మన టీవీ విశ్లేషకులకు క్రికెట్ ఆట తెలుసా?

టీవీ చానెళ్ళలో ఐపీఎల్ క్రికెట్ పోటీల ఆటల విశ్లేషణలు వింటూంటే ఈ సందేహం పదే పదే కలుగుతోంది. తెలుగు చనెళ్ళలోనే కాదు, ఇంగ్లీషు చానెళ్ళలో కూడా, గతంలో క్రికెట్ ఆట ఆడినవారు కూడా చేసే వ్యాఖ్యలు వింటూంటే, వీరు క్రికెట్ ఆట కన్నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారేమో అనిపిస్తుంది.

నిన్నటి ఆటలో యూసుఫ్ పఠాన్ ఆట అత్యద్భుతం. బంతిని ఎంత కసిగా కొట్టాడంటే, ఇంకాస్త  బలము ఉపయోగించి కొడితే బంతి బోఉండరీనేకాదు, సముద్రాలు దాటి మన దేశంలో వచ్చి పడుతుందేమో అనిపించింది. ఒక ఆటగాడు అలా ఆడుతూంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలాంటి సమయంలోనే కెప్టేన్ చాతుర్యం తెలిసేది.

కెప్టేన్ తన బవులర్లతో మాట్లాడాలి. వారికి ధైర్యాన్నివ్వాలి. బంతులను యార్కర్లుగా వేయాలని చెప్పాలి. అవసరమయితే, ఓవరుకు ఆరుబంతులూ యార్కర్లే వేయమనాలి. స్పిన్నర్లకు, కూడా, బంతులను దాదాపుగా బాటు క్రిందకు వేయమనాలి. దాంతో ఆటగాడు ఆత్మ రక్షణలో పడతాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టలేదు. పైగా, ఆసమయానికి రాజస్థాన్ వారు అయిదు వికెట్లు కోల్పోయి వుండటంతో, ఆటగాడు తప్పనిసరిగా వికెట్ కాపాడుకోవటం పైన దృష్టి పెట్టాల్సివుంటుంది.

మన విశ్లేషకులెవ్వరూ ఈ విషయం ప్రస్తావించటంలేదు. గతంలో అనేక మార్లు స్టీవ్ వా ఇలాంటి పద్ధతులద్వారా అపజయాలనుంచి విజయాలు సాధించాడు. ఈ విషయాలు చర్చించేబదులు, మన వారు మెక్ గ్రాత్ ని కూచోబెట్టారు, కాలిగ్ వుడ్ ని ఆడనీయటం లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరంతా డిల్లీ జట్టులో భవిష్యత్తులో ఉపయోగపడే surprise ఆటగాళ్ళు. ఈ ప్రణాళికను అర్ధం చేసుకోకుండా, అక్కడికి ఆడుతున్నవారికి చేతగానట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చేతకాని జట్టుతోటే ఇంతవరకూ డిల్లీ జట్టు గెలుస్తూవస్తోంది. ఒక ఆటలో దెబ్బ తినగానే పనికిరానివారన్నట్టు వ్యాఖ్యానించటం అర్ధం లేనిది. రాబోయే రెండవ భాగం ఆటలలో మెక్ గ్రాత్ ఆడతాడు. అప్పటికి అతను ఫ్రెష్ గా వుంటాడు. ప్రభావం చూపుతాడు.

ఇదే ఆటలో గ్రేం స్మిత్ గురించి మన మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆట గురించి తెలియని వారు చేయాల్సిన వ్యాఖ్యలవి. గ్రేం స్మిత్ సరిగా ఆడలేకపోతున్నాడు. దాని ప్రభావం రాజస్థన్ జట్తు అనుభవిస్తోంది. కాబట్టి ఈసారయినా సరిగ్గా ఆడాలని నిశ్చయించుకునివుంటారు. కనీసం త్వరగా అవుటవద్దని నిర్ణయించుకుని వుంటారు. 20-20 ఆటలోనేకాదు, ఏ ఆటలోనయినా ఆరంభ ఆటగాళ్ళపైన బాధ్యత ఎక్కువ. వారిచ్చే ఆరంభంపైనే జట్టు పరుగులు సాధించటం వుంటుంది. కాబట్టి ఒక ఆరంభ ఆటగాడు త్వరగా అవుటయిపోతే, ఇంకో ఆటగాడు ఆత్మ రక్షణతో ఆడాల్సి వుంటుంది. పరుగులు వేగంగా తీయకున్నా ఒక వైపు వికెట్ పోకుండా ఆపాల్సివుంటుంది. ఇది తరువాత వచ్చే ఆటగాళ్ళలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. వారు షాట్లు కొట్టి రిస్కు తీసుకుంటారు. తగిలితే గెలుపు, లేకపోతే ఓటమి. కానీ, ఒక వైపు ఒకరు అవుట్ కాకుండా నిలబడటం తప్పనిసరి. ఇద్దరు ఓపెనర్లు అవుటయితే అప్పుడు వన్ డౌన్ ఆటగాడు ఈ బాధ్యతను నిర్వహిస్తాడు.

అందుకే, నిన్నటి ఆటలో యూసుఫ్ పఠాన్ చెలరేగి విజయాన్ని సంభవం చేయటం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో, మరో వైపు గ్రేం స్మిత్ నింపాదిగా ఆడటమూ అంతే ప్రాధాన్యం వహిస్తుంది. ఇందుకు భిన్నంగా అతడు అవుటయిపోయుంటే, పఠాన్ కు పార్ట్నెర్లు మిగిలేవారుకారు. ఇంతకు ముందు అనేక ఆటల్లో ఇది జరిగింది. అందుకు ఈ సారి స్మిత్ ఆట ఎంతో ప్రణాళికానుసారంగా ఆడింది.

కానీ, మన విశ్లేషకులు స్మిత్ ను దుయ్యబడుతున్నారు. స్మిత్ వేగంగా పరుగులు తీయాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు. గమనిస్తే, రెండు సార్లు పఠాన్ కాచవుటబోయి తప్పించుకున్నాదు. అతడు అవుటయినా, తరువాత వచ్చే ఆటగాడికి స్మిత్ ను చూసి ధైర్యం వచ్చేది, వెగంగా పరుగులు తీసే ప్రయత్నాలు చేసేవాడు. కనీసం ఒకవైపు వికెట్ భద్రంగా వుందికదా అన్న ధైర్య అది. ఇక్కడ ఓటమి కన్నా, విశ్వాసం ప్రాధాన్యం వహిస్తుంది. విశ్వాసం అపజయాన్ని విజయంగా మారుస్తుంది. నిన్నటి ఆటలో జరిగింది అదే. మెరుపులు కురిపించిన పఠాన్ విజయానికి ఎంత కారకుడో, నింపాదిగా ఆడిన స్మిత్ కూడా అంతే కారకుడు.

ఇది అర్ధం చేసుకోకుండా మన వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించటం చూస్తూంటే, వీరికి క్రికెట్ అసలు తెలుసా? అన్న సందేహం వస్తోంది. ఇది మన ప్రేక్షకుల అభిప్రాయాలను ఏర్పరుస్తుందని గమనిస్తే, క్రికెట్ ఆట అంటే సిక్సులు-ఫోర్లే అన్న అభిప్రాయం ఎందుకు స్థిరపడుతోందో అర్ధమవుతుంది.

Enter Your Mail Address

April 29, 2009 ·  · 3 Comments
Posted in: క్రికెట్-క్రికెట్

3 Responses

 1. బ్లాగాగ్ని - April 29, 2009

  మెక్ గ్రాత్ ని కూచోపెట్టటం వెనకున్న వ్యూహమేమిటో నాక్కూడా అంతుపట్టలేదు. కానీ మురళిగారూ, ఓవరులో ఆరు బంతులూ యార్కర్లుగానో, బ్లాక్ హోల్లోనో వెయ్యాలంటే సామాన్యంకాదు. కెప్టెన్ చెపుతాడు, యార్కర్లు వెయ్యమని, విడ్త్ ఇవ్వద్దని, లెంగ్త్ బాల్స్ వెయ్యొద్దని వగైరా, వగైరా. కానీ అది అమలుపరిచే సత్తా బౌలర్కి వుండాలిగా. ప్రతీ బంతినీ కొలిచినట్లు కావలసిన ప్రదేశంలో వెయ్యగల సత్తా మెక్ గ్రాత్ సొంతం. పాల్ కాలింగ్ వుడ్ మంచి ఆల్ రౌండర్ అన్న విషయం అందరికీ తెలుసు. వారిద్దరికీ ఒక్క పోటీలోనూ ఆడే అవకాశమివ్వకపోవటం ఖచ్చితంగా తప్పే అని నా అభిప్రాయం. ఎప్పుడో రెండో రౌండ్లో ఆడించచ్చులే అనుకుని, తీరా ఆసమయానికి మాచ్ ప్రాక్టీసులేక ఇద్దరూ ఫాం లోకి రావటానికి సమయం తీసుకుంటే నష్టపొయ్యేది ఢిల్లీ జట్టే. నిన్న యూసఫ్ ఢిల్లీ బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నప్పుడు మెక్ గ్రాత్ గనక వుండుంటే ఖచ్చితంగా తేడా కనిపించేది. స్మిత్ విషయంలో మాత్రం మీతో ఏకీభవిస్తాను.

 2. అబ్రకదబ్ర - April 29, 2009

  యోర్కర్లు ఆడటం అసాధ్యమేమీ కాదు. బంతిని సరిగా అంచనా వెయ్యగల బ్యాట్స్‌మెన్‌కి వాటిని ఆడటం అతి సులువు. టెయిల్ ఎండర్లనే తప్ప ధాటిగా ఆడే ఆటగాళ్లని ఇవి పెద్దగా ఇబ్బంది పెట్టలేవు.ఒక్కడుగు ముందుకేస్తే అవి ఫుల్ టాస్‌గా మారిపోతాయి. బౌలర్ గురి తప్పిందంటే ఓవర్ పిచ్ అయిపోతాయి. ఇక వెళ్లేది సిక్సే. టెన్నిస్‌లో ఏస్ లా యోర్కర్లు తురుపు ముక్కలే కానీ ప్రతి సమస్యనీ ఛేదించే తావీజులు కావు.

 3. Malakpet Rowdy - April 29, 2009

  Agree with the above. Everybody cant be somebody like Umar Gul to bowl 6 yorkers an over. Even Gul falters many a time and gets hit.

  A curious question though – Do people really enjoy this 20/20 Circus?

Leave a Reply