వార్త లో సైన్స్ ఫిక్షన్ కథలు, సాక్షిలో శ్రీకృష్ణదేవరాయలు-సమీక్ష.

ఈనాటి వార్త లో సైన్స్ ఫిక్షన్ కథలు, సాక్షిలో శ్రీకృష్ణదేవరాయలు, సమీక్షలు ప్రచురితమయ్యాయి.
సాక్షిలో సమీక్ష శ్రీకృష్ణదేవరాయలు సమీక్షలన్నిటిలోకీ నాకు నచ్చింది. సమీక్షకుడు నిర్మొహమాటంగా తన పరిశీలనను వ్యక్తపరచారు. ధన్యవాదాలు.
వార్తలో సైన్స్ ఫిక్షన్ కథలపై వచ్చిన సమీక్ష కూడా అతి చక్కని సమీక్ష. ఇంతవరకూ, నా ఏ కథనూ, ఎవరూ, ఇంతగా సమీక్షించలేదు. విహారి గారికి ధన్యవాదాలు.

ఈ రెండు పుస్తకాలూ, www.kinige.com లోనూ, నవోదయా పుస్తకాల దుకాణంలోనూ లభ్యమవుతున్నాయి.

 

September 11, 2011 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , ,  · Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-27

ఈమధ్య అటు ఆఫీసులో ఇటు ఇంట్లో ఎంత బిజీగా వుంటున్నానంటే సరిగ్గా కంప్యూటర్ ముందు కూచునే తీరిక వుండటంలేదు. ఈవారం నా రచనల వివరాలు చెప్పేముందు కొన్ని వేరే విషయాలు టూకీగా చెప్తాను. ఈమధ్య వనితా టీవీలో ప్రతి శుక్రవారం రాత్రి 10-30గం లకు వచ్చే వెండితెర వెన్నల కార్యక్రమానికి స్క్రిప్టు రాస్తున్నాను. విజువల్స్ విషయంలో సూచనలు ఇస్తున్నాను. గత మూడువారాలుగా కార్యక్రమం మెరుగయిందని ఫీడ్ బాక్ వస్తోంది. సమయం కాస్త ఇబ్బంది కరంగా వున్నా ఓపిక చేసుకుని చూసి మీ సూచనలు తెలియపరచండి. ఇంతవరకూ శ్రీ 420, సత్యజిత్ రాయ్ దేవి, జోధా అక్బర్ సినిమాలను పరిచయం చేశాను. నిన్న చేగువేరా గురించి స్టూడియో ఎన్ లో ఒక చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాను. మైకెల్ జాక్సన్ పుస్తకమేకాదు, అక్షరాంజలి, రియల్ స్టోరీ, తీవ్రవాదం పుస్తకాలు బాగావున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మకాలు కూడా ప్రోత్సాహకరంగానే వున్నాయి. ఈసారి వార్త ఆదివారం అనుబంధంలో దాదాఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే పైన కవర్ స్టోరీ వుంటుంది. హిందీ గాయకుడిపై కవర్స్టోరీ తెలుగు పత్రికలు చేయటం నాకు తెలిసి చాలా అరుదు. ఆంధ్రప్రభలో సగటుమనిషి స్వగతం వుంటుంది. వార్త బ్లాగ్ స్పాట్ శీర్షికలో పర్యావరణ బ్లాగు climate progress నడుపుతున్న జో రోం బ్లాగు పరిచయం వుంటుంది. ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయ విశ్లేషణ వుంటుంది. గురువారం చిత్రప్రభలో నవలలనుంచి సినిమాల రూపాతరం చర్చ సాగుతుంది. ఈనెల ఈభూమిలో గాయకుడు ముకేష్ పరిచయం వుంటుంది. పత్రిక మార్కెట్ లో వుంది. కౌముదిలో కథాసాగరమథనం వుంటుంది. ఈవారం నవ్య వార పత్రికలో నేను రాసిన హారర్ స్టోరీ ఊర్మిళ ప్రచురితమయింది. చదివి మీ అభిప్రాయం చెప్పండి. సైన్స్ ఫిక్షన్ కథలు, పవర్ పాలిటిక్స్ శీర్షికన భారతీయ రాజకీయ సమస్యల విశ్లేషణల సంకలనాలు తయారవుతున్నాయి. త్వరలో విడుదలవుతాయి. హాసం ప్రచురణల వారు ముద్రిస్తున్న సాహిర్ పాటల విశ్లేషణ ( రసమయి సీరియల్) తయారీ చివరి దశలో వుందని తెలిసింది. వచ్చే హాసం సమావేశానికి పుస్తకం విడుదల కావచ్చు. ఈసారి హాసం సమావేశాంలో షమ్మీ కపూర్ పాటల గీత మాలిక తుం ముఝే యూన్ భులానపావోగే కార్యక్రమం సమర్పిస్తున్నాను. దానికి తయారీలోవున్నాము. ఇవీ ఈవారం నా రచనల వివరాలు. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

October 10, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , , , , ,  · Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-24

ఈవారం వార్తలో బ్లాగ్ స్పాట్ శ్ర్ర్షికన ఇంగ్లాండ్ ప్రధాని గార్డన్ బ్రౌన్ బ్లాగ్ పరిచయం వుంటుంది.

ఆంధ్రప్రభలో సగటు మనిషికి ఓ సందేహం వస్తుంది. గుడికి వెళ్ళటాన్ని తప్పుగా, చులకనగా చూస్తారెందుకన్నది సగటుమనిషి సందేహం.ఇప్పుడు ఆంధ్రప్రభను నెట్ లో కూ డా చూడవచ్చు. www.andhraprabha.com

ఆంధ్రభూమి వారపత్రికలోని పవర్ పాలిటిక్స్ శ్ర్ర్షికన ఈవారం చదువుల పవర్ పాలిటిక్స్ విశ్లేషణ వుంటుంది.

గురువారం ఆంధ్రప్రభ చిత్రప్రభలో నవలలను సినిమాలుగా మలచటం గురించి చర్చ కొనసాగుతుంది. నా కొత్త పుస్తకం విడుదలవుతోంది.

ఆగస్ట్ 29 న త్యాగరాయ గాన సభ మినీ హాలులో నేను రాసిన డైరెక్ట్ జీవిత చరిత్ర విడుదలవుతోంది. ఇంతకీ నేను రాసిందెవరి జీవితచరిత్రనో ఊహించండి?

ఒక క్లూ… ఆరోజే అతడి పుట్టినరోజు!

వివరాలు త్వరలో!!11

August 22, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , ,  · Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-18

ఈవారం చాలా బిజీ బిజీగా గడచింది.

ఆఫీసులో కూడా చాలా పనివుండటంతో, రాత పనులు ఇంకా వుండటంతో కంప్యూటర్ దగ్గరకు వచ్చే తీరిక లభించలేదు.

ఈవారం నేనో పుస్తకం రాశాను. అది అతి త్వరలో విడుదలవుతుంది. పుస్తకం వివరాలు ఇప్పుడే చెప్పటంలేదెందుకంటే, ఇది తిన్నగా పుస్తక రూపంలోనే వస్తోంది. విడుదలయ్యేవరకూ ఎవ్వరికీ పుస్తకం గురించి తెలియకూడదని ప్రచురణకర్త ఆదేశాలు.

ఈవారం వార్తలో బ్లాగ్ స్పాట్ శీర్షికలో అరుంధతీరాయ్ బ్లాగు పరిచయం వుంటుంది. రంగుటద్దాల మేధావులకు ఆమె ప్రతీక. ఆమె బ్లాగు అందుకు నిదర్శనం.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషికీసారి మరో సందేహం వచ్చింది. అవినీతి ఆరోపణలక్రింద ఎప్పుడూ వంద వెయ్యి తీసుకునేవారే పట్టుబడతారుకానీ, లక్షలు, కోట్లు తీసుకునేవారెందుకు పట్టుబడరన్నది అతడి సందేహం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయ విశ్లేషణ సాగుతుంది.

గురువారం ఆంధ్రప్రభ అనుబంధం చిత్రపభలో సినీసిత్రాలు శీర్షికన సినిమాలుగా మారిన నవలల చర్చ కొనసాగుతుంది. ఈసారి చర్చ ఆర్ కే నారాయణ్ నవల గైడ్ సినిమా నవలల గురించి.

ఇవీ ఈవారం నా రచనల వివరాలు.

నేను కొత్తగా రాసిన పుస్తకం గురించి చర్చించాలని ఆత్రంగా వుంది. కానీ, ప్రచురణకర్త కిచ్చిన మాట నోరు కట్టేస్తోంది. పుస్తకం బాగా వచ్చింది. ప్రస్తుతం బాగా చర్చలోవున్న అంశం ఆధారంగా రచించినది. పాఠకులను విపరీతంగా ఆకర్శిస్తుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే తెలుగులో ఇంతవరకూ ఇలాంటి రచన సంవిధానాన్ని ఎక్కువగా వాడలేదు. డీటేపీ కూడా వేగంగా సాగుతోంది. బహుషా వచ్చేవారానికల్లా ముద్రణ అయిపోతుంది. వివరాలను ఇలా కష్టపడుతూ దాచుకునే బాధ తీరిపోతుంది.

ఈవారం నా రచనలపైన మీ అభిప్రాయం నిర్మొహమాటంగా తెలపాలని ప్రార్ధన.

ఇంతకీ, నా కొత్త సొంతగూడు ఎలావుంది?

July 11, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , ,  · Posted in: నా రచనలు.

ఒక జర్నలిస్టు ఆత్మ విమర్శ- పరిచయం!

BOOK COVERజర్నలిస్టు అనే పదానికి అర్ధం మారుతోంది. జర్నలిస్టు గురించి ప్రజలలో అభిప్రాయం మారుతోంది.

ఒకప్పుడు జర్నలిస్టు మేధావి. ఉత్తమ నడవడితో, ఉన్నత మయిన ఆలోచనలతో సమాజాభ్యున్నతి కోరి అందుకు నడుము కట్టినవాడు జర్నలిస్టు. అవినీతికి వ్యతిరేకి. అన్యాయాన్ని అడ్డుకునే వివేకి. ఉత్తమ ఆలోచనలు, ఉన్నత లక్ష్యమూ, భాషపైన పట్టు, రచనలో ప్రావీణ్యమూ, సామాజిక మనస్తత్వం పైన అవగాహన, చరిత్రగురించి ఆలోచన, భూత వర్తమానకాలాల సమన్వయం తో భవిష్యత్తుపైన దృష్టి కలిగి సమాజ హితం కోసం కలాన్ని ఆయుధం లా, సత్యాన్ని శస్త్రంలా వాడేవాడు జర్నలిస్టన్న అభిప్రాయంవుండేది. జర్నలిస్టంటే సమాజంలో గౌరవమన్ననలుండేవి.

కానీ ఇప్పుడు, టంకశాల అశోక్ గారి మాటలలోనే చెప్పాలంటే, ‘ ప్రపంచాన్ని ప్రజలకు చూపవలసిన జర్నలిజపు చూపుడువేలు వంకరలు తిరుగుతున్నది.’

వమకరలు తిరిగిన చూపుడువేలు మళ్ళీ తిన్నగా అవ్వాల్సిన అవసరంవుంది. ఇందుకు ప్రతి జర్నలిస్టు ఆత్మవిమర్శ చేసుకోవాల్సివుంటుంది. ఆ దిశలో ఒక సీనియర్ జర్నలిస్టు, వార్త పత్రిక సంపాదకుడు, శ్రీ టంకశాల అశోక్ , ఇతర జర్నలిస్టులకు మార్గదర్శకత్వంగా వేసిన అడుగు ఈ పుస్తకం.

పిల్లి మెడలో గంట ఎవరో ఒకరు కట్టాలి. ప్రతివారూ పక్కవారు గంట కట్టాలనుకుంటారు. జర్నలిజం రంగంలో వున్న అవకతవకలను, అస్తవ్యస్తాన్ని, అవినీతినీ, అవలక్షణాలనూ ఎత్తి చూపించే పిల్లిమెడలో గంట కట్టటంలాంటి పనిని చేస్తుందీ పుస్తకం.

ఈ పుస్తకంలో మొత్తం 30 వ్యాసాలున్నాయి. డయానా మరణానికి కారకులెవరు అన్నది తొలి వ్యాసం. నాగసూరి వేణు గోపాల్ గారి పుస్తకానికి రాసిన ముందుమాట, అశోక్ గారి నిక్కచ్చితనం, నిర్మొహమాట తత్వాన్ని స్పష్టం చేస్తాయి.

ఒక సమస్య వుంటే దాన్ని దాచి అదిలేదన్నట్టు ప్రవర్తించటం వల్ల సమస్య పరిష్కారం కాదు. సమస్యను సూటిగా ఎదుర్కోవాలి. నిక్కచ్చిగా కారణాలు వెదకాలి. నిర్మొహమాటంగా పరిష్కారాలు ఆలోచించాలి. నిర్భయంగా పరిష్కారాలను అమలుపరచాలి. అప్పుడు సమస్య పరిష్కారమవుతుంది. ఇది జరగనంత కాలం, అసలు రోగాన్ని కప్పిపెట్టి, పై పై లక్షణాలకు మందు వేస్తే అసలు రోగం పెరగటమే కాక, కొత్త రోగాలొస్తాయి. ఈ నిజాలను అంతే నిక్కచ్చిగా ప్రదర్శిస్తాయి ఈ సంకలనంలోని వ్యాసాలు.

సూటిగా సమస్యను వివరించటం, లోతుగా విశ్లేషించటం, అన్ని కోణాలలోంచి సమస్యను పరిషీలించటం, ఆపైనే పరిష్కారాలు సూచించటం మనకు కనిపిస్తుంది.

ఈ వ్యాసాలలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది, అశోక్ గారి సమన్వయ దృక్కోణం. సంకుచితత్వ రాహిత్యం.

తెలుగు జర్నలిస్టుల ఇంగ్లీషు వాడకం, జర్నలిజం పరిణామక్రమంలో నడమంత్రపు మీడియా, తెలుగు భాషకు జర్నలిస్టుల హాని, జర్నలిజం అంతిమ పతనం ఏది, జర్నలిజం అంతటా అవే సమస్యలు ఇలా ఈ సంకలనంలోని వ్యాసాలు, వాటి అమ్షాలూ ఆసక్తి కలిగించటమే కాదు, అవగాహననూ, ఆలోచనలనూ కలిగిస్తాయి. రచయిత సూటి ప్రశ్నలు, నిక్కచ్చి వివరణలు, నిర్మొహమాట పరిష్కారాలూ ఆనందింప చేస్తాయి. నిజమంటేనే ఆమడ దూరం పారిపోయే మన సమాజంలో ఒకరయినా నిర్భయంగా వున్నదున్నట్టు చెప్తున్నందుకు సంతోషం కలుగుతుంది.

గమనిస్తే, ఒకప్పుడు జర్నలిస్టు అంటే మేధావితో పాటుగా మంచి రచయిత కూడా. అనేక రాజకీయ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, వైఙ్నానిక, మానసిక, తాత్విక అంశాలపైన రచనలు చేసేవారు జర్నలిస్టులు.

నండూరి రాం మోహన్ రావు, నండూరి పార్థ సారథి, ముట్నూరి కృష్ణా రావు, పిరాట్ల వెంకటేష్వర్ రావు, గోరా శాస్త్రి, నార్ల వెంకటేశ్వర రావు, ఇలా ఒకప్పుడు జర్నలిస్టంటే ఎంతో గౌరవం వుండేది. వారు స్వయంగా వివిధామ్షాలపైన పుస్తకాలు రచించినవారయివుండేవారు. విదేషీ జర్నలిజంలో ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. మార్ టుల్లీ తో సహా అనేక జర్నలిస్టులు పుస్తకాలను ప్రచురించారు.

మన దగ్గర ఎంవీయార్ శాస్త్రి, రామ చంద్ర మూర్తి, టంకశాల అశోక్ వంటి కొందరు జర్నలిస్టులు మాత్రమే ఇంకా ఆ పాత జర్నలిజం పద్ధతి ఔన్నత్యాన్ని నిలబెడుతున్నారు.
అందుకే ఈ పుస్తకం జర్నలిస్టు ప్రాధాన్యాన్ని వహిస్తుంది.

జర్నలిస్టులేకాదు, రచయితలూ, పాఠకులూ, సామాన్యులూ కూడా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం వల్ల మనకు కనిపించే విషయాలలో నిజాన్ని సులభంగా గ్రహించగలుగుతాం. ఈ పుస్తక ప్రభావంతో సమాజానికి మార్గదర్శనం చేయగల వృత్తిలో ఉన్న జర్నలిస్టులలో ఆత్మ విమర్శకు నాంది పలికితే అంతకన్నా మరొకటి అవసరం లేదు.

ఒకసారి ఓ ప్రఖ్యాత జర్నలిస్టు ఒక శీర్షిక ఆరంభించాడట. ఆ శీర్షిక పాఠకులు మెచ్చరు అది ఆపై అన్నారట పత్రికలవాళ్ళు. దానికి అతడు సమాధానంగా, ప్రజల అభిరుచులను ఏర్పరచాల్సింది మనము. ప్రజల అభిరుచికనుగుణంగా మనం మారితే మన ప్రతిభ పనికిరానిది, అన్నాడతడు.

ఇది, జర్నలిస్టులకే కాదు, కళాకారులకూ వర్తిస్తుంది.

ఒక జర్నలిస్టు ఆత్మవిమర్శ.
రచన- టంకశాల అశోక్
ప్రతులకు; అన్ని పుస్తక కేంద్రాలు
ప్రొగ్రెస్సివ్ కమ్యూనికేషన్స్
1-3-176/18
కవాడిగూడా, హైదెరాబాదు-80.
ఫోను;- 9849639350.
వెల; 60/-

June 1, 2009 ·  · 2 Comments
Tags: , , ,  · Posted in: పుస్తక పరిచయము

ఈ వారం నా రచనలు-4

ఎప్పటిలాగే, ఈ ఆదివారం విడుదలయ్యే వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ వుంటుంది. ఈ శీర్షికన ఈసారి, రాబిన్ శర్మ బ్లాగు పరిచయం చేశాను. ది మాంక్ హూ సోల్డ్ ఫెరారి, హూ విల్ క్రయ్ వెన్ యూ డయ్ లాంటి హిట్ వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత అతడు.

క్రితం ఆదివారం ఆంధ్రప్రభ  ఆదివారం అనుబంధం పూర్తిగా ఉగాది ప్రత్యేకం కావటంతో మామూలుగావుండే శీర్షికలు లేవు. దాంతో, క్రితం వారం రావాల్సిన భయాలు ఈవారం వస్తాయి.

ఆంధ్రభూమి వార పత్రికలోని పవర్ పాలిటిక్స్ శీర్షికన, ప్రస్తుతం జరగబోయే లోక సభ ఎన్నికల కోసం వివిధ పార్టీలలో జరుగుతున్న పొత్తుల ఆరాటాలు, వేర్పడే కసరత్తుల గురించి విశ్లేషణ వుంటుంది.  ఈసారి పార్టీలకు వచ్చే సీట్లకన్నా, ప్రధాని పదవిపైన ఆశవున్న అభ్యర్ధులే ఎక్కువగా వున్నారు.

ఈభూమి అని ఒక కొత్త పత్రిక వస్తోంది. ఈ పత్రికలో అనుకోకుండా ఒక శీర్షిక ఆరంభించాల్సివచ్చింది. రసమయి అనే మాస పత్రికలో నేను హిందీ గేయ రచయితల గేయాలను, వారు చూపిన చమత్కారాలనూ విశ్లేషిస్తూన్నాను. ఆ పత్రిక ఈ ఏప్రిల్ సంచికతో ఆగిపోతోంది. ఇప్పుడు అదే శీర్షికను ఈ భూమి పత్రికలో ఆప్రిల్ సంచిక నుంచీ ఆరంభిస్తున్నాను. రసమయిలో రచనకీ, ఈభూమి శీర్షికకూ తేడా వుంది.

రసమయి సాంస్కృతిక పత్రిక. కాబట్టి, కాస్త లోతుగా విశ్లేషించేవీలుంది. పైగా, పాఠకులంతా ఉచ్చస్థాయి కళాకారులు, ఉత్తమాభిరుచి వున్నవారు. అందుకని, కాస్త స్కాలర్లీ విశ్లేషణకు వీలుండేది.

ఈ భూమి పాఠకులను కేవలం స్కాలర్లీ అనలేము. రసమయిలాగా, ఇది రీసెర్చ్ రచనల పత్రిక కాదు. కాబట్టి, సినీ సంగీత కళాకారుల పరిచయం రసమయిలోలాగా, తీరికగా, నెలలల తరబడి చేసేవీలు లేదు. ఒకో నెలా ఒకరి పరిచయం అయిపోవాల్సిందే.

మొదటగా సాహిర్ లూధియానవీ పరిచయంతో ఆరంభించాను. సాహిర్ గురించి, సినీ గీతాలలో ఆయన పొందుపరచిన అయద్భుతమయిన భావాలగురించి ఎంత రాసినా తనివితీరదు. అయినా, పత్రిక పరిమితుల దృష్ట్యా ఒక్క సంచికతో సాహిర్ పరిచయాన్ని ముగించాను.

ఈనెల దివ్యధాత్రి మాస పత్రికలో ద్రష్ట సీరియల్ కొత్త మలుపు తిరుగుతంది. వారణాసి లోని స్వర్ణ శివ మందిరం పైన తురుష్కుల దాడికి రంగం సిద్ధమవుతుంది.

దివ్య ధాత్రిలోనే, దివ్య వ్యక్తిత్వాల శీర్షికన కుంభకర్ణుడి వ్యక్తిత్వ విశ్లేషణ వుంటుంది. కుంభకర్ణుడి రాక్షసత్వం నీడన మరుగునపదిన అతని మంచితనం గూర్చి వివరణ వుంటుంది.

ఆంధ్రభూమి దినపత్రిక గురువారం చిత్రభూమి అనే అనుబంధం వుంటుంది. సినెమా సిత్రాలు అనే శీర్షికన, ఈవారం కూడా కామెడీ సినిమా స్క్రిప్టుల గ్రించిన చర్చ కొనసాగుతుంది. 

కౌముది మాస పత్రికలో కథాసాగరమధనం శీర్షికన జనవరీ- ఫిబ్రవరీ నెలలలో వివిధ వార, దిన, మాస పత్రికలలో ప్రచురితమయిన కథలలోంచి నాకు నచ్చిన కథల పరిచయంవుంటుంది. వాటిల్లోంచి నాకు అత్యుత్తమంగా అనిపించిన కథను అందిస్తున్నాను. మీరూ నా అభిప్రాయాన్ని, కథను చదివి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించవచ్చు. ఆరోగ్యకరమయిన చర్చ జరగాలన్నది నా కోరిక.

ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ అభిప్రాయాన్ని  నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారని ఆశిస్తున్నాను.

March 29, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , , , ,  · Posted in: Uncategorized