నేను చదివిన మంచిపుస్తకం- 4-కొనసాగింపు

1924-48 నడుమ,కాళీపట్ణం రామారావు గారు,23 కథలు రాశారు.1949-55 నడుమ 12 కథలు రచించారు.1956-67లలో,6 కథలు రచించారు.యఙ్నం ఈ ఆరు కథలలోనిదే!
ఇదే పుస్తకంలో,”కథ” అనే వ్యాసంలో,రామారావు గారు కథకు నిర్వచనం ఇచ్చారు.వృత్తాంతం,కథ కాదు అని తీర్మానించారు.బొమ్మకు,చిత్రానికి వుండే తేడా,కథకూ,వృత్తాంతానికీ వుంటాయని అన్నారు.వౄత్తాంతం ఎప్పుడు కథ అవుతుందంటే,”అంతర్గర్భిత విశేషాన్ని    వ్యక్తీకరించే వృత్తాంతమే కథ  కాగలదు.వ్యక్తీకరించటానికి ఏ విశేషమూ లేని  వృత్తాంతం ఒత్తి వృత్తాంతంగానే మిగిలిపోతుంది”.
మరో వ్యాసంలో,”వాస్తవాన్ని చెప్పగల రచనైనా అది హృదయాన్ని స్పృశించే వృత్తాంతం కాకుంటే కథ కాదు”,అన్నారు.
మొదటి నిర్వచనంతో సమస్య లేదు కానీ,రెండవ నిర్వచనంతో సమస్య వస్తుంది.
హృదయాన్ని స్పృశించటాన్ని ఎలా కొలుస్తాం?
 ఇంతకీ ఎవరి హృదయాన్ని స్పృశించాలి?
 పాఠకుల హృదయాలు అనటం తేలిక.కానీ ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఏకీభవించటం కష్టం.అటువంటిది,ఒక కథ విషయంలో ఎంత మంది అభిప్రాయాలను సేకరిస్తాం?
కాబట్టి,మనం విమర్శకుల పయిన ఆధార పడాల్సి వుంటుంది.విమర్శకులు నిష్పక్షపాతంగా విమర్శించేవారయితే సమస్య లేదు.వాళ్ళు రంగుటద్దాలు తగిలించుకుంటే సమస్య వస్తుంది.అటువంటప్పుడు,ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించి అధిక సంఖ్యాకులందామా?నిజం నంబర్లలో వుండదు అన్న తత్వవేత్త మాట విందామా?ఒక వేళ,ఆ వృత్తాంతం నా హృదయాన్ని కదిలించలేక పోతే,నేను కథ కాదంటే ఒప్పుకుంటారా?
నీ ఒక్కడికి నచ్చకుంటే నష్టం లేదు,పదిమందికి నచ్చితే చాలు,అంటే, కథకు సార్వజనీనమయిన నిర్వచనం ఇవ్వటం లో మనం విఫలమయినట్టే అవుతుంది.
కాళీపట్నం రామారావు గారి ఆరంభ రచనల విషయంలో నాకు కలిగిన మీమాంస ఇది.
అయితే,కాదెవరూ విమర్శకనర్హం అంటుంది మన సాంప్రదాయం.భగవద్గీత లో శ్రీ కృష్ణుడే అర్జునిడితో,అర్జునుడి బుద్ధికి విరుద్ధంగా తోచే మాట అంటే,అర్జునుడు అతడిని నిలదీస్తాడు.సంతృప్తి కరమయిన వివరణ ఇస్తే కానీ వదలడు.అంటే,భగవంతుడి నయినా ప్రశ్నించటం మన సాంప్రదాయమన్నమాట.ఒక వేళ,తర్కం ద్వారా నా పొరపాటు గ్రహించేట్టు ఏవరయినా చేస్తే,కృతఙతలు తెలియచేసుకుని,నా అభిప్రాయం మార్చుకుంటాను. అంతే కానీ నేను నిజమనుకున్న దాన్ని చెప్పే హక్కును మాత్రం ప్రశ్నించకూడదు.”నీతో ఏకీభవించకున్నా అభిప్రాయం వ్యక్త పరిచే నీ హక్కును నేను మన్నిస్తాను” అన్న తత్త్వవేత్త మాటను మననం చేసుకుంటూ అడుగు ముందుకు వేద్దాము.
రచనలను సంవత్సరం ప్రకారం వర్గీకరించినా,కథలను,స్కెచ్ లనుంచి వేరు చేయక పోవటంతో,కాస్త తిక మక కలుగుతుంది.స్కెచ్ లను కథలని భ్రమ పడతాం.కథలను స్కెచ్ లను కుంటాం.అయితే,ఆరంభ రచనలలో,మనకు రామారావు గారు తన చుట్టూ వున్న సమాజాన్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం కనిపిస్తుంది.మనుషులను గమనిస్తూ వారి మనస్తత్వాలను అంచనా వేయాలన్న తపన కనిపిస్తుంది.ఈ రచనలు భవిష్యత్తులో ఆయన చేయబోయే అద్భుతమయిన కథా రచనకు  తయారీ అనిపిస్తుంది.
అయితే,కథలలో ఆ కాలంలో ప్రచారంలో వున్న పాపులర్ ఆలోచనలను ప్రదర్శించటం కనిపిస్తుంది.సాధారణంగా,రచయితలు కొత్తల్లో ఎటువంటి కథలు సులభంగా ప్రచురితమవుతాయో చూసి అలాంటి కథలు రాస్తారు.ప్రాచుర్యంలో వున్న భావాలనే  ప్రకటిస్తారు.ఆరంభంలో కాళీపత్ణం రామారావుగారు ఇందుకు భిన్నం కాదని ఆయన ఆరంభ రచనలు నిరూపిస్తాయి.
భార్యను వేధించే భర్తలూ,పరాయి అమ్మాయిని ఆకలిగా చూసే పురుషులూ,పెళ్ళి చూపులను వ్యతిరేకించే యువతులూ,ఇంట్లో పడుండటాన్ని వ్యతిరకించే యువతులూ రామారావు గారి కథల్లో కనిపిస్తారు.ఒక రకంగా చూస్తే,భాషపయిన పట్టు,సరళమయిన శైలీ,భావ వ్యక్తీకరణలో లాలిత్యం వున్నా ఎటువంటి ప్రత్యేకత లేక ఆ కాలం లో వచ్చిన అనేక రచనలలాంటివే అనిపిస్తాయి తొలి రచనలు.
అవివాహితగానే వుండిపోతా కానీ….. అనే రచనలో 18ఏళ్ళ పిల్ల బలహీనుడు,పిరికిపంద,దరిదృడు,లోభి,పురుగు వంటి విశేషణాలతో తెలియని పురుషులందరినీ వర్ణించి,పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకుంటుంది.ఈ కథ చాలు,రామారావు గారు ఆ కాలంలో ప్రచారంలో వున్న ఆలోచనలనే ప్రదర్శించారు తప్ప తనదయిన ప్రత్యేక అలోచనా పద్ధతిని అప్పటికి ఇంకా ఏర్పాటు చేసుకోలేదని అర్ధమవటానికి. రచయితగా ఆయన తనని తాను గుర్తిస్తున్న సమయం ఇది.తన శక్తిని,సృజనాత్మకతనూ అర్ధం చేసుకుంటున్న సమయం అది.దానిపయిన పూర్తిగా నియత్రణ సాధించని తరుణం అది.
వెనుక చూపు కథలో రామారావు గారి మనసులో ఆకాలం లో జరుగుతున్న సంఘర్షణ స్వభావాన్ని గమనించే వీలు కలుగుతుంది.ఇందులో,తాను మారటాన్ని గుర్తించి రచయిత ఆశ్చర్యపోవటం కనిపిస్తుంది.తనను ఓ పాత్రలో ఆరోపించి ప్రదర్శించటం రచయితలంతా చేసేదే!
1949 నుంచీ రామారావు గారి రచనలలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.ఈ కథల గురించి మరోసారి.

Enter Your Mail Address

April 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. ఫణి - April 23, 2008

  నేను నిన్ననే యాదృచ్చికంగా కాళీపట్నం రామారావు గారి “నో రూమ్” చదివాను; ఇవాళ మీ వ్యాసం తటస్థించింది.

  ఆ కథా వస్తువు ఇది: ఒక మద్యతరగతి వివాహిత యువకుడు తన ఇరుకు ఇంటిలో కాకుండా, విశాలమైన ఆవరణలో ఒకసారి తన భార్యతో శృంగారాన్ని అనుభవించాలని ఒక శెలవు రోజు ఆమెను తీసుకొని లాడ్జీకి వస్తాడు. [ఈ సన్నివేశంతో కథ ప్రారంభమౌతుంది.] లాడ్జీ కీపరు వ్యభిచారాన్ని శంకించి “నో రూమ్” అని చెప్పి బయటకు తరిమేస్తాడు. వాళ్ళు వెళ్ళి పోతారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ముసలి వాచ్‌మన్ వీళ్ళ పరిస్థితికి జాలి పడతాడు. ఇక్కడ నుండి కథనం ఆ జంటను వదిలేసి ఈ వాచ్‌మన్‌ను అనుసరిస్తుంది. వాచ్‌మన్ డ్యూటీ ముగించుకుని ఇంటికి రావడం; చనిపోయిన తన భార్య గురించి ఆలోచించడం [ఆమె కూడా — ఇలా ఒకే గది ఉన్న పూరిపాకలో, పిల్లలు లేస్తారేమోనన్న భయంతో, చాటు చాటుగా సాగే ఇరుకు శృంగారం కాకుండా — ఏదో ఒక రోజు విశాలమైన గదిలో విశాలమైన పక్క మీద శృంగారాన్ని కాంక్షిస్తుంది. కానీ కోరిక తీరకుండానే ఏదో జబ్బుతో మరణిస్తుంది.] తన భార్యను గురించిన ఈ ఆలోచనలతో నగరపు రోడ్లన్నీ పచార్లు చేస్తుంటాడు వాచ్‌మన్. ఒక సినిమా థియేటర్ దగ్గిర అతనికి ఇందాక లాడ్జీ కొచ్చిన యువకుడూ, అతని భార్యా కనిపిస్తారు. ఆ యువకుడు అప్పటికే తన శెలవు రోజు ప్లాన్లన్నీ ధ్వంసం అయిపోయిన అసంతృప్తితో ఉంటాడు: సినిమా థియేటర్‌కి వెళితే టికెట్లు దొరకవు; చివరకు, ముందు ఓ మంచి రెస్టారెంట్లో ప్లాన్ చేసుకొన్న డిన్నర్‌ని, రోడ్డు ప్రక్కన మురికి హోటల్ లో కానిచ్చేయాల్సి వస్తుంది. అతడు తన చుట్టూ ఉన్న సమాజపు నిర్దయపై కోపంతో ఊగి పోతుంటాడు. డబ్బున్నోళ్ళు లంజల్ని తీసుకొచ్చి స్టార్ హోటల్ ఏ.సీ రూంలలో కులికినా ఫర్వాలేదు కానీ తను ఒక్క రోజు తన భార్యతో సర్దాగా గడపటానికొస్తే ముష్టి లాడ్జీ వాడు కూడా రంకు అంటగడతాడా అన్నది అతని దుగ్ద. అతనీ కోపంలో ఉండగా, వీళ్ళకు ఏదో సహాయం చేయాలన్న మంచి బుద్దితో వీళ్ళను సమీపించిన వాచ్‌మన్, యువకుడు మరీ మొహం మాడ్చుకొని కనిపిస్తుండటంతో, ప్రక్కనున్న అతని భార్యను అనాలోచితంగా “మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతార”ని అడుగుతాడు. ఇది మండే ఇనుము మీద చివరి దెబ్బ. యువకుడు ఈ ముసలి వాచ్‌మన్ పై నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తాడు. థియేటర్ నుండి వెలుపలికి వస్తున్న జనం వాళ్ళిద్దర్నీ విడదీస్తారు. చివరకు, ఆలుమగలిరువురూ రిక్షా ఎక్కి వెళిపోగా, వాచ్‌మన్ తన గాయాలను తడుముకుంటూ పుట్‌పాత్ మీద కూలబడి పోతాడు. కథ ముగుస్తుంది.

  ఇలా సమాధానం లేని ప్రశ్నల్ని సమాజం మీద వదలి రెచ్చగొట్టే రచయితలంటే నాకు అసహ్యం (అది వాళ్ళ ఉద్దేశ్యమైనా కాక పోయినా).

  ఇపుడు ఇంత కథా సంక్షిప్తాన్నీ ఇక్కడ ప్రస్తావించిన కారణమేమంటే, నాకు ఈ కథ చాలా నచ్చింది. I don’t give a damn about what the writer is trying to say, but I do admire the way (the felicity, technique and what they call slight-of-hand) in which he is saying what he intended to say. The structure of the story is splendid. The way he built up the emotion is superb.

  మీరు పైన వ్యాసంలో అడిగిన ప్రశ్నలను ఈ “నో రూమ్” కు అన్వయిస్తే — ఈ కథ కచ్చితంగా నా “హృదయాన్ని స్పృశించలేదు.” కానీ ఈ కథను నేను మర్చిపోలేను. అందుకే ఎవరో అన్నారు “Heart is a rather stupid reader” అని. ఇదే నేను నమ్ముతాను. బహుశా దీని అర్థం — ఒక కథను జడ్జ్ చేయడంలో మనం ఈ “హృదయాన్ని” వదిలేసి (పాపం నిజానికది కేవలం నాలుగు కవాటాల్తో శరీరంలో రక్త పంపిణీకై నిర్దేశించబడిన అవయువం మాత్రమే), దానిపై ఈ అదనపు భారాలన్నీ మోపడం ఆపేసి, ఒక కథను జడ్జ్ చేయడానికి Mind పై ఆధారపడటం మంచిది.

  నా మట్టుకు నేను ఒక కథను తూచడానికి ఒకే ప్రమాణాన్ని వాడతాను: Enchantment. తెలుగులో “వశీకరణ” అని తర్జుమా చేసుకోవచ్చునేమో. ఏ కథైనా నన్ను వశీకరించే శక్తి ఉందంటే అది మంచి కథే (వశీకరించడం అంటే నా ఇంద్రియాలను కాదు; నా మేధను).

  కానీ నిజానికి ఇది కూడా vague term మాత్రమే. ఇది శాస్త్రీయ ప్రమాణం కాలేదు. ముఖ్యంగా మీరు ప్రస్తావించిన రెండో పాయింటు “విమర్శకుల పాత్ర” దగ్గిర కొచ్చేసరికి ఇది నిలబడదు. విమర్శకుడు ఈ enchantment ను ప్రమాణంగా తీసుకుని విమర్శకు పూనుకోవడం… I don’t think it would work. మరి ఒక కథను విమర్శకుడు ఏ ప్రమాణంతో సమీపించాలి? దాని విలువ ఎలా లెక్క గట్టాలి?

  దీనికి సమాధానం: విమర్శకుడికి తన రచనను subjectగా ఇవ్వడమే కాదు, ఆ విమర్శ ఏ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకోవాలో కూడా రచయితే నిర్దారిస్తాడు. నిజమైన విమర్శ తన ప్రమాణాల్ని ఎక్కడో, ఎప్పుడో, ఎవరో ప్రతిపాదిచిన బూజు పట్టిన సిద్థాంతాల్లోంచి ఏరుకోదు; తను విమర్శించదలిచిన గ్రంథంలోంచే ఏరుకుంటుంది. ఎలాగో చెప్తాను:

  ప్రతీ రచయితా తన రచనను కాగితంపై పెట్టకముందే దానికి సంబంధించిన ఒక అంతిమ రూపాన్ని, లేదా, ఆ అంతిమ రూపం కన్వే చేయాల్సిన emotionను తన మనసులో నిలుపుకుంటాడు; కథ ఎలా ఉండాలీ అన్న దానిపై ఒక ambitionను కలిగి ఉంటాడు. కథ పూర్తయ్యే సరికి అతను ఈ ambitionను చేరుకోవడంలో సఫలం అవ్వొచ్చు; విఫలం అవ్వొచ్చు. ఇక్కడ విమర్శకుడు చేయాల్సిందీ చేయగలిగిందీ ఏమిటంటే — రచయిత తన కల్పనకు కాగితంపై ఇచ్చిన తుది రూపు, కథ మొదలుపెట్టక మునుపు అతను దానికి నిర్దేశించిన లక్ష్యంతో సరిపోతుందా లేదా అన్నది లెక్క తేల్చడం. ఇంతే అతడు చేయగలిగింది. [ఒక రచయిత తన రచనకు ముందు ఏ లక్ష్యాన్ని నిర్దేశించాడో (ముఖ్యంగా ఆ రచన తుదిరూపులో ఆ లక్ష్యం సాకారం కానప్పుడు) విమర్శకుడికి ఎలా తెలుస్తుందీ అంటారా — మరి అక్కడే మామూలు పాఠకుడితో విమర్శకుడు వేరుపడేది.] ప్రతీ రచన తనదైన కొలతబద్దను విమర్శకుడికి అందిస్తుంది. దాంతోనే కొలవాలి. అంతే గానీ ఎప్పటిదో చెదలు పట్టిన కొలతబద్దని చేతపట్టి పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్న చందాన దాంతోనే అందర్నీ బాదేస్తుంటే అది సద్విమర్శ అనిపించుకోదు.

  ఉదాహరణకి కుందుర్తి ఆంజనేయులు “అమృతం కురిసిన రాత్రి”కి ముందుమాట రాస్తూ తిలక్ అనుభూతివాదాన్ని వ్యక్తివాదం అంటూ విమర్శిస్తాడు. అలాగే కేతు విశ్వనాథరెడ్డి “శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథల”కు రాసిన ముందుమాటలో శ్రీపాదవారి కథల్లో ప్యూడలిజాన్ని విమర్శిస్తాడు. మీరన్నారే రంగుటద్దాలని, నాకేతే వీళ్ళ ఈ ప్రయత్నాలు వర్ణాంధత్వం (హిమోఫీలియా) ఉన్నవాడు ఇంద్రధనుస్సుని వర్ణించబూనడంలా కనిపిస్తాయి. ఒక రచయిత తన రచనకు అసలు ఉద్దేశించని లక్ష్యాల్ని అవి లేవో అంటూ గగ్గోలు పెడితే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఇలాంటి ముందుమాటల్ని ఆయా పుస్తకాలకు దిష్ఠి తగలకుండా ముందు తగిలిస్తుంటే తప్ప వీటి ఉనికికి నాకు వేరే సబబైన కారణం కనిపించదు. విమర్శకు ప్రమాణాలు రచయిత రచయితకూ మారుతుంటాయన్నది నేనిక్కడ చెప్పదల్చుకున్నాను.

  మీరు “కాదెవరూ విమర్శ కనర్హం” అంటూ భవద్గీత వరకూ వెళ్ళనక్కర్లేదు. తెలుగులో కాస్త పేరొస్తే చాలు ప్రతీ రచయితా Literary messiah అయిపోతాడు — విమర్శకు అతీతుడు. అయితే ఇవి పత్రికలు కావుగా; మీకు నిజమనిపించింది చెప్పటానికి భయపడనక్కర్లేదు. అదే కదా బ్లాగుల సౌలభ్యం.

 2. Dinnela Kumar - April 24, 2008

  ఈ ఫణి గారి ఆవేశం చూస్తూ ఉంటే “తెలంగాణా” ఉద్యమ ప్రకాశకులు గుర్తుకొస్తున్నారు. తొలి దశలో కసి, ద్వేషం ఉన్నట్టు కనపడుతోంది. దేని మీద, అంటే ? నాకు నచ్చలేదు కాబట్టి, నేను వెతుక్కునేవి, నా భావజాలాన్ని సమర్ధించేవి, నా ఆవేశానికి ఆజ్యం పోసేవి – ఇలా చాలా రకాల కారణాలు చెప్పుకోవచ్చు అని నాకనిపిస్తుంది. ఇక సమాధానం లేని ప్రశ్నలను సమాజం మీద వదిలే రచయితలను అసహ్యించుకోవటం అనేది వస్తే చాలా మంది ప్రాచీన రచయితలను కూడా అసహ్యించుకోవలసిందే. ఎందుకో ఈపాటికే మీకు తెలిసి ఉండాలి అని అనుకుంటున్నాను. అయితే ఈ అరస విరస విప్లవ ఫణి వీరుడికి, ధోరణికి ఉద్యమానికి తేడా తెలిసినట్టు ఉంది అనుకోవట్లా..మాటల తూటాలు వదిలితే జనాల కంట్లో పడొచ్చు ఏమో అన్న ఒక Identity Crisis కనపడుతోంది నాకయితే. ఇష్టమయిన వాళ్ళను ఆకాశానికి ఎత్తెయ్యడం, భజన చెయ్యడం లేదా గిట్టని వాళ్ల మీద దుమ్మెత్తి పోయటం ఈ రకమయిన వ్యక్తుల్లో కనిపిస్తుంది. రసహీనం, అస్పష్టత, సంక్లిష్టతను కోరుకుంటాము అని అప్రస్తుత ప్రసంగాలు తరువాతి కామెంట్లలో వచ్చినా ఆశ్చర్యపోవక్ఖరలా….ఇదేలాగు ఉన్నదంటే “ఉదంకోపాఖ్యానం” చదివి “గోమయం తినటం ఏమిటి? కన్నంలోనుంచి వెళ్ళటం ఏమిటి? గుర్రం ఎక్కి చెవిలో ఊదటం ఏమిటి?” అని వేళాకోళం చేసినట్టు ఉంది. మరి ఈ భావ వ్యక్తీకరణ – భావవక్రీకరణా, భావ దాస్యమా, Identity Cirsis ఆ అన్నది పెద్దలే తేల్చాలి..

 3. ఫణి - April 25, 2008

  ఈయనెవరో నా వ్యాఖ్యలో దేనికో చాలా హర్ట్ అయినట్టున్నారు.

  బాస్, నేను కళాకారుడ్ని బట్టి కళను జడ్జ్ చేయను; కళను బట్టి కళాకారుడ్ని జడ్జ్ చేస్తాను. నేను పొగిడిన వాళ్ళతోనూ నాకు వ్యక్తిగత పరిచయం లేదు; తెగిడిన వాళ్ళతోనూ లేదు. మరి ఒకళ్ళు నచ్చి ఒకళ్ళు నచ్చకుండా ఎందుకు పోయారు? ఒకళ్ళను తిట్టి మరొకళ్ళను నెత్తి కెక్కించు కోవాల్సిన అవసరం నాకేమొచ్చింది? నిజంగా నా వ్యాఖ్యలో నేను ప్రధానంగా చేయదలచింది అదే అయితే, ఏ ప్రాతిపదిక మీద అలా చేసి ఉంటాను? ఆలోచించండి; కామన్‌సెన్స్ సరిపోతుంది.

  అయినా ఇలా Identity Crisis అంటూ సైకలాజికల్ చెత్త జోలికి పోకుండా, నా వ్యాఖ్యలో దేనికింత హర్ట్ అయ్యారో చెపితే, నేను మరింత సమగ్రమైన వివరణ ఇచ్చుకోగలను. That’s how it works.

  (“తొలి దశలో కసి, ద్వేషం ఉన్నట్టు కనపడుతుంది.”—అర్థం కాలా. ఏ “తొలి దశ”లో?)

  మురళీకృష్ణగారూ,

  మీ గత పోస్టులో కా.రా గారి పూర్తి రచనల సంకలనాన్ని ప్రస్తావించారు. అది ప్రస్తుతం ప్రచురణలో ఉందా? ఉంటే హైదరాబాద్‌లో లభ్యమౌతుందా? స్థలం, ధరల వివరాలు తెలిస్తే తెలియజేయండి.

 4. Chilakapati Srinivas - April 29, 2008

  @ఫణి

  “ఇలా సమాధానం లేని ప్రశ్నల్ని సమాజం మీద వదలి రెచ్చగొట్టే రచయితలంటే నాకు అసహ్యం ” అన్న వాక్యానికి కొంచెం వివరణ ఇవ్వగలరా? ‘నో రూం’ కథలో రచయిత లేవనెత్తిన ప్రశ్న ఏమిటి? అసలు రచయితలు ఎందుకు ప్రశ్నించరాదు? సమాధానం ఇచ్చి రెచ్చకొడితే ఫర్వాలేదా? అయినా ఏ రచన చదివి ఎవరు రెచ్చిపోయారు?

  ఇక అసలు విషయానికొస్తే స్థూలంగా మీరు చెప్పదలుచుకున్నది విమర్శకుడు రచయిత ఏం రాశాడు అని కాకుండా ఎలా రాశాడని మాత్రమే పట్టించుకోవాలని. అవునా?

  అన్నట్టు కారా గారి పూర్తి రచనల సంకలనం రచన శాయి గారి దగ్గర దొరుకుతుందనుకుంటాను.

Leave a Reply