్నారుకానీ, ఒక్కరు కూడా తెలంగాణా చరిత్రను సేకరించి రచించాలని అనుకోవటంలేదు.

image029అవును, అధికారాలు, స్వార్ధాలకోసం జరిగే ఆత్మగౌరవ పోరాటాలలో ఆత్మ ఎలాగో వుండదు. గౌరవమసలేవుండదు.

ఇంటికి వచ్చేసరికి టీవీలో భద్రాచలం నుంచి సీతారాముల పెళ్ళి ప్రసారమవుతోంది.

సీతారాములెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు? అడిగింది, పక్కింటి పాప.

ఈ దేశంలో ఎంతమంది మనుషులుంటే అన్ని, అన్నారు వాళ్ళ తాతయ్య.

అడుగడుగున గుడివుందీ, అందరిలో గుడివుంది. రాముడికోసం ఎక్కడో వెతకక్కర్లేదు. ప్రతి మనిషి మనసులో వున్నాడు. మనసు మంచి ఆలోచనలు చేసినప్పుడల్లా సీతారాముల కళ్యాణం జరుతుంది.

రామ రామ జయ రామ రామ జయ రామ రామా!

Enter Your Mail Address

April 4, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

  1. సూర్యుడు - April 4, 2009

    బాగుంది

  2. malapkumar - April 5, 2009

    ఆ ఫొటో లు చూస్తుంటే సిద్దిపేట్ వెళ్ళాలి అనిపిస్తుంది.
    మీ పవర్ పాలిటిక్స్ చదువుతుంతాను.బాగా రాస్తారు.

Leave a Reply