నేను చదివిన మంచి పుస్తకం-మళ్ళీ నాలుగే!

ఏ రచయిత అయినా తన అనుభవాల ఆధారంగానే కథలను సృజిస్తాడు.ఎంత కల్పన జోడించినా,దానికి ఆధారం మాత్రం నిత్య జీవితంలోని అనుభూతి ఏదో వుంటుంది.అందుకే,తనలోకి చూసుకుంటూ,తన అనుభవాల విశ్లేశణ ద్వారా తనని తాను అర్ధంచేసుకుంటూ చేసే రచనలు చిరకాలం సజీవంగా వుంటాయి.రచయితను చిరంజీవిగా నిలుపుతాయి.అందుకే,ప్రతి రచయిత ఆరంభ కథలు నిజ జీవితంలోని అనుభవాల కాల్పనిక రూపాలే అవుతాయి.రచయితగా ఎదుగుతున్నా కొద్దీ ఆ కాల్పనిక శక్తి ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే నిజానుభవాలు సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయి.
కాళీపత్ణం గారి ఆరంభ కథలలో ఆయన అంతరంగం కనిపిస్తుంది.ఆయన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు,వాటికి ఆయన స్పందన,ఆయనలోని సంఘర్శణలు కథాంశాలుగా కనిపిస్తాయి.అందుకే ఆయన కథలు మధ్యతరగతి వారి జీవన చిత్రణలకు పరిమితమయ్యాయి.1949 నుంచీ ఆయనకు రకరకాల వ్యక్తులతో పరిచయమయింది.అనేక రకాల భావ జాలాలు ఆయన దృష్టికి వచ్చాయి.ఆయన పల్లె వాతావరణం నుంచి పట్టణానికి వచ్చారని,బెరుకు బెరుకుగా రచనలు చేసారని మనకు ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది.అయితే,రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి ప్రభావం ఆయన పయిన అధికంగా పడింది.కానీ ఆలోచనలపయిన పడిన ప్రభావం కథల రూపంలో ఆచరణలోనికి వచ్చే సరికి సమయం పట్టింది.అందుకే,1949-55 నడుమ ఆయన కథలు మధ్య తరగతి జీవితాలకు సంబంధించినవే.అంటే,ఆయన అనుభవాలకు ప్రతిరూపాలే.అయితే,ఈ కథలలో అక్కడక్కడా,వామ పక్షాల భావాల ప్రభావం కనిపిస్తుంది.ఇది రచయితగా,రామారావు గారిలో సంధి దశను సూచిస్తుంది.
ఆ కాలంలో చాల మందిలో కనిపించిన ఘర్శణ రామారావు గారిలోనూ కనిపిస్తుంది.సాంప్రదాయం ఉగ్గు పాలతో నేర్చుకున్నారు.ఎదుగుతున్న కొద్దీ,తాము నేర్చుకున్న దానికీ,బయట అనుభవిస్తున్న దానికీ తేడా కనిపిస్తుంది.అగ్రవర్ణానికి చెందిన వాడవటం గర్వకారణం కాక సిగ్గు అయింది.తన సాంప్రదాయాన్ని,వారసత్వాన్ని కాదంటే కానీ సమాజంలో అమోదం దొరకటం కష్టం.దాంతో అనేకులు వ్యక్తి గత అభిప్రాయాలను పక్కన పెట్టి,సంఘం కోసం ఆధునిక అభ్యుదయ భావాలను స్వీకరించారు.సాంప్రదాయానీ,పద్ధతులను చులకన చేసారు.దోషాలను ఎత్తి చూపించి తమ అభివృద్ధి ధోరణిని చాటుకున్నారు.అసలు రహస్యం,నిరవాకాలు,కీర్తికాముడు,పెంపకపు మమకారం,జయప్రద జీవనం,రాగమయి,పలాయితుడు తదితర కథలన్నీ ఈ కోవకు చెందినవే.ఈ కథలు అన్నీ మామూలు కథలు.రామారావు గారి కథలు కాకపొతే పూర్తిగా చదవము.ఈ కథలలో జీవన చిత్రణ వున్నా ఎటువంటి ప్రత్యేకత లేని కథలివి.చిరకాలం గుర్తుంచుకునే అంశం ఒక్కటే కనబడదు.
గతంలోని కథలతో పోలిస్తే,నిడివి విశయంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.అంతకు ముందు,ఒక ఆలోచనను కథగా రాసిన రచయిత నిదానంగా కథను అభివృద్ధి చేయటం,పాత్రలను తీర్చి దిద్దటం కనిపిస్తుంది.అయితే.కథలో ఉద్విగ్నతను సృజించటం కనబడదు.ఒక నది,మైదానంలో మంద్రంగా ప్రవహించినట్టు,నింపాదిగా సాగుతాయి కథలు.రావి శాస్త్రి గారి ప్రభావం రామారావు గారి రచనా శైలి పయిన సులభంగా కనిపిస్తుంది.వ్యక్తుల బలహీనతలను చూసి నవ్వుకోవటం,మంచి తనన్ని బలహీనతగా చూపటం ఈ  కథలలో చూడవచ్చు.
సేనాపతి వీరన్న అనే కథలో రామారావు గారు చేసిన వ్యాఖ్య గమనార్హం
“మనం సాధారణంగా గ్రామాలూ,గ్రామీణులు స్వర్గ ఖండాలు,దేవతలూగా అభివర్ణింపబడటం చూస్తాం”అంటూ పల్లెలు ఏ విషయంలో పట్టణానికి భిన్నంకావని,అన్ని రకాల మోసాలుంటాయని రాస్తారు.చివర్లో”కాకపోతే,అఙానం అమాయకత్వం అనే ముసుగుల్లో మన పెద్దలు వానిని దాచి చూపొతుంటారు”.అంటారు.అంటే రామారావు గారికి తెలుసన్నమాట,పల్లె ప్రజలు అంత అమాయకులు కారని.ఇది మనకు ఆయన తరువాత కథలను విశ్లేశించటంలో వుపయోగ పడుతుంది.
1924-48 నడుమ రామారావుగారు కథలు రాయటం,తన భావాలను కథ రూపంలో ప్రకటించటం కనిపిస్తే,1949-55 నడుమ,రామారావు గారి అభిప్రాయాలు మారటం,ఆయన రచనా శైలి ప్రత్యేకంగా ఏర్పడటం గమనించవచ్చు.అతని రచనా సంవిధానంపయిన రావి శాస్త్రి ప్రభావం చూడవచ్చు.ఇందువల్ల కథల నిడివి పెరగటం,సన్నివేశాలను విపులంగా సృజించటం కనిపిస్తుంది.
ఇప్పుడు మనం రచయితగా రామారావు గారి జీవితంలో అత్యంత ప్రాధాన్యం వహించిన 1956-67 కాలంలో అడుగు పెడతాము.ఈ కాలంలోనే ఆయన యఙం  కథ రచించారు.ఇది వచ్చేసారి.

Enter Your Mail Address

April 30, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

  1. chavakiran - April 30, 2008

    chakkani rivyU

  2. tethulika - April 30, 2008

    బాగుందండీ మీ పరిశీలనాత్మక వ్యాసం.
    వ్యక్తి గత అభిప్రాయాలను పక్కన పెట్టి,సంఘం కోసం ఆధునిక అభ్యుదయ భావాలను తమరచనలలో చొప్పించడం — అన్నమాట రామారావుగారికీ, రావిశాస్త్రిగారికీ కూడా వర్తిస్తుందనుకుంటాను. సాహిత్యం సామాజికదృక్పథాన్ని మార్చడానికి మాత్రమే పనికిరావాలన్న సిద్దాంతంతో అది ప్రారంభం అయిందనిపిస్తుంది. నాది పొరపాటు కావచ్చులెండి.
    యజ్ఞంమీద మీఅభిప్రాయాలకోసం ఎదురు చూస్తూ..

Leave a Reply