ఒబామా- పుస్తక పరిచయం!
తెలుగులో సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులకు సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ. ఇది సాహిత్యానికేకాదు, సినిమాలకూ ఇతర కళలకూ వర్తిస్తుంది.
ఏదయినా సంఘటన జరగగానే ఆ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలను వివరిస్తూ విశ్లేషిస్తూ వచ్చే పుస్తకాలు చాలా అరుదు. అందుకే, గుడిపాటి రచించిన ఒబామా- స్ఫూర్తిదాయక విజయగాథ, ఆనందం కలిగిస్తుంది.
నిజానికి, మన ప్రచురణకర్తలకూ, రచయితలకూ పాఠకులపైన నమ్మకమూ, గౌరవమూ తక్కువే. పాఠకులు ఇవే చదువుతారని నిర్ణయించి అలాంటివే ఇస్తూ పాఠకుల చదివే అలవాట్లపైన పరిమితులు విధించారు. వారి పఠనాసక్తులను చట్రంలో బిగించారు.
ఇందుకు నిదర్శనాలనేకం. మన తెలుగులో విశ్లేషణాత్మకమయిన రచనలు తక్కువ. జీవిత చరిత్రలు తక్కువ. సమకాలీన రాజకీయ పరిస్థితులను వివరించే పుస్తకాలు ( జెనెరల్ నాలెడ్జ్ వదిలేస్తే) లేవు. దేశాన్నేకాదు, ప్రపంచాన్ని కుదిపేస్తున్న తీవ్రవాదం పైన తెలుగులో వచ్చిన పుస్తకం నాదే. మన ప్రధానమంతృలు, ముఖ్యమంతృలందరి గురించి వున్న ఏకైక పుస్తకం నేను రచించిందే. అంటేనే అర్ధం చేసుకోవచ్చు మన తెలుగులో పాఠకుల పఠనాసక్తిపైన ఎన్ని పరిమితులున్నాయో.
అందుకే, ఒబామా రాజకీయ విజయ గాథను గుడిపాటి రాసి, ప్రచురించటం ఒక రకంగా సాహస గాథ అనవచ్చు.
అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికవటం ఒక చారిత్రాత్మక సంఘటన. అణచివేతకుగురయిన నల్లవారు అమెరికాలో తమ శక్తిని గుర్తిస్తున్నారనటానికి నిదర్శనం. ప్రపంచంలో పలురకాలుగా అణచివేతకు గురవుతున్న వారందరికీ ఆశాకిరణం.
అందుకే ఒబామా, జీవితం, అతని ఎదుగుదా, అతని మానసిక స్థితి, వ్యక్తిత్వం, ఆయన ఎల్లా రాజకీయాలలోకి వచ్చారు, ఏయే అమ్షాలు ఆయనను విజేతను చేశాయి అన్న విషయాలను వివరించి విశ్లేషించి పాఠకులకు అందించటం అత్యంత ఆవశ్యకమయినది. ఇంతవ్రకూ అలాంటి పుస్తకం తెలుగులో లేదు. గుడిపాటి రచించిన ఈ పుస్తకం ఆలోటును తీరుస్తుంది.
ఒబామా విజయ గాథను 23 అధ్యాయాలలో వివరిస్తుందీ పుస్తకం. మొదటి అధ్యాయం ముందుమాట లాంటిది. పుస్తకరచనకు ప్రేరణను వివరిస్తుంది.
రెండవ అధ్యాయ్సంలో పూర్వరంగం వుంటుంది. దీన్లో అమెరికాలో నల్లవారి స్థితిగతుల పరిచయం జరుగుతుంది.
మూడవ అధ్యాయంలో ఒప్బామా తల్లి తండ్రి వారి నేపధ్యాలు తెలుస్తాయి.
నాలుగవ అధ్యాయం నుంచి, ఎనిమిదవ అధ్యాయం వరకు, ఒబామా బాల్యం, అతనిపై ప్రభావాలు, చదువు, మిషెల్ తో పరిచయం , వివాహం వంటి సంఘటనలు, ఒబామా వ్యక్తిత్వ ఎదుగుదలను చూపుతూ సాగుతాయి.
తొమ్మిదవ అధ్యాయం నుంచి, 13వ అధ్యాయం వరకూ ఒబామా రాజకీయాల ప్రవేశం, సెనేటర్ గా ఓటమి, ఎన్నికవంటి విషయాలు వుంటాయి.
15వ అధ్యాయం ఒబామా రచనలను వివరిస్తుంది.
16లో అధ్యక్షపదవి పోటీ, 17లో గెలుపు ప్రాధాన్యం వుంటాయి. అయితే, అధ్యక్షపదవిపోటీ మరింత వివరంగా వుండాల్సింది. ఎందుకంటే, ఎలాంటి రిజెర్వేషన్లూ లేకుండా, తెల్లవారిని వారి ప్రామాణికాలతోనే తన పార్టీలోనూ, ప్రత్యర్ధిపార్టీలోనూ ఓడించి, నల్లవారికి ఎలాంటి క్రచ్చులూ, ప్రత్యేకతలూ అవసరంలేదనీ, నలుపూ, తెలుపూ అన్నవి శరీరానికేతప్ప మనసుకుకావనీ ఒబామా నిరూపించటం ఎంత ప్రాధాన్యం వహించే విషయం. అయితే, పుస్తకమంతా రచయిత రిపోర్టింగ్ పద్ధతిలో రచించటంవల్ల ఈ అధ్యాయంకూడా అలాగే సాగింది.
చివరి అధ్యాయాలు ఒబామా ఆరోగ్యపుటలవాట్లు, ఆయన మెచ్చిన పుస్తకాల వివరాలు, ఒబామా గెలుపును ఎలా అర్ధం చేసుకోవాలి అన్న విశ్లేషణలుంటాయి. 22వ అధ్యాయంలో ఒబామా జీవన క్రమం, 23లో ఉపయుక్త గ్రంథావళి వున్నాయి.
ఇంగ్లీషు పుస్తకాలు చదివేవారు, ఒబామా గురించి తెలుగు పుస్తకాన్ని చులకనగా చూడవచ్చు. కానీ, తెలుగులో పుస్తకాల ప్రచురణలో సాధక బాధకాలు తెలుసుకుంటున్న మనం ఇలాంటి ప్రయోగాలకు ప్రోత్సాహాన్నివ్వాలి. ఇలాంటి పుస్తకాలను ఆదరించాలి.
ఇలాంటి పుస్తకాలకు ఆదరణ వున్నదని నిరూపిస్తే, తెలుగు రచయితలు, ప్రచురణకర్తలు కూడా మరింత రీసెర్చ్ జరిపించి, మరింతగా ఇలాంటి పుస్తకాల ప్రచురణపై దృష్టి పెడతారు. అదీగాక, విద్యావంతులకు, పట్టణాలలో వున్నవారికీ ఆంగ్ల పుస్తకాలు దొరకటం కష్టం కాదు. కానీ, రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తెలుగు పుస్తకాలు లభ్యమవటమే గగనం. అలాంటి వారికి ఒబామా గురించి సమగ్రమయిన సమాచారాన్నందించి, ఒక అభిప్రాయాన్ని ఏర్పరచటంలో ఈ పుస్తకం దోహదపడుతుంది. కాబట్టి, ఈ పుస్తకాన్ని తాము కొనటమేకాక పదిమందికీ చెప్పి కొనిపించాలి. అప్పుడే వైవిధ్యభరితమయిన పుస్తకాలింకా వచ్చేవీలుంటుంది. ఈపుస్తకం వెల కూడా తక్కువే. కేవలం 50 రూపాయలే.
ఒబామా
స్ఫూర్తిదాయక విజయ గాథ.
రచన- గుడిపాటి.
ప్రతులకు- పాలపిట్ట
16-11-20/6/1/1
సలీం నగర్, మలక్ పేట్
హైదెరాబాద్-36.
ఈ మెయిలు- palapittabooks@gmail.com
వెల- 50 రూపాయలు.
పేజీలు-152.
May 29, 2009
·
·
No Comments
Tags: అణచివేత., అమెరికా, ఒబామా, తెలుగుపుస్తకాలు, రాజకీయాలు · Posted in: పుస్తక పరిచయము






