హర్భజన్ చెయ్యి,శ్రీశాంత్ చెంప-యే దిల్ మాంగే మోర్

ఏదయినా రోజూ చూస్తూంటే విసుగు వస్తుంది.20-20 ఆటలు కూడా రెండు మూడు రోజులు ఆ సక్తిగా అనిపించినా రోజూ చూడాలంటే విసుగు వచ్చేస్తోంది.బౌలర్ ఉఫ్ఫు పఫ్ఫు అంటూ చేమటలు కక్కుతూ,ఆయాస పడుతూ,శక్తి నంతా కూదదీసుకుని బంతి విసిరితే,బాట్స్మన్ అలవోకగా బంతిని బౌండరీ దాటించటం,గాల్లోకి లేపి లేపి కొట్టటం ఎక్సయిటింగ్ అనిపించినా,రాను రాను రొటీన్ అయి చికాకు ఆరంభయింది.ఎంతసేపూ వీర బాదుడు,పరుగో పరుగూ…ఏదో అప్పుడప్పుడూ అయితే బావుంటుంది కానీ,ఇష్టమని రోజూ గారెలు తింటే అజీర్ణం ఖాయం.20-20 గతి అంతే అయింది.ఒక పక్క రొటీన్  వీర బాదుడు చూస్తూంటే బౌలర్లకీ నరక యాతన ఎందుకో అని వారి పయిన జాలి కలుగుతోంది. మరో వయిపు,అలుపు లేకుండా గెంతే వయిపు,ఈ కర్రతో,ఆ బంతిని కొట్టటానికి వీళ్ళకి లక్షలు,బదటానికి వాళ్ళకి లక్షలు,ఇదంతా చేయించే వాళ్ళకి కోట్లు,మనకి సమయం వ్యర్ధం,జేబుకు చిల్లు,అరుపులు కేకలతో గొంతు నొప్పి.చెవులు హోరు.
అయితే,సైమొండ్స్ ఆట ఉత్సాహం కలిగించింది.ఆ ఉత్సాహం తగ్గే లోగా,యూసుఫ్ పఠాన్ తూఫాను తల తిప్పేసింది.ఒకడు రాక్షసుడయితే,మరొకడు వాడి తాత. సంగక్కారా ఆట కళాకారుడి కళా ప్రదర్శన అనిపించింది.కానీ,సైమొండ్స్ ఆట చూసిన తరువాత యూసుఫ్ బాదుడు చూడ బుద్ధి కాలేదు.బౌలర్లు జుట్టు పీక్కుని,తలలు బాదుకుంటూ,నిరాశా నిస్పృహలతో కన్నీళ్ళు పెట్టుకుంటూంటే అసలీ ఆటలన్నీ మనలోని సాడిస్టుని సంతృప్తి పరుస్తాయేమోనన్న ఆలోచన కూడా వచ్చింది.
ఇంతలో హఠాత్తుగా ఆసక్తికరమయిన,రొటీన్ కు భిన్నమయిన సంఘటన జరిగింది!
బంతి బదులు హర్భజన్ చెయ్యి విసిరాడు.చేతినే బాటుగా చేసుకొని,శ్రీశాంత్ చెంపనే బంతి అనుకొని స్క్వేర్ డ్రైవ్ చేసాడు.దాంతో ఒక్కసారిగా మళ్ళీ ఆటమీద ఆసక్తి పెరిగింది.బహుశా భవిష్యత్తులో ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చి ఆకర్షించటానికి ఆట మధ్యలో తన బౌలింగ్లో సిక్సెర్ కొట్టిన ఆటగాడిని ఒక చెంపదెబ్బ కొట్టే వీలు బౌలెర్ కి ఇవ్వాలి.తనని వంద పరుగుల దగ్గర ఔట్ చేసినా,సున్న పరుగులకు రన్ ఔట్ చేసినా వాడిని బాటుతో ఒకటిచ్చుకునే వీలుండాలి.అంతా అయిన తరువాత,ఇద్దరు కప్తాన్ల చెంప దెబ్బల సెషను వుండాలి.వీలయితే కోచులు కూడా పాల్గొంటే మరీ మంచిది.అప్పుడు  అరువు అభినందన అమ్మాయిల అందాల బదులు ఆటకు అనుబంధంగా చెంపదెబ్బల ప్రహసనాలు వినోదాన్ని ఇస్తాయి.అది రొటీన్ అయ్యేలోగా ఇంకేదో దొరుకుతుంది.వినోదమే వ్యాపారానికి ప్రాణ వాయువు కదా!అందుకే ప్రస్తుతానికి ఇటువంటి చెంపదెబ్బల వినోదం ఇంకా కావాలి.
అన్నిటి కన్నా మజా ఆటగాళ్ళు తరువాత సమర్ధించుకోవటంలో వుంది.హర్భజన్ వల్ల మన దేశంలో అన్నలు తమ్ముళ్ళను కొడతారని ప్రపంచానికి తెలిసింది.ఆ దెబ్బలు తింటేకానీ తమ్ముళ్ళకు తాము గెలిచామని అర్ధంకాదు.కన్నీళ్ళు రావు.
కొసమెరుపుగా,ప్రెస్ కాంఫరెన్స్ లో హర్భజన్ క్రికెట్ గురించే మాట్లాడతానంటే నవ్వు ఆగలేదు.బహుషా చెంప చెయ్యి క్రికెట్ గురించే మాట్లాడతానంటే అందరూ అపార్ధం చేసుకున్నారేమో!ఏమో నా ఈ బ్లాగు చదివిన వారికి ఎవరికయినా భవిష్యత్తులో చెంప-చెయ్యి ఆటల పోటీ నిర్వహించాలనిపిస్తే,నాకే ఆలోచన పయిన కాపీ రైటు వుందని మరచిపోకండి.

Enter Your Mail Address

April 26, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్

Leave a Reply