ఐ పీ ఎల్ లో గెలుపెవరిది? నా అభిప్రాయం.

ఇది భవిష్యవాణి కాదు. ఇంతవరకూ జరిగిన ఆటలనూ, జట్టుల ఆట తీరునూ గమనిస్తూంటే నాకు ఏర్పడిన అభిప్రాయాన్ని వ్యక్తపరచటం తప్ప మరేమీ కాదు.

ఈసారి ఐపీఎల్ అంతగా ఆకర్షణీయంగా లేదు.

అనేక ఆటలు ఆరంభంలోనే గెలుపెవరిదో అర్ధమయిపోయేట్టే వున్నాయి. ఏవో కొన్ని ఆటలలో చివరి బంతివరకూ ఆట సాగింది. చివరి ఓవర్లో డక్కన్ చార్జర్లు 21 పరుగులు చేసి నెగ్గటమూ, ఒక పరుగుచేయలేక ముంబాయివారు మూడు వికెట్లు కోల్పోయి వోడటమూ, రాయల్ చాలెంజర్ల తరఫున హటాత్తుగా పాండే కళ్ళు తెరచి బాటు వూపటమూ లాంటి అప్పుడప్పుడూ మెరిసిన మెరుపులుతప్ప ఐపీఎల్ లో ఉద్విఙ్నతా, ఉత్సాహాలు కొరవడ్డాయి.

ఇలా సాగుతూ సాగుతూ చివరి నిర్ణయాత్మకమయిన ఆట వరకూ వచ్చేశాము.

ఆరంభంలో బాగా ఆడిన డిల్లీ వారు చివరలో చతికిల పడ్డారు. డిల్లీవారికి ప్రధానంగా సెహవాగ్, గంభీర్ల వీర విహారం ప్రాణం. ఈసారి అది కుదరలేదు. ఇతరులు ఆదుకుంటూ వచ్చారుకానీ, అసలయిన ఆట వచ్చేస్రికి అందరూ అలసిపోయారు. ఆరంభంలో మెక్ గ్రాత్ ను ఆడించకపోతే అదో స్ట్రాటెజీ అనిపించింది. కానీ, సెమీ ఫైనల్ లో గిల్‌క్రిస్ట్, సిమ్మండ్స్ లాంటి ఆటగాళ్ళతో కీలకమయిన ఆట ఆడేటప్పుడయినా మెక్ గ్రాత్ ను ఆడించాల్సింది. పరుగుల వరదకు అడ్డుకట్ట వేయటంలో ఆయన సిద్ధహస్తుడు. ఎందుకో డిల్లీవారు ఆయనను వెంట తిప్పుకునేందుకే ఇష్టపడ్డారు.

ముంబాయివారు కూడా, సనత్, సచిన్ ల పైనే అధికంగా ఆధారపడ్డారు. వారి వైఫల్యం, జట్టు పరాజయంగా మారింది. కానీ, కొన్ని కీలకమయిన ఆటల్లో గెలుపు అంచులనుంచి ఓటమి కోరలకు చిక్కారు. ఇది వారి ప్రణాళికా వైఫల్యాన్ని సూచిస్తుంది.

నిరుటి విజేతలు, రాజస్థాన్ రాయల్స్ ఈసారి మొదటి నుంచీ అటూ ఇటూ గానే ఆడుతున్నారు. గ్రేం స్మిత్ సరిగా ఆడలేక పోవటం, అస్నోద్కర్ వంటి యువ ఆటగాళ్లు మెరవలేకపోవటంతో పాటు, యూసుఫ్ పఠాన్ అప్పుడప్పుడే బాగా ఆడటం వారిని దెబ్బతీసింది.

పంజాబ్ కింగులుకూడా కీలకమయిన ఆటగాళ్ళ పసలేని ఆటవల్ల దెబ్బతిన్నారు. సంగక్కార, మాహెలాలు ఆడినప్పుడు గెలుపు, ఇతర సమయాల్లో ఓటమి. యువి పాపం బంతిని కొట్టటంలో కన్నా విసరటంలోనే రాణించాడీసారి. అందుకే హాట్ ట్రిక్ తీసి కూడా ఆట ఓడిపోవాల్సివచ్చింది.

బెంగాల్ రైడర్లు పాపం. వారికి వచ్చే ఐపీఎల్ కన్నా మంచి కోచ్, కెప్టేన్లతో సహా మంచి యజమాని దొరుకుతాడని ఆశిద్దాం.

చెన్నై ఆటగాళ్ళుకూడా హేడెన్, రైనాల పైనే అధికంగా ఆధారపడ్డారు. వారు రాణిస్తే జట్టు విజయం సాధిస్తుంది. లేకపోతే అంతా దైవాధీనం. ఎందుకో ధోనీ ఈసారి ఎప్పటిలాగా అడుతూ పాడుతూన్నట్టు కనబడలేదు. ఉద్విఙ్నతలూ, చిరాకులు కనిపించాయి. బహుషా ప్రేమలో పడ్డాడేమో! లేక ఆడీ ఆడీ గెలిచీ గెలిచీ విసుగొస్తోందేమో.

డక్కన్ చార్జర్లుకూడా గిల్‌క్రిస్ట్, రోహిత్ లపైన అధికంగా ఆధారపడుతూన్నారు. గిల్‌క్రిస్ట్ అధ్భుతమయిన ఆటగాడు. కానీ ప్రతిసారీ పరుగులు చేయలేడు. రోహిత్ శర్మ ఎప్పుడు పిడుగులు కురిపిస్తాడో ఎప్పుడు తుస్సుమంటాడో తెలియదు. సిమ్మండ్స్ ఆడతాడు. అవసరమయితే ఒక్కడే జట్టును గెలిపించగలడు కూడా. ఈసారి ఇంకా గిబ్స్ నిద్రలేచినట్టులేడు. గిబ్స్ కనక కొట్టటం ఆరంభిస్తే బంతి రాకెట్ లేకుండా చంద్రమండలం చేరుతుంది. ప్రత్యర్ధికి తాను ఎన్నో నరకంలో వున్నాడో తెలియదు. గిల్ క్రిస్ట్ కొదుతూంటే అందంగా వుంటుంది. గిబ్స్ బాదుడు నరకమే.  కానీ ఈయన ఎందుకో ఉదాసీనంగా ఆడుతున్నాడు.

బాంగళోరు ఆటగాళ్ళు ఎంత దిగజారాలో అన్ని లోతులకు దిగజారి ఒక్కో మెట్టే ఎక్కివస్తూ పైకి చేరుకున్నారు. ఇతర జట్లతో పోలిస్తే, బాంగళోర్ జట్టులోనే స్థానిక యువ ఆటగాళ్ళు తమ శక్తిని సరిగా ప్రదర్శించలేదు. అవకాశాలను వినియోగించుకోలేదు. కాలిస్, టైలొర్, ఉథప్పా లాంటి ఆటగాళ్ళున్నా ఆరంభంలో ఎవ్వరూ సరిగ్గా ఆడలేదు. ఉథప్పా ఆట ఎక్సయిటింగా వుంటుంది. కానీ ఎప్పుడోతప్ప ఈయన కుదురుగా ఆడడు. ఎప్పుడూ వెళ్ళి విశ్రాంతి తీసుకోవటానికే చూస్తాడు. ఇంతకాలం బాంగళోరు జట్టుకు సరయిన ఆరంభ ఆటగాళ్ళు లేనిలోతు తీవ్రంగా వుండేది. ద్రావిడ్ ఓపెనర్ గా వస్తే, అతడవుటయితే జట్టులో ఆడేఅ ఒక్క ఆటగాడూ అవుటయిపోయేవాడు. జట్తు పని అయిపోయేది.

ద్రావిడ్ గొప్ప ఆటగాడు. అతడికి రావాల్సిన గుర్తిపు రాలేదు. అతడి ఆట గురించి అనేక అపప్రధలూ, అపోహలూ ప్రచారంలో వున్నాయి. అందరిలాగా అతడు మాటకాడు కాడు. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడు. ఆకట్టుకోవాలని ప్రయత్నించడు. ప్రేఖ్స్కులకోసం ఆడడు. జట్టుకోసం ఆడతాడు. మనవారికి ఇది అవసరంలేదు. ఈసారి ఐపీఎల్లో బంగళోరును ఆదుకుంటూవస్తున్నదీ ద్రావిడే.

అయితే, కాలిస్ సరిగా ఆడటంలేదని అతడి బదులు కుంబ్లేని కెప్టెన్ చేయటం బెంగళోరు జట్టుకు -ipl-1లాభించింది. క్రిందనున్నవాడు వెళ్తే పైకే అన్నట్టు బెంగళోరు వారు విజయాలు సాధించటం ఆరంభించారు. కాలిస్ ఆడటం మొదలుపెట్టాడు. టైలర్ వీర విహారం ఆరంభించాడు. విరాట్ కోహ్లీకి ఆడకతప్పలేదు. ఈలోగా మనిష్ పాండే తెరపైకి వచ్చాడు.

నిన్న చూశాను మనీష్ పాండే ఆట. అతని టైమింగ్ ఎంత గొప్పగా వుందంటే నా కళ్లను నేనే నమ్మలేక పోయాను. ఇన్నాళ్ళూ ఏమూల దాగేడీ అబ్బాయి అనిపించింది. పళ్ళు పట పట లాడిస్తూ బాటు వూపే ప్రసక్తే లేదు. అన్నీ నేలమీదనుంచి బౌండరీకి పరుగెత్తే షాట్లే. బంతిని లేపి కొట్టినా ఫీల్డర్లు లేని స్థలంలోనే. ఆధునిక ద్రావిడ్ లా అనిపించాడు. అతనోవైపు ఆడుతూంటే మరో వైపు ద్రావిడ్ తన రీతిలో ఆడుతూంటే బెంగళోరు జట్టుకేమీ ఢోకా లేదనిపించింది. వీరిద్దరూ అవుటయినా ఇంకా విరాట్, బౌచర్‌లు వున్నారు. బౌచర్ ఆటలను ముగించటంలో పేరున్నవాడు. ఉథప్పాను కూడా ముందు పంపేకన్నా చివరలో పంపితేనే రాణిస్తాడు.

ఇవన్నీ చూస్తూంటే ఈసారి ఐపీఎల్ బెంగళోరు వారిదే అనిపిస్తోంది.

డెక్కన్ చార్జర్లకన్నా బెంగళోరు శక్తివంతమయిన జట్టులా ఎదుగుతోంది.

గిల్లి అవుటయితే, రోహిత్ అవుటయితే డెక్కన్ చార్జర్లు కళవళ పడతారు.

ipl-3బెంగళోరు వారికి అందరూ అవుటవటం అలవాటే. నిలిచి ఆడటం వారికి అద్భుతం. ప్రస్తుతం. కాలిస్, మనీష్ పాండేలు మంచి ఫాంలో వున్నారు. ద్రావిడ్ బాటింగ్ కు కుదురునిస్తాడు. టైలర్, బౌచర్, ఉథప్పాలు బంతులను బౌండరీ దాటిస్తారు. అందుకే, కుంబ్లే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాడు. వీరు మూడు నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాలు సాధిస్తున్నారు. కాబట్టి దక్కన్ చార్జర్లు గెలవాలని వున్నా, బెంగళోరు వారే గెలుస్తారని అనిపిస్తోంది.

ముఖ్యంగా మనీష్ పాండే లాంటి యువ ఆటగాడు, ద్రావిడ్ లాంటి అనుభవఙ్నుడు, కాలిస్, టైలర్, బౌచర్ లలాంటి ఆటగాళ్ళున్న బెంగళోరు జట్టు, మళ్ళే వారికి గతం గుర్తొచ్చి ఓడటంలోనే మజా వుందనిపిస్తే తప్ప, తప్పకుండా గెలుస్తుందనిపిస్తుంది.

ఐపీఎల్ ప్రధానంగా బాటుగాళ్ళ ఆట. బంతులు విసిరేవారికన్నా బంతులను కొట్టే వార్రే ఆట ఫలితాన్ని అధికంగా నిర్ణయిస్తారు. కాబట్టి బంతిగాళ్ళకన్నా బాటుగాళ్ళ గురించే ఎక్కువగా చర్చించాల్సివుంటుంది.

20-20 ఆటలలో ఫీల్డింగ్ అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. దెక్కన్ చార్జర్లకన్నా బెంగళోరు వారు ఫీల్డింగ్ లోనూ పట్టుదల చూపుతున్నారు.

గెలవాలన్న పట్తుదల బెంగళోరు వారిలో కనిపించినంతగా డక్కన్ వారిలో కనబడటం లేదు. కాబట్టి, ipl-4కాస్త అదృష్టం తోడయితే, బెంగళోరువారే ఈసారి ఐపీఎల్ విజేతలవుతారని నా అభిప్రాయం.(ఈ అభిప్రాయాం ఏర్పడటంలో ద్రావిడ్, కుంబ్లే, కాలిస్ లంటే నాకున్న ప్రత్యేక ఇష్టమూ, మనీష్ పాండే అంటే కొత్తగా ఏర్పడుతున్న ఇష్టమూ తోడ్పడివుంటాయి.)

 ipl-2iplipl

Enter Your Mail Address

May 24, 2009 ·  · 2 Comments
Posted in: క్రికెట్-క్రికెట్

2 Responses

  1. నాగప్రసాద్ - May 24, 2009

    ఈ సారి ఖచ్చితంగా డెక్కన్ ఛార్జర్సే గెలుస్తారు. ఎందుకంటే, IPL కన్నా ముందు జరిగిన ICL లో ఇలానే జరిగింది. మొదట జరిగిన ICL లో హైదరాబాదు జట్టు అట్టడుగున నిలిచింది. రెండవ సారి జరిగిన ICL లో కప్పు గెలిచింది. బహుశా ఇప్పుడు IPL లో కూడా అదే జరుగుతుందేమో. :)

  2. pappu - May 24, 2009

    మొదటగా గిబ్స్ గురించి మీతో వంద శాతం ఏకీభవిస్తాను.అతను ఆడుతుంటే ప్రత్యర్ధికి రౌరవాది నరకాలే కనిపిస్తాయి.ఆట ఈక్షణంలోనే అయిపోతే బాగుండును అనుకుంటారు ప్రత్యర్ధి కేప్టెన్ తో సహా ఆటగాళ్ళందరూ.అదీ అతని ప్రత్యేకత.ఫైనల్లో ఆ విజృంభణ చూపిస్తాడని ఆశిస్తున్నా.అందువల్ల వేరే ఎవరు గెలుస్తారో చెప్పఖర్లేదనుకుంటా.దానికి తోడు “గిల్లి” ట్రాక్ మీదకి వచ్చేసాడు.అందువల్ల ఖచ్చితంగా డెక్కన్ చార్జర్సే గెలుస్తారు(బెంగళూర్ రోయల్ చాలంజర్స్ వాళు గెలవాలని ఉన్నా).
    పాండే రూపంలో ఒక మంచి గొప్ప ఆటగాడు దొరికాడు బెంగళూర్ కి,మనకి కూడా.

Leave a Reply